మగధీరగా ముదిత: ‘ఏం నటిస్తున్నావయ్యా బాబూ’!

K Mangadevi: Vizianagaram Woman Stage Artist Playing Satya Harichandra - Sakshi

పౌరాణిక నాటకాల్లో రాణిస్తున్న మంగాదేవి

యూ ట్యూబ్‌లో హరిశ్చంద్ర సంపూర్ణ పద్య చలన చిత్రం

హరిశ్చంద్ర పాత్రధారిణిగా సోషల్‌ మీడియాలో ప్రత్యేక గుర్తింపు

స్త్రీ పాత్రను పురుషులు వేసి మెప్పించడం సహజమే.. హావభావాలతోపాటు గాత్రం కూడా మారుతుంది. కానీ స్త్రీలకు అలా కాదు.. గాత్రాన్ని మగ గొంతుగా మార్చడం కష్టం. సాంఘిక నాటకాలంటే ఎలాగో ఆ గంట, రెండు గంటలు మేనేజ్‌ చేయవచ్చు. కానీ పౌరాణికంలో చాలా కష్టం. ఎందుకంటే పద్యాలు.. రాగాలాపనలు కొద్ది నిమిషాలపాటు సాగుతుంటాయి. ఇంతటి క్లిష్టమైన రంగంలో రాణిస్తూ తన ప్రతిభను చాటుకుంటోంది జిల్లాకు చెందిన మంగాదేవి.

సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఇక్ష్వాకు వంశ చక్రవర్తి... సత్యాన్ని జీవిత లక్ష్యంగా భావించిన మహారాజు సత్యహరిశ్చంద్రుడు. ఈయన జీవితం ఆదర్శనీయం.. మార్గం అనుసరణీయం. అటువంటి హరిశ్చంద్రుడి జీవితగాథ సినిమాగా, నాటకంగా దేశ వ్యాప్తంగా ఎందరినో ప్రభావితం చేయగా... మన రాష్ట్రంలో వీటితోపాటు హరికథగా, బుర్రకథగా ప్రాముఖ్యత సంపాదించింది. అన్నింటా హరిశ్చంద్ర పాత్రను పురుషులే పోషించగా తొలిసారి ఓ మహిళ ఈ పాత్రను పోషించి మెప్పిస్తున్నారు. వేదిక ఏదైనా మగవారి పాత్రల్లో ఇమిడిపోతున్నారు. తాను స్త్రీననే సందేహం కూడా ఎవరికీ రాకుండా చక్కని గాత్రం, హావభావాలతో ఆహూతుల ప్రశంసలు అందుకుంటున్నారు. నాటక రంగం నుంచి అంచెలంచెలుగా ఎదిగి వెండితెరకు తన ప్రయాణాన్ని సాగించి సినీ దర్శకులతో ‘ఔరా’ అనిపించుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి.. రంగస్ధలంపై అర్జునుడు, హరిశ్చంద్రుడు, రాముడు, కృష్ణుడు తదితర పురుష పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె పేరు కె. మంగాదేవి. 

పడుచు పిల్లాడిని కాదు ఆడపడుచును...
ఓ ఊరులో శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. హరిశ్చంద్ర నాటకం మొదలయిది. ‘దేవీ కష్టము లెట్లున్నను... పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించితిమి’ అంటూ హరిశ్చంద్రుడు వేదిక మీదకు ప్రవేశించాడు. ఆకట్టుకునే ఆహార్యం.. ఖంగుమంటున్న కంఠం. స్పష్టమైన ఉచ్ఛారణతో నటనలో చెలరేగిపోతున్నాడు ఆ నటుడు.. నాటకం పూర్తయి చదివింపుల పర్వం మొదలైంది. పంచెలు కొనుక్కోమని హరిశ్చంద్రుడి పాతధారికి కట్నాలు సమర్పిస్తున్నారు. అప్పుడా పాత్రధారి మైకులో ‘మీ దీవెనలు నాకు... శ్రీరామరక్ష, మీ అభిమానమే  కొండంత అండ.. మీరిచ్చిన డబ్బుతో పంచెలు కాదు, చీరెలు కొనుక్కుంటాను. నేను మీ ఆడపడుచున’ని ముగించడంతో జనం ఆశ్చర్యపోయారు. అప్పటికిగానీ హరిశ్చంద్రుని పాత్రను పోషించింది మహిళ అని వారికి తెలియలేదు.   

బాల్యం నుంచే...
విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం బాలగుడబ గ్రామానికి చెందిన 32 ఏళ్ల మంగమ్మ చదివింది పదో తరగతే అయినా 12 ఏళ్ల ప్రాయంలోనే పాఠశాలలో పద్యాలు పాడుతూ కూనిరాగాలు తీసేవారు. ఆమె అభిరుచి గమనించిన ఉపాధ్యాయులు ఆ దిశగా ప్రోత్సహించడం మొదలుపెట్టారు. మంగమ్మకు సత్యహరిశ్చంద్రుని పాత్రలో నటించడం ఇష్టమని గుర్తించిన కుటుంబీకులు తొలుత శ్రీకాకుళం జిల్లా పాలకొండ ప్రాంతానికి చెందిన పోతల లక్ష్మణ దగ్గర శిక్షణ కోసం చేర్పించారు. సత్య హరిశ్చంద్ర పౌరాణిక నాటకంలో చంద్రమతి పాత్రనే వేయాల్సిందిగా గురువు కోరినప్పటికీ సత్య హరిశ్చంద్రపాత్రనే ఏరికోరి ఎంచుకున్నారు మంగాదేవి. ఉత్తరాంధ్రలోనూ, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఆమె గుర్తింపు పొందారు. అర్జునుడు, కృష్ణుడు, రాముడు పాత్రల్లో కూడా శభాష్‌ అనిపించుకున్నారు.


యూట్యూబ్‌లో హరిశ్చంద్ర
శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం, మందరాడ గ్రామానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత, పౌరాణిక రంగస్థల కళాకారులైన యడ్ల గోపాలరావు దర్శకత్వంలో సత్యహరిశ్చంద్ర సంపూర్ణ పద్య చలన చిత్రం రూపొందింది. దీనిలో హరిశ్చంద్ర పాత్రను మంగాదేవి పోషించారు. ఇటీవలే ఈ చిత్రాన్ని యూ ట్యూబ్‌లో విడుదల చేశారు.

ఏం నటిస్తున్నావయ్యా బాబూ
నన్ను మగవాడననుకుని ఏం నటిస్తున్నావయ్యా బాబూ అని అభినందిస్తుంటారు. తీరా ఆడపిల్ల అని తెలుసుకుని విస్మయానికి లోనవుతారు. మా నాన్న నన్ను మగపిల్లాడిలాగానే పెంచారు. రాజాలా బతకాలనేవారు. నా హరిశ్చంద్ర వేషం చూసి నిజంగా రాజాలాగానే ఉన్నావంటూ కన్నీరు పెట్టుకునేవారు. పన్నెండేళ్ల కిందట నేనో నాటకం వేస్తుంటే మా జిల్లాలోని బలిజిపేట మండలానికి చెందిన అరసాడ గ్రామవాసి సూర్యరావు నన్ను ఆశీర్వదిస్తూ చదివింపులు పంపించారు. తర్వాత  అతడు ప్రతి ప్రోగ్రామ్‌కి వస్తుండేవారు. అలా మాటలు కలిశాయి. మనసులూ కలిశాయి, వివాహం చేసుకున్నాం. నాటకం నాకు బంగారంలాంటి భర్తను కూడా ప్రసాదించింది. నా కూతురు నా పాత్రలు చూసి నిన్ను అమ్మా అని పిలవాలా? నాన్నా అని పిలవాలా? అని అడుగుతుంటే నవ్వొస్తుంటుంది.     
– కె. మంగాదేవి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top