జనసేన నేత భూదందా.. గన్‌తో బెదిరింపులు!

Janasena Leader Mukka Srinivas Settlement of Disputed Lands - Sakshi

వివాదాస్పద భూముల సెటిల్‌మెంట్‌

పార్టీని అడ్డుపెట్టుకుని అక్రమాలు

డాక్యుమెంట్లు, పాస్‌బుక్‌ల అక్రమ సేకరణ

తిరిగి అడిగితే గన్‌తో బెదిరింపులు

ఆరిలోవ స్టేషన్‌లో శ్రీనివాసరావుపై  ఫిర్యాదు చేసిన బాధితులు

ఆరిలోవ(విశాఖ తూర్పు): జనసేన నాయకుడిపై ఆరిలోవ పోలీస్‌స్టేషన్‌లో గురువారం ముగ్గురు వ్యక్తులు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. తమ భూములకు సంబంధించిన పత్రాలు తీసుకుని.. వాటిని తిరిగి ఇవ్వాలని అడిగితే గన్‌ చూపించి బెదిరిస్తున్నాడని అందులో పేర్కొన్నారు. కాగా.. వైఎస్సార్‌ సీపీ నాయకులు తన ఇంటిపై దాడి చేశారని అతను కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితులు తెలిపిన వివరాలివీ..  జీవీఎంసీ 10వ వార్డు ఆదర్శనగర్‌లో నివాసం ఉంటున్న ముక్క శ్రీనివాసరావు 2019 సాధారణ ఎన్నికల్లో జనసేన తరఫున విజయనగరం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. ఆయన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుంటాడు. ప్రధాన కార్యాలయం సీతమ్మధారలో ఉంది. వివాదంలో ఉన్న స్థలాలను పరిష్కరించడంలో దిట్టగా మధ్యవర్తులతో ప్రచారం చేయించుకుని.. తద్వారా భూదందాలకు పాల్పడుతుంటాడని పలువురు అంటున్నారు. ఈ నేపథ్యంలో రెండు కుటుంబాలకు చెందిన భూ వ్యవహారాల్లో ఆయన బండారం బయటపడింది.  

డాక్యుమెంట్లు అడిగితే బెదిరింపులు 
గాజువాక ప్రాంతం వడ్లపూడికి చెందిన ఇల్లపు రేవతికుమారి కుటుంబానికి చెందిన 67 సెంట్ల వివాదాస్పద భూమి వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. మధ్యవర్తుల ద్వారా ఆమె భర్త రమేష్‌బాబు జనసేన నాయకుడు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి శ్రీనివాసరావును కలిసి.. వివాదంలో ఉన్న తన భూమి వ్యవహారం గురించి చెప్పారు. సమస్యను పరిష్కరించేస్తానంటూ.. ఆ భూమిపై శ్రీనివాసరావు జీపీఏ(జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ) రాయించుకున్నాడు. అందుకు అయిన ఖర్చు రూ.80,009తో పాటు భూమిని వేరొకరికి విక్రయిస్తానని చెప్పి వారి నుంచి ఒరిజనల్‌ డాక్యుమెంట్లు తీసుకున్నాడు. ఇది జరిగి ఏడాది గడిచిపోయింది. ఎంతకీ ఈ వ్యవహారం పరిష్కారం కాకపోవడంతో తమ భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు తిరిగి ఇచ్చేయాలని ఇటీవల ఆమె భర్త సీతమ్మధారలోని కార్యాలయంలో శ్రీనివాసరావును అడిగారు.

డాక్యుమెంట్లు ఇవ్వకపోగా.. ఆ సమయంలో తనను శ్రీనివాసరావు గన్‌తో బెదిరించాడని రమేష్‌ తెలిపారు. దీంతో బాధితురాలు రేవతికుమారి, ఆమె భర్త, మరికొందరు కలిసి గురువారం ఆదర్శనగర్‌లోని శ్రీనివాసరావు ఇంటికి చేరుకున్నారు. తమ భూమి డాక్యుమెంట్లు ఇవ్వాలని అడిగారు. వారిపై శివాలెత్తిన శ్రీనివాసరావు 100కు ఫోన్‌ చేసి.. వైఎస్సార్‌ సీపీ నాయకులు తన ఇంటిపై దాడి చేస్తున్నారని ఫిర్యాదు చేశాడు. వెంటనే అక్కడకు చేరుకున్న ఆరిలోవ పోలీసులకు కూడా అలాగే ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ఇరువర్గాలను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. శ్రీనివాసరావు తన భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకుని ఇవ్వకుండా తిప్పుతున్నాడని.. అడిగితే గన్‌తో బెదిరిస్తున్నాడని బాధితురాలు రేవతికుమారి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అడగడానికి వచ్చిన తమను వైఎస్సార్‌ సీపీ నాయకులమని అంటున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.  

నా భర్తను గన్‌తో బెదిరించాడు  
మా భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవ్వాలని అడగడానికి వెళ్లిన నా భర్తను ముక్క శ్రీనివాసరావు గన్‌తో బెదిరించాడు. భయంతో నా భర్త ఇంటికి వచ్చి ఆత్మహత్యాయత్నం చేసుకోబోయారు. జీపీఏ చేయించడానికి ఖర్చుల కోసం శ్రీనివాసరావుకు ఫోన్‌ పే ద్వారా 99125 38999కు 2021 అక్టోబర్‌ 13న రూ.80,009 పంపించాం. అయినా పని జరగలేదు. డాక్యుమెంట్లు ఇవ్వమని అడగడానికి ఇంటికి వెళితే.. వైఎస్సార్‌ సీపీ నాయకులు దాడి చేస్తున్నారని మాపై తిరిగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మాకు పవన్‌ కల్యాణ్‌ అంటే ఎంతో ఇష్టం. మాతో వైఎస్సార్‌ సీపీ నాయకులెవరకూ లేరు. మా డాక్యుమెంట్లు ఇప్పించాలని పోలీసులను కోరుతున్నాం.  
– ఇల్లపు రేవతికుమారి, బాధితురాలు, వడ్లపూడి 

పాస్‌ బుక్‌ తీసుకుని.. నోటీస్‌ పంపాడు 
భీమిలి నియోజకవర్గం పరిధి దాకమర్రికి చెందిన ముగడ సింహాచలం పేరుతో ఉన్న సుమారు నాలుగు ఎకరాల్లో ఆమె కుటుంబ సభ్యులు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇది వివాదాస్పదం కావడంతో తెలిసిన మధ్యవర్తుల ద్వారా ఆమె కుమారులు కనక శ్రీనివాసరావు, రామప్పలనాయుడు, నాగ సూరిబాబు, ఎర్రయ్య ఏడాది కిందట శ్రీనివాసరావును కలిశారు. ఆ భూమికి సంబంధించిన వివరాలు చెప్పడంతో.. వారి నుంచి పాస్‌ పుస్తకాలు తీసుకున్నాడు. ఏడాది గడిచినా పని జరగలేదు. తమ పాస్‌ పుస్తకాలు ఇచ్చేయాలని శ్రీనివాసరావును అడిగితే.. గన్‌తో బెదిరించాడని బాధితులు తెలిపారు. కాగా.. ఆ భూమిని తనకు విక్రయించేశారని ఈ ఏడాది ఆగస్టు 1న శ్రీనివాసరావు వారికి నోటీస్‌ పంపించాడు. ఈ నేపథ్యంలో వారంతా గురువారం ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

మేమే భూమిని అమ్మేశామంట.. 
మా అమ్మ ముగడ సింహాచలం పేరుతో ఉన్న సుమారు నాలుగు ఎకరాల పంట భూమి వివాదంలో ఉంది. దీనిపై కొందరు మధ్యవర్తుల ద్వారా సీతమ్మధారలోని రియల్‌ ఎస్టేట్‌ ఆïఫీస్‌కు వెళ్లి శ్రీనివాసరావును కలిశాం. ఒరిజనల్‌ పాస్‌ బుక్‌లు తీసుకుని మీ పని రెండు నెలల్లో పూర్తి చేస్తానన్నాడు. ఏడాది గడిచినా పనికాలేదు. తీరా ఆ భూమిని మేమే అతనికి విక్రయించేసినట్లు ఈ ఏడాది ఆగస్టు 1న మాకు నోటీస్‌ పంపించాడు. అతను మమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశాం. 
– ముగడ కనక శ్రీనివాసరావు, బాధితుడు, దాకమర్రి  

డబ్బులు అడిగితే చెయ్యి చూపిస్తున్నాడు 
ఆదర్శనగర్‌కు చెందిన అన్నం తిరుపతిరావు ఇంటి స్థలం కోసం శ్రీనివాసరావుకు 2019 జూలై 15న రూ.6 లక్షలు చెల్లించాడు. ఇప్పటికీ ఇంటి స్థలం ఇవ్వలేదు. డబ్బులు తిరిగి ఇచ్చేయాలని చాలా సార్లు అడిగితే.. ఇవ్వలేదు సరికదా ఎక్కడ కనిపించినా చేయి చూపించి బెదిరిస్తున్నాడని తిరుపతిరావు వాపోయారు. ఆయన నుంచి తన డబ్బులు తిరిగి ఇప్పించాలని పోలీసులను కోరారు. ఈ ఫిర్యాదులు స్వీకరించినట్లు సీఐ ఇమాన్యుయేల్‌ రాజు తెలిపారు. తన ఇంటి లోపలకు వైఎస్సార్‌ సీపీ నాయకులు ప్రవేశించారని శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారన్నారు. దాకమర్రికి చెందిన బాధితులు ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించి.. వారికి సంబంధించిన స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు. వారి వ్యవహారం ఆరిలోవ స్టేషన్‌ పరిధిలోనిది కాదన్నారు.  

పార్టీని అడ్డంపెట్టుకుని.. తప్పించుకునే ప్రయత్నం 
చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికే జనసేన నాయకుడు ముక్క శ్రీనివాసరావు ప్రయత్నిస్తున్నాడని పలువురు ఆరోపిస్తున్నారు. భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకుని.. వాటిని తిరిగి ఇచ్చేయాలని అడిగిన వారిని వైఎస్సార్‌ సీపీ నాయకులుగా చిత్రీకరించడం దారుణమన్నారు. జనసేన పార్టీని అడ్డం పెట్టుకుని బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాడని.. దీని వల్ల ఆ పార్టీకే నష్టమని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి వారి వల్ల తాము విమర్శలకు గురవుతున్నామని పలువురు జనసేన నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇల్లపు రేవతికుమారి, రమేష్‌ బాబు, ఇంటి స్థలం కోసం రూ.6లక్షలు ఇచ్చిన బాధితుడు తిరుపతిరావు కూడా పవన్‌ కల్యాణ్‌ అభిమానులు కావడం విశేషం. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top