breaking news
dispute lands
-
CJI Chandrachud: అయోధ్య సమస్య పరిష్కారం కోసం దేవుడిని ప్రార్థించా
పుణే: రామ జన్మ భూ మి–బాబ్రీ మసీదు వి వాదం పరిష్కారం కోసం భగవంతుడిని ప్రార్థించానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ చెప్పారు. భగవంతుడి పట్ల విశ్వాసం ఉంటే ఆయన కచ్చితంగా పరిష్కార మార్గం చూపిస్తాడని అన్నారు. జస్టిస్ చంద్రచూడ్ వచ్చే నెలలో పదవీ విరమణ చేయబోతున్నారు. ఆయన స్వస్థలం మహారాష్ట్రలోని ఖేడ్ తాలూకా కన్హేర్సార్. ఈ గ్రామ ప్రజలు ఆదివారం ఆయనను సత్కరించారు. కేసుల విచారణ సమయంలో న్యాయమూర్తులకు కొన్నిసార్లు పరిష్కార మార్గాలు కనిపించవని ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు. అయోధ్య వ్యవహారంపై విచారణ జరుగుతున్నప్పుడు ఇలాంటి పరిస్థితి తనకు ఎదురైందన్నారు. అప్పుడు భగవంతుడి సన్నిధిలో కూర్చొని ప్రార్థించానని, సమస్యకు పరిష్కారం చూపాలని వేడుకున్నానని తెలిపారు. తాను తరచుగా దేవుడిని ప్రార్థిస్తుంటానని పేర్కొన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అనుకూలంగా 2019 నవంబర్ 9న అప్పటి సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ధర్మాసనంలో జస్టిస్ చంద్రచూడ్ కూడా ఒక సభ్యుడే. -
జనసేన నేత భూదందా.. గన్‌తో బెదిరింపులు!
ఆరిలోవ(విశాఖ తూర్పు): జనసేన నాయకుడిపై ఆరిలోవ పోలీస్‌స్టేషన్‌లో గురువారం ముగ్గురు వ్యక్తులు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. తమ భూములకు సంబంధించిన పత్రాలు తీసుకుని.. వాటిని తిరిగి ఇవ్వాలని అడిగితే గన్ చూపించి బెదిరిస్తున్నాడని అందులో పేర్కొన్నారు. కాగా.. వైఎస్సార్ సీపీ నాయకులు తన ఇంటిపై దాడి చేశారని అతను కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితులు తెలిపిన వివరాలివీ.. జీవీఎంసీ 10వ వార్డు ఆదర్శనగర్‌లో నివాసం ఉంటున్న ముక్క శ్రీనివాసరావు 2019 సాధారణ ఎన్నికల్లో జనసేన తరఫున విజయనగరం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. ప్రధాన కార్యాలయం సీతమ్మధారలో ఉంది. వివాదంలో ఉన్న స్థలాలను పరిష్కరించడంలో దిట్టగా మధ్యవర్తులతో ప్రచారం చేయించుకుని.. తద్వారా భూదందాలకు పాల్పడుతుంటాడని పలువురు అంటున్నారు. ఈ నేపథ్యంలో రెండు కుటుంబాలకు చెందిన భూ వ్యవహారాల్లో ఆయన బండారం బయటపడింది. డాక్యుమెంట్లు అడిగితే బెదిరింపులు గాజువాక ప్రాంతం వడ్లపూడికి చెందిన ఇల్లపు రేవతికుమారి కుటుంబానికి చెందిన 67 సెంట్ల వివాదాస్పద భూమి వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. మధ్యవర్తుల ద్వారా ఆమె భర్త రమేష్‌బాబు జనసేన నాయకుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాసరావును కలిసి.. వివాదంలో ఉన్న తన భూమి వ్యవహారం గురించి చెప్పారు. సమస్యను పరిష్కరించేస్తానంటూ.. ఆ భూమిపై శ్రీనివాసరావు జీపీఏ(జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ) రాయించుకున్నాడు. అందుకు అయిన ఖర్చు రూ.80,009తో పాటు భూమిని వేరొకరికి విక్రయిస్తానని చెప్పి వారి నుంచి ఒరిజనల్ డాక్యుమెంట్లు తీసుకున్నాడు. ఇది జరిగి ఏడాది గడిచిపోయింది. ఎంతకీ ఈ వ్యవహారం పరిష్కారం కాకపోవడంతో తమ భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు తిరిగి ఇచ్చేయాలని ఇటీవల ఆమె భర్త సీతమ్మధారలోని కార్యాలయంలో శ్రీనివాసరావును అడిగారు. డాక్యుమెంట్లు ఇవ్వకపోగా.. ఆ సమయంలో తనను శ్రీనివాసరావు గన్‌తో బెదిరించాడని రమేష్ తెలిపారు. దీంతో బాధితురాలు రేవతికుమారి, ఆమె భర్త, మరికొందరు కలిసి గురువారం ఆదర్శనగర్‌లోని శ్రీనివాసరావు ఇంటికి చేరుకున్నారు. తమ భూమి డాక్యుమెంట్లు ఇవ్వాలని అడిగారు. వారిపై శివాలెత్తిన శ్రీనివాసరావు 100కు ఫోన్ చేసి.. వైఎస్సార్ సీపీ నాయకులు తన ఇంటిపై దాడి చేస్తున్నారని ఫిర్యాదు చేశాడు. వెంటనే అక్కడకు చేరుకున్న ఆరిలోవ పోలీసులకు కూడా అలాగే ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ఇరువర్గాలను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. శ్రీనివాసరావు తన భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకుని ఇవ్వకుండా తిప్పుతున్నాడని.. అడిగితే గన్‌తో బెదిరిస్తున్నాడని బాధితురాలు రేవతికుమారి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అడగడానికి వచ్చిన తమను వైఎస్సార్ సీపీ నాయకులమని అంటున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. నా భర్తను గన్‌తో బెదిరించాడు మా భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవ్వాలని అడగడానికి వెళ్లిన నా భర్తను ముక్క శ్రీనివాసరావు గన్‌తో బెదిరించాడు. భయంతో నా భర్త ఇంటికి వచ్చి ఆత్మహత్యాయత్నం చేసుకోబోయారు. జీపీఏ చేయించడానికి ఖర్చుల కోసం శ్రీనివాసరావుకు ఫోన్ పే ద్వారా 99125 38999కు 2021 అక్టోబర్ 13న రూ.80,009 పంపించాం. అయినా పని జరగలేదు. డాక్యుమెంట్లు ఇవ్వమని అడగడానికి ఇంటికి వెళితే.. వైఎస్సార్ సీపీ నాయకులు దాడి చేస్తున్నారని మాపై తిరిగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మాకు పవన్ కల్యాణ్ అంటే ఎంతో ఇష్టం. మాతో వైఎస్సార్ సీపీ నాయకులెవరకూ లేరు. మా డాక్యుమెంట్లు ఇప్పించాలని పోలీసులను కోరుతున్నాం. – ఇల్లపు రేవతికుమారి, బాధితురాలు, వడ్లపూడి పాస్ బుక్ తీసుకుని.. నోటీస్ పంపాడు భీమిలి నియోజకవర్గం పరిధి దాకమర్రికి చెందిన ముగడ సింహాచలం పేరుతో ఉన్న సుమారు నాలుగు ఎకరాల్లో ఆమె కుటుంబ సభ్యులు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇది వివాదాస్పదం కావడంతో తెలిసిన మధ్యవర్తుల ద్వారా ఆమె కుమారులు కనక శ్రీనివాసరావు, రామప్పలనాయుడు, నాగ సూరిబాబు, ఎర్రయ్య ఏడాది కిందట శ్రీనివాసరావును కలిశారు. ఆ భూమికి సంబంధించిన వివరాలు చెప్పడంతో.. వారి నుంచి పాస్ పుస్తకాలు తీసుకున్నాడు. ఏడాది గడిచినా పని జరగలేదు. తమ పాస్ పుస్తకాలు ఇచ్చేయాలని శ్రీనివాసరావును అడిగితే.. గన్‌తో బెదిరించాడని బాధితులు తెలిపారు. కాగా.. ఆ భూమిని తనకు విక్రయించేశారని ఈ ఏడాది ఆగస్టు 1న శ్రీనివాసరావు వారికి నోటీస్ పంపించాడు. ఈ నేపథ్యంలో వారంతా గురువారం ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేమే భూమిని అమ్మేశామంట.. మా అమ్మ ముగడ సింహాచలం పేరుతో ఉన్న సుమారు నాలుగు ఎకరాల పంట భూమి వివాదంలో ఉంది. దీనిపై కొందరు మధ్యవర్తుల ద్వారా సీతమ్మధారలోని రియల్ ఎస్టేట్ ఆïఫీస్‌కు వెళ్లి శ్రీనివాసరావును కలిశాం. ఒరిజనల్ పాస్ బుక్‌లు తీసుకుని మీ పని రెండు నెలల్లో పూర్తి చేస్తానన్నాడు. ఏడాది గడిచినా పనికాలేదు. తీరా ఆ భూమిని మేమే అతనికి విక్రయించేసినట్లు ఈ ఏడాది ఆగస్టు 1న మాకు నోటీస్ పంపించాడు. అతను మమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశాం. – ముగడ కనక శ్రీనివాసరావు, బాధితుడు, దాకమర్రి డబ్బులు అడిగితే చెయ్యి చూపిస్తున్నాడు ఆదర్శనగర్‌కు చెందిన అన్నం తిరుపతిరావు ఇంటి స్థలం కోసం శ్రీనివాసరావుకు 2019 జూలై 15న రూ.6 లక్షలు చెల్లించాడు. ఇప్పటికీ ఇంటి స్థలం ఇవ్వలేదు. డబ్బులు తిరిగి ఇచ్చేయాలని చాలా సార్లు అడిగితే.. ఇవ్వలేదు సరికదా ఎక్కడ కనిపించినా చేయి చూపించి బెదిరిస్తున్నాడని తిరుపతిరావు వాపోయారు. ఆయన నుంచి తన డబ్బులు తిరిగి ఇప్పించాలని పోలీసులను కోరారు. ఈ ఫిర్యాదులు స్వీకరించినట్లు సీఐ ఇమాన్యుయేల్ రాజు తెలిపారు. తన ఇంటి లోపలకు వైఎస్సార్ సీపీ నాయకులు ప్రవేశించారని శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారన్నారు. దాకమర్రికి చెందిన బాధితులు ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించి.. వారికి సంబంధించిన స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు. వారి వ్యవహారం ఆరిలోవ స్టేషన్ పరిధిలోనిది కాదన్నారు. పార్టీని అడ్డంపెట్టుకుని.. తప్పించుకునే ప్రయత్నం చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికే జనసేన నాయకుడు ముక్క శ్రీనివాసరావు ప్రయత్నిస్తున్నాడని పలువురు ఆరోపిస్తున్నారు. భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకుని.. వాటిని తిరిగి ఇచ్చేయాలని అడిగిన వారిని వైఎస్సార్ సీపీ నాయకులుగా చిత్రీకరించడం దారుణమన్నారు. జనసేన పార్టీని అడ్డం పెట్టుకుని బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాడని.. దీని వల్ల ఆ పార్టీకే నష్టమని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి వారి వల్ల తాము విమర్శలకు గురవుతున్నామని పలువురు జనసేన నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇల్లపు రేవతికుమారి, రమేష్ బాబు, ఇంటి స్థలం కోసం రూ.6లక్షలు ఇచ్చిన బాధితుడు తిరుపతిరావు కూడా పవన్ కల్యాణ్ అభిమానులు కావడం విశేషం. -
వివాదాస్పద భూములే నయీమ్ టార్గెట్
రాష్ట్రంలో ఎక్కడ లిటిగేషన్ ఉన్నా వాలిపోవాల్సిందే ఇందుకోసం ‘ప్రత్యేక’ నెట్వర్క్ ఏర్పాటు రాష్ట్ర వ్యాప్తంగా 32 కేసులు నమోదు సాక్షి, హైదరాబాద్: సులభంగా డబ్బు సంపాదించేందుకు ల్యాండ్ సెటిల్మెంట్లే అత్యుత్తమ మార్గంగా గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎంచుకున్నట్లు పోలీసు విచారణలో వెలుగు చూసింది. రాష్ట్రంలో ఎక్కడ వివాదాస్పద (లిటిగేషన్) భూమి ఉన్నా.. అక్కడ క్షణాల్లో వాలిపోయేలా నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నట్లు బయటపడింది. అందుకోసం ప్రత్యేకంగా ఓ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసి కేవలం లిటిగేషన్ భూముల మీదనే దృష్టి సారించినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. వివాదాస్పద భూముల సమాచారం తెలియగానే వాటిని ‘సెటిల్’ చేయడానికి నయీమ్ ప్రత్యేక బృందం రంగంలోకి దిగుతుంది. వారికి మాట వినకపోతే ‘భాయ్’ దగ్గర ప్రత్యేక ట్రీట్మెంట్ అందిస్తారు. అక్కడ సెటిల్ అయ్యేలా.. అంతకుమించి వారికి మరోమార్గం లేకుండా చేసే ప్రణాళిక రూపొందించుకున్నారు. పెద్ద డీల్ ఉన్న భూ లావాదేవీలన్నీ నయీమ్ కనుసన్నల్లోనే జరిగి నట్లు పోలీసులకు అనేక ఆధారాలు లభించాయి. నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై దర్యాప్తు చేసేందుకు సిట్ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. సిట్ చీఫ్ నాగిరెడ్డి నేతృత్వంలో గత పది రోజులుగా చేస్తున్న విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. భారీ మొ త్తంలో ఆస్తులు వెలుగు చూడటంతో.. అందులోనూ భూముల వివరాలు బయటపడటంతో ఆ దిశగా సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నయీమ్ డెన్స్లలో లభించిన ల్యాండ్ డాక్యుమెంట్ల విలువ మదింపు చేసేందుకు రెవెన్యూ అధికారుల సహాయం తీసుకుంటున్నారు. ఈ మేరకు పుప్పాలగూడలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే దాకా లెక్కింపు కొనసాగింది. అలాగే మిగతా ప్రాం తాల్లో కూడా డాక్యుమెంట్ల విలువను లెక్కించాలని సిట్ యోచిస్తోంది. సమాచారానికి ‘ప్రత్యేక’ నెట్వర్క్ భూ లావాదేవీలకు సంబంధించి పెద్ద మొత్తంలో డబ్బు వచ్చి పడుతుండటంతో నయీమ్ పూర్తిగా వాటి మీదే దృష్టి కేంద్రీకరించాడు. అందుకోసం అన్ని ప్రాంతాల్లో భూ లావాదేవీలకు సంబంధించిన సమగ్ర సమాచారం తనకు చేరేలా ‘ప్రత్యేక’ నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ బృందంలో రిజిస్ట్రేషన్ శాఖలో పనిచేసే కొంత మంది అధికారులు, డాక్యుమెంట్స్ రాసే వారినే నియమించుకున్నాడు. కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ల శాఖలో పదవీ విరమణ పొందిన వారి సేవలను వినియోగించుకున్నాడు. వారి సేవలకుగాను ప్రతీ నెల పారితోషికాలు, నజరానాలు అందించినట్లు సిట్‌కు కొన్ని ఆధారాలు లభించాయి. ‘పెద్ద’ వ్యక్తులూ నయీమ్ వద్దకే.. నయీమ్ భూ లావాదేవీలు మొదట్లో నల్లగొండ జిల్లాకే పరిమితం కాగా.. ఆ తర్వాత క్రమంగా రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, కరీంనగర్ జిల్లాలకు విస్తరించాయి. ఎంతటి వివాదాస్పద భూమైనా సరే నయీమ్ రంగ ప్రవేశం చేస్తే పరిష్కారం అయిపోతుంది. ఈ నేపథ్యంలో ‘పెద్ద’ వ్యక్తులందరూ కూడా నయీమ్‌ను ఆశ్రయించినట్లు సమాచారం. వారి వివరాలన్నీ నయీమ్ తన డైరీలో రాసుకున్నట్లు తెలిసింది. భారీగా నమోదవుతున్న కేసులు నయీమ్, అతని అనుచరులపై కేసుల పరంపర కొనసాగుతోంది. వారి ఆగడాలకు సంబంధించి సిట్ ప్రకటించిన టోల్‌ఫ్రీ నంబర్‌కు 150కి పైగా ఫోన్ కాల్స్ వచ్చాయి. కొంత మంది బాధితులు ఆధారాలతో సహా స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 32 కేసులు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలో 15, సైబరాబాద్ ఈస్ట్, వెస్ట్‌లలో 8, మహబూబ్‌నగర్ జిల్లాలో 4, కరీంనగర్ జిల్లాలో 4, నిజమాబాద్ జిల్లా ఒక కేసు నమోదయ్యాయి. టోల్‌ఫ్రీ నంబర్‌కు వచ్చిన ఫిర్యాదులపై సమీక్షిస్తున్న పోలీసులు.. ఆధారాలు లభ్యమైతే మరిన్ని కేసులు నమోదు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.