నేడు జస్టిస్‌ అమానుల్లా ప్రమాణం | Sakshi
Sakshi News home page

నేడు జస్టిస్‌ అమానుల్లా ప్రమాణం

Published Sun, Oct 10 2021 5:28 AM

Justice Amanullah swears in today Andhra Pradesh High Court - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా ఆదివారం ప్రమాణం చేయనున్నారు. ఉ.10 గంటలకు హైకోర్టులో జరిగే కార్యక్రమంలో ఆయనతో ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి ప్రమాణం చేయించనున్నారు. పాట్నా హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ అమానుల్లాను రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి ఇటీవల ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. జస్టిస్‌ అమానుల్లా 1963 మే 11న బీహార్‌లో జన్మించారు. బీఎస్సీ ఎల్‌ఎల్‌బీ చదివిన ఆయన 1991 సెప్టెంబర్‌ 27న బీహార్‌ బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదయ్యారు.

పాట్నా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ మొదలుపెట్టి, సుప్రీంకోర్టు, ఢిల్లీ, కలకత్తా జార్ఖండ్‌ హైకోర్టుల్లో కూడా కేసులు వాదించారు. రాజ్యాంగపరమైన కేసులు, సర్వీసు కేసుల్లో మంచి నైపుణ్యం సాధించారు. 2006 నుంచి 2010 వరకు బీహార్‌ ప్రభుత్వ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా వ్యవహరించారు. 2010 నుంచి న్యాయమూర్తి అయ్యేంత వరకు ప్రభుత్వ న్యాయవాదిగా ఉన్నారు. పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరించారు. 2011 జూన్‌ 20న పాట్నా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన పాట్నా హైకోర్టులో నాల్గవ స్థానంలో కొనసాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఆయన రెండవ స్థానంలో కొనసాగుతారు.

నేడు సీజేకు వీడ్కోలు
ఇక ఛత్తీస్‌ఘడ్‌కు బదిలీపై వెళ్తున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామికి ఆదివారం హైకోర్టు వీడ్కోలు పలకనుంది. జస్టిస్‌ అమానుల్లా ప్రమాణ కార్యక్రమం పూర్తయిన తరువాత, జస్టిస్‌ గోస్వామికి వీడ్కోలు పలుకుతారు. జస్టిస్‌ గోస్వామి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఈ ఏడాది జనవరి 6న బాధ్యతలు చేపట్టారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement