ఉద్దానానికి ఊపిరి 

Jagan showed permanent solution to kidney sufferers in uddanam  - Sakshi

దశాబ్దాల మహమ్మారికి సీఎం జగన్‌ శాశ్వత పరిష్కారం 

కిడ్నీ బాధితుల కోసం రూ.742 కోట్లతో వైఎస్సార్‌ సుజలధార 

ఇక ఇంటింటికీ కుళాయిల ద్వారా సురక్షిత మంచినీరు సరఫరా 

రక్షణ కవచంగా వైఎస్సార్‌ కిడ్నీ రీసెర్చ్‌ ఆస్పత్రి ఏర్పాటు 

అత్యాధునిక పరికరాలతో సూపర్‌స్పెషాలిటీ వైద్య సేవలు 

రేపు సీఎం చేతులు మీదుగా ఈ ప్రాజెక్టుల ప్రారంభానికి ఏర్పాట్లు 

గతంలో కిడ్నీ బాధితులపై చిర్రుబుర్రులాడిన చంద్రబాబు 

మరోవైపు.. డ్రామాలకే పరిమితమైన పవన్‌కళ్యాణ్‌

పచ్చటి ఉద్దానం కంట వెచ్చగా జారిన కన్నీటి బొట్లు.. దశాబ్దాలుగా గుండెలు పిండేసే కిడ్నీ బాధలు ఇక్కడెన్నో.. ఐదో తనం కోల్పోయిన తల్లులు, అమ్మనాన్నలకు దూరమైన పిల్లలు అడుగడుగునా కనిపిస్తారు. ఇక్కడ మనుషులకు కన్నీరు శాశ్వత నేస్తం. ఈ ఊళ్లకు ఉమ్మడి ఆస్తి కష్టం. ఈ కిడ్నీ వ్యాధి ఊళ్లకు ఊళ్లను తినేసింది. పరిస్థితి ఎక్కడికి వెళ్లిపోయిందంటే ఎంతకాలం రాసుంటే అంతకాలం బతుకుతాం, అప్పులు చేసి అనే వైరాగ్య పరిస్థితికి ఇక్కడి బాధితులు వెళ్లిపోయారు. నెలనెలా వేలకు వేలు ఖర్చుపెట్టి వైద్య పరీక్షలు, కిడ్నీ వైద్యం చేయించుకోలేక స్థానికంగా దొరికే మందు బిళ్లలో, ఆకులతోనో సరిపెట్టుకునేవారు.

ఇది నిన్నటి వరకు ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఈ చీకటి బతుకులకు సీఎం వైఎస్‌ జగన్‌ చరమగీతం పాడుతున్నారు. నాడు ప్రతిపక్ష నేత హోదాలో ఇచ్చిన హామీ మేరకు.. మూడు దశాబ్దాల సమస్యకు చెక్‌ చెబుతూ శాశ్వత పరిష్కారం చూపారు. రూ.742 కోట్లతో వైఎస్సార్‌ సుజలధార మంచినీటి ప్రాజెక్టు, రూ.85 కోట్లతో 200 పడకల డాక్టర్‌ వైఎస్సార్‌ కిడ్నీ రీసెర్చ్‌ ఆస్పత్రిని ఏర్పాటుచేశారు. ఈ రెండింటినీ ప్రారంభించే మహోన్నత ఘట్టాన్ని గురువారం సీఎం జగన్‌  ఆవిష్కరించనున్నారు. 

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/సాక్షి, అమరావతి/వజ్రపుకొత్తూరు రూరల్‌/వజ్రపుకొత్తూరు/మందస: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత ప్రజలను నాలుగు దశాబ్దాలుగా పీల్చిపిప్పి చేస్తున్న కిడ్నీ సమస్య సృష్టిస్తున్న కల్లోలం అంతాఇంతా కాదు. ఏళ్ల తరబడి నుంచి చాపకింద నీరులా ఈ ప్రాంతాన్ని కబళిస్తోంది. ఇక్కడున్న జనాభాలో 21 శాతానికి పైగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థంచేసుకోవచ్చు. ఇప్పటికే 15­వేల మంది చనిపోయినట్లు అంచనా. ఒక అం­చనా ప్రకారం.. జిల్లాలో 112 గ్రామాలు కిడ్నీ బారినపడి విలవిల్లాడుతున్నాయి. సాధారణంగా రక్తంలో సీరం క్రియాటిన్‌ 1.2 మిల్లీగ్రామ్‌/డెసీలీటర్‌ కంటే ఎక్కువగా ఉంటే కిడ్నీ సరిగా పనిచేయడంలేదని అర్థం.

కానీ, ఉద్దానం ప్రాంతంలో సీరం క్రియాటిన్‌ లెవెల్స్‌ చాలామందిలో 25 మిల్లీ­గ్రామ్‌/డెసీలీటర్‌ మేరకు ఉంది. క్రియాటినిన్‌ 5 దాటితే డయాలసిస్‌ తప్పనిసరి. ఇటువంటి వారిలో వ్యాధి తీవ్రత పెరుగుతుంది. వీరంతా విశాఖపట్నం వెళ్లాల్సి వచ్చేది. వారానికి రెండుసార్లు కూడా వెళ్లేవారున్నారు. ఇలా రోజుకు 500కి.మీ. దూరం ప్రయాణించాల్సి వచ్చేది. రవాణా, వైద్య ఖర్చులు తలకుమించిన భారంగా మారాయి. ఎంతోమంది డబ్బుల్లేక, వైద్యం చేసుకోలేక ప్రాణాలను కోల్పోయే­వారు. మరో­వైపు.. ఈ మహమ్మారిని పాలకులెవరూ పట్టి­ంచుకోలేదు. ఏళ్లుగా ఇక్కడి బీల నేలలో తెగిపడిన తాళిబొట్లు ఏ నేతనూ కదిలించలేదు.

హామీలిచ్చిన వారు కొందరు, అన్నీ చేసేశామని ప్రచారం చేసుకున్న వారు ఇంకొందరు. ఇలాంటి ఆపత్కాలంలో ప్రతిపక్షనేత హోదాలో జగన్‌ కిడ్నీ బాధితులకు సాంత్వన చేకూర్చే కబురు చెప్పారు. చెప్పినట్లుగానే ఇప్పుడు ఆపన్నహస్తం అందిస్తున్నారు. డబ్బుల్లేక అల్లాడుతున్న అభాగ్యులకు నెలనెలా చేతిలో రూ.10వేలు పెడుతున్నారు. ఎక్కడో ఉన్న వంశధారను ఉద్దానానికి తీసుకొచ్చారు. తగ్గిపోతున్న ఉద్దానం ఆయష్షు రేఖకు ఊపిరిలూదుతున్నారు. అంతేకాదు.. రూ. వందల కోట్లతో మంచినీటి ప్రాజెక్టును.. కిడ్నీ పరిశోధనా ఆస్పత్రిని ఏర్పాటుచేశారు.  

గతమంతా పరిశోధనలకే పరిమితం..  
నిజానికి.. ఉద్దానంలో కిడ్నీ వ్యాధి ఆనవాళ్లు 1990 దశకంలో కన్పించాయి. కానీ, 2000లో సోంపేటకు చెందిన ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ వైద్యులు వై.కృష్ణమూర్తి, పి.శివాజీ కవిటి ప్రాంతంలో కిడ్నీ­వ్యా««ధి కేసులను గుర్తించారు. 2002 నుంచి వారే వ్యాధి తీవ్రత ఏ స్థాయిలో ఉందనే అంశంపై పరిశోధన ప్రారంభించారు.  
♦ 2004లో నాటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో కేజీహెచ్‌ హెచ్‌ఓడీ డాక్టర్‌ రవిరాజ్‌తో కవిటి ప్రాంతంలో పరిశోధన వైద్య శిబిరాలు ప్రారంభించారు.  
♦  2008 మే 24న నెఫ్రాలజిస్ట్‌ డాక్టర్‌ గంగాధర్, హైదరాబాద్‌ నిమ్స్‌ ఆర్‌ఎంఓ శేషాద్రి ఉద్దానంలో పర్యటించారు. అదే ఏడాది నాటి రాష్ట్ర నీటి విశ్లేషణ పరిశోధనా సంస్థ ఇక్కడ నీటి నమూనాలను తీసుకెళ్లింది.  
♦ 2009లో న్యూయార్క్‌కు చెందిన కిడ్నీ వ్యాధుల నిపుణుడు డాక్టర్‌ శివప్రసాద్‌ ఈ ప్రాంతంలో పర్యటించి రోగుల ఆహార అలవాట్లు, నీరు, రక్తం తదితర నమూనాలను పరిశోధనకు తీసుకెళ్లారు.  
♦ 2011లో డాక్టర్‌ రవిరాజ్, డాక్టర్‌ వెలగల శ్రీనివాస్, డాక్టర్‌ కల్యాణ్‌చక్రవర్తి, ఎ.వేణుగోపాల్‌ అనే నెఫ్రాలజీ నిపుణుల బృందం ఉద్దానం ఎండో­మిక్‌ నెఫ్రోపతి (యూఈఎన్‌) పేరిట ఓ అధ్యయనం చేసింది.
♦  2011లో న్యూయార్క్‌కు చెందిన స్టోనీబ్రూక్స్‌ యూనివర్సిటీ నుంచి డాక్టర్‌ అనూప్‌ గంగూలీ, డాక్టర్‌ నీల్‌ ఓలిక్‌ల నేతృత్వంలో ఓ బృందం వివిధ గ్రామాల ఆహారపు అలవాట్లు తెలుసుకుని రక్త, మూత్ర నమూనాలు తీసుకెళ్లింది. 
♦  2011లో హైదరాబాద్‌కు చెందిన పరిశోధకురాలు సీఐఎస్‌ఆర్‌ సుజాత ఈ ప్రాంతంలో నీటిని తీసుకెళ్లి దాని ద్వారా ఏఏ మార్పులు వస్తున్నాయో పరిశీలించారు. 
♦ ఆ తర్వాత 2012లో జపాన్‌ బృందం, అమెరికన్ల బృందం పర్యటించింది.   
♦ 2012 అక్టోబరు 1న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కమ్యూనికల్‌ డిసీజెస్‌ బృందం పరిశీలించింది. 2013లో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పోతు­రాజు అనే రీసెర్చ్‌ స్కాలర్‌ పరిశోధన చేశారు.   
♦ 2017 నుంచి భారతీయ వైద్య పరిశోధనా మండలి డాక్టర్‌ వివేక్‌ ఝా నేతృత్వంలో ప్రస్తుతం పరిశోధన సాగుతోంది.  
♦ అయితే, ఇప్పటివరకు, శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు ఇక్కడి కిడ్నీ వ్యాధులకు కచ్చితమైన మూలకారణాన్ని గుర్తించలేకపోయారు.  
♦ కొన్ని అధ్యయనాలు ఈ వ్యాధి నీటిలో అధిక సెలీనియం లేదా సీసం కారణంగా ఉండవచ్చని అనుమానించాయి. మరికొందరు దీనికి నేల స్వభావమే కారణమై ఉండొచ్చని నివేదించారు. ఉష్ణోగ్రత, తక్కువ నీటి వినియోగం, అధిక పెయిన్‌ కిల్లర్స్‌ వాడకం, జన్యుపరమైన లోపాలు కూడా వ్యాధికి కారణమని అధ్య­యనాలు చెబుతూ ఉన్నాయి. కానీ, ఈ అధ్యయనాలు ఏవీ సరైన స్పష్టత ఇవ్వలేకపోయాయి.  
♦ మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వం జార్జ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్, టెక్నాలజీ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (టీఆర్‌ఐ), ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌)తో 2019లో సంయుక్తంగా సమగ్ర పరిశోధనలు నిర్వహించి వ్యాధిని గుర్తించేందుకు అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేసింది.

కిడ్నీ బాధితులపై ఆగ్రహంతోఊగిపోయిన బాబు.. 
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ ఉద్దానంలోని కిడ్నీ బాధితుల గురించి పట్టించుకోలేదు. తిత్లీ తుపాను సమయంలో మొక్కుబడిగా పర్యటించినప్పటికీ వారికెలాంటి భరోసా ఇవ్వలేదు సరికదా..  తుపా­ను­తో సర్వం కోల్పోయిన బాధితులు తమ గోడు చెప్పుకునేందుకు వస్తే ఆగ్రహంతో ఊగిపోయారు.‘నాకు 40 ఏళ్ల అనుభవం ఉంది.. నాకు అడ్డొస్తే బుల్డోజర్‌తో తొక్కేస్తా.. తొక్క­తీస్తా.. తోలు తీస్తా’ అని వ్యాఖ్యానించారు. కొంతమందిపై కేసులు కూడా పెట్టా­రు. 

డ్రామాలకే పవన్‌ పరిమితం.. 
ఇక పవన్‌కళ్యాణ్‌ అయితే 2017లో దీక్ష పేరుతో పెద్ద డ్రామా ఆడారు. టీడీపీతో కలిసి ఐదేళ్లు చెట్టాపట్టాలు వేసుకున్నా దానికొక పరిష్కారం చూపలేదు. ఎవరైనా అడిగితే.. అంతా తానే చేశానని, కిడ్నీ బాధల నుంచి విముక్తి కల్పిస్తానని హడావుడి చేయడం తప్ప నిజానికి ఆయన చేసిందేమీ లేదు.

కిడ్నీ బాధితులకు ఇది పెద్ద ఊరట  
ఉద్దానంలో కిడ్నీ బాధితులకు కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ పెద్ద ఊరట కలిగిస్తుంది. వీరికోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండు ప్రధాన కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయం. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుచేయడంతోపాటు వంశధార నది నుంచి మంచినీటిని అందించేందుకు చర్యలు చేపట్టడం, అది కూడా హామీ ఇ చ్చిన ఐదేళ్లలో పనులు పూర్తిచేయడం చరిత్రాత్మకం. ఆస్పత్రి పరంగా మూలాల శోధనకు ప్రాధాన్యత ఇవ్వడం, పరిశోధనతోనే కిడ్నీ ఇబ్బందులకు పరిష్కారం దొరుకుతుంది.  – డాక్టర్‌ ప్రధాన శివాజీ, రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడు, సోంపేట

వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక తీసుకున్న చర్యలు
వైఎస్‌ జగన్‌ అధికారం చేపట్టిన తర్వాత కిడ్నీ రోగులకు అండగా ఉండేందుకు పింఛన్‌ పెంచారు. అప్పటివరకు రూ.3,500 ఉన్న పింఛన్‌ను రూ.10వేలకు పెంచారు. వ్యాధి తీవ్రత ఆధారంగా రెండు రకాలుగా పింఛన్లు అందజేస్తున్నారు. 5కు పైబడి సీరం క్రియాటిన్‌ ఉన్న వారికి రూ.5వేలు, డయాలసిస్‌ రోగులకు రూ.10వేల పింఛన్‌ ఇస్తున్నారు. ఈ లెక్కన ప్రస్తుతం రూ.10వేలు చొప్పున 792 మందికి.. రూ.5 వేలు చొప్పున 451 మందికి పింఛన్లు ఇస్తున్నారు. అవసరమైతే ఎంతమందికైనా మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.  
♦ ప్రస్తుతం టెక్కలి, పలాస, సోంపేట, కవిటి, హరిపురం ఆసుపత్రుల్లో డయాలసిస్‌ సెంటర్లు ఉన్నాయి. 63 మెషిన్లతో 68 పడకలపై డయాలసిస్‌ అందిస్తున్నారు.
♦ సోంపేట సీహెచ్‌సీ డయాలసిస్‌ సెంటర్‌లో 13 పడకలుండేవి. వాటిని 21కి పెంచారు.  
♦ కవిటి సీహెచ్‌సీ డయాలసిస్‌ సెంటర్‌లో 10 పడకలు ఉండగా, 19కి పెంచారు.   
♦ హరిపురంలో కొత్తగా 10 పడకలతో డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటుచేశారు. రెండు కంటైన్డ్‌ బేస్డ్‌ సర్విసెస్‌ డయాలసిస్‌ యూనిట్లను ఏర్పాటుచేశారు.   
♦ ఇవికాక.. కొత్తగా గోవిందపురం, కంచిలి, అక్కుపల్లి, బెలగాంలో 25 మెషిన్లతో డయాలసిస్‌ సెంటర్లు మంజూరయ్యాయి.  
♦ ఇచ్ఛాపురం సీహెచ్‌సీ, కంచిలి పీహెచ్‌సీలో 25 మెషిన్లతో డయాలసిస్‌ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి చ్చింది.   
♦ టీడీపీ హయాంలో డయాలసిస్‌ రోగులకు 20 రకాల మందులే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు 37 రకాల మందులను అందుబాటులో ఉంచారు. అవసరమైతే ఇంకా మందులు కొనుగోలు చేసే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.  
♦ కిడ్నీ రోగులకు నిరంతరం వైద్య పరీక్షల కోసం సెమీ ఆటో ఎనలైజర్స్, ఎలక్ట్రోలైట్‌ ఎనలైజర్స్, యూరిన్‌ ఎనలైజర్స్‌ను ఉద్దానం పరిధిలో ఉన్న 29 ల్యాబ్‌లలో అందుబాటులో ఉంచారు.  
♦ కిడ్నీ సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి, బాధితులకు మెరుగైన వైద్యం అందించడం ద్వారా మరణాలను నియంత్రించేందుకు నిరంతర స్క్రీనింగ్‌ను ప్రభుత్వం చేపడుతోంది. వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లలో పనిచేసే కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ (సీహెచ్‌ఓ)­­లకు ప్రత్యేకంగా ఒక యాప్‌ను రూపొందించారు. ఇప్పటివరకూ ఉద్దానం ప్రాంతంలోని 2.32లక్షల మందిని స్క్రీన్‌ చేయగా 19,532 మందిలో సీరమ్‌ క్రియాటిన్‌ 1.5 ఎంజీ/­డీఎల్‌ కన్నా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వీరందరికీ వైద్య సాయం అందించారు.  
♦ టీడీపీ హయాంలో జిల్లా నెఫ్రాలజీ విభాగమే లేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక శ్రీకాకుళం రిమ్స్‌లోనెఫ్రాలజీ విభాగం ఏర్పా­టు­­చేశారు. ఇద్దరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను నియమించారు. ప్రతి శనివారం పలాస సీహెచ్‌సీకి వెళ్లి రోగులకు వైద్యం అందిస్తున్నారు.  
♦ కిడ్నీ బాధితులకు అత్యంత నాణ్యమైన కార్పొరేట్‌ వైద్యాన్ని పూర్తి ఉచితంగా చేరువలో అందించడం కోసం రూ.85 కోట్ల అంచనాలతో పలాసాలో రీసెర్చ్‌ సెంటర్‌తోపాటు 200 పడకలతో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించారు. ఇందులో రూ.60 కోట్లు ఆస్పత్రి నిర్మాణానికి, రూ.25 కోట్లు అధునాతన వైద్య పరికరాలు, ఇతర వనరుల కల్పనకు 
కేటాయించారు.

రూ.742కోట్లతో భారీ రక్షిత మంచినీటి పథకం
ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులకు ప్రధాన కారణం తాగునీరుగా భావిస్తున్న నేపథ్యంలో నిపుణుల సూచనల మేరకు వంశధార నదీ జలాలను భూ ఉపరితల తాగునీరుగా అందిం­చేందుకు రూ.742 కోట్లతో వైఎస్సార్‌ సుజలధార ప్రాజెక్టును సీఎం జగన్‌ మంజూరు చేశారు. దీనికింద ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఏడు మండలాల్లోని 807 గ్రామాలకు ఇంటింటికీ కుళాయిల ద్వారా నిరంతరం స్వచ్ఛమైన తాగునీరు అందించనున్నారు.

ఈ మంచినీటి పథకానికి 2019 సెపె్టంబరు 6న సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. 2050 నాటికి ఆ ప్రాంతంలో పెరిగే జనాభా అంచనాతో ఒక్కొక్కరికి రోజుకు వందలీటర్ల చొప్పున అందేలా ఈ పథకాన్ని రూపొందించారు. భవిష్యత్‌లో శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం, మెలియాపుట్టి మండలాల్లోని 170 గ్రామాలకు కూడా ఈ పైపులైన్‌ ద్వారా అదనంగా తాగునీరు అందించే వీలుగా ఈ పథకాన్ని డిజైన్‌ చేశారు. నిజానికి.. ఉద్దానం సమీపంలో ఉన్న బాహుదా, మహేంద్రతనయ నదుల నుంచి తక్కువ ఖర్చుతోనే రక్షితనీటి సరఫరాకు అవకాశమున్నా వేసవిలో ఆ నదులు ఎండిపోతే ఇక్కడి ప్రజలు బోరు నీటిని తాగక తప్పదన్న భావనతో జగన్‌ సర్కార్‌ ఆ ప్రతిపాదనను మొదట్లోనే పక్కన­పెట్టింది.

ఏడాది పొడవునా నీరు అందుబా­టులో ఉండాలన్న ఉద్దేశంతో ఖర్చు ఎక్కువైనా ఈ ప్రాంతానికి 104 కిలోమీటర్ల దూరంలోని హిరమండలం రిజర్వాయర్‌ నుంచి నీటి తరలింపునకు పూనుకుంది. ఈ ప్రాంతం మొత్తానికి ఏడాది పొడవునా తాగునీటి అవసరాలకు ఒక టీఎంసీ కన్నా తక్కువ నీరు అవసరం ఉండగా.. హిరమండలం రిజర్వాయర్‌లో కనీస నీటిమట్టం స్థాయిలోను 2.67 టీఎంసీల నీరు అందు­బాటులో ఉంటుంది. ఇక్కడ నుంచి మూడు భారీ మోటార్ల ద్వారా 32 కిలోమీటర్ల దూరంలోని మెలియాపుట్టి మండల కేంద్రం వద్దకు చేరుతుంది. అక్కడ నీటిని శుద్ధిచేసి ఉద్దానానికి సరఫరా చేస్తారు.  

ఇదీ కిడ్నీ పరిశోధనా కేంద్రం స్వరూపం..  
ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ సహకారంతో ఈ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. 
♦ ఇందులో.. మొదటి అంతస్తులో అత్యాధునిక సౌకర్యాల­తో ఓపీ విభాగం, రీనల్‌ ల్యాబ్, పాలనా విభాగం, మీటింగ్‌ హాల్, మెడిసిన్‌ స్టోర్సు ఉన్నాయి. 
♦ రెండో అంతస్తులో నెఫ్రాలజీ విభాగం, పేమెంట్‌ రూములు, కీలకమైన డయాలసిస్‌ విభాగాన్ని ఏర్పాటుచేశారు.
♦ మూడో అంతస్తులో ఆపరేషన్‌ థియేటర్‌ కాంప్లెక్స్, సీఎస్‌ఎస్‌ డి, అదనపు వసతులతో ఉన్న పే రూములు, ప్రీ, పోస్ట్‌ ఆపరేటివ్‌ వార్డులు, ఐసోలేషన్‌ గది, బ్లడ్‌ బ్యాంకు ఉన్నాయి   
♦ నాలుగో అంతస్తులో యూరాలజీ వార్డు, పే రూ­ములు, రీసెర్చ్‌ లేబొరేటరీలు ఏర్పాటుచేశారు. 

సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు..  
ఈ కేంద్రంలో అందించే వైద్యసేవల్ని పరిశీలిస్తే యూరాలజీ, రేడియాలజీ, ఎనస్తీషియా, నెఫ్రాలజీ, వ్యాస్కులర్‌ సర్జన్, పల్మనాలజీ, కార్డియాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, బయో కెమిస్ట్రీ లాంటి సూపర్‌ స్పెషాలిటీస్‌ సేవలు.. జనరల్‌ సర్జన్, జనరల్‌ మెడిసిన్‌ సేవలు అందిస్తారు. ఈ ఆస్పత్రిలో 41 మంది సూపర్‌ స్పెషలిస్టులు, స్పెషలిస్టులు, వైద్యాధికారులను రెగ్యులర్‌ ప్రాతిపదికన నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జూలై 3న ఉత్తర్వులు జారీచేసింది. వీరితోపాటు స్టాఫ్‌ నర్సు పోస్టులు 60, ఇతర సహాయ సిబ్బంది పోస్టులు కలిపి 154 పోస్టులను కొత్తగా మంజూరు చేసి భర్తీ చేపట్టారు.

మరోవైపు.. ఇందులో  ప్రపంచస్థాయి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యంత్ర పరికరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిద్ధంచేసింది. గత 20 రోజులుగా వీటితో ఇప్పటికే రోగులకు చికిత్స చేస్తున్నారు. ఎక్స్‌రే (300ఎంఎ), సిటీస్కాన్, అల్ట్రా సౌండ్‌ మెషిన్, ఆటోమెటిక్‌ టిష్యూ ప్రాసెసర్, క్రయోస్టాట్, ఆటోమేటిక్‌ బయో కెమిస్ట్రీ ఎనలైజర్, సి–ఆర్మ్‌ మిషన్, ఈఎస్‌డబ్ల్యూ మిషన్, ఆటోమేటిక్‌ ఓటి టేబుల్స్, –80 నుంచి –40 సెంటీగ్రేడ్ల డీప్‌ ఫ్రీజర్లు, వెంటిలేటర్లు ఇప్పటికే సిద్ధంచేశారు.

జీవితంపై ఆశ కలిగింది.. 
కూలీ పనిచేసే నాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆరేళ్ల క్రితం కిడ్నీ వ్యాధి బారినపడ్డాను. అప్పట్లో సరైన వైద్యం అందక డయాలసిస్‌ కోసం మరొకరి సాయంతో విశాఖపట్నం వెళ్లాల్సి వచ్చేది. బోలెడంత డబ్బు ఖర్చేయ్యేది. ఇక్కడ సరైన వైద్య సదుపాయాల్లేక మా కళ్ల ముందే మా స్నేహితులు, బంధువులు ఎందరో మృత్యువాత పడ్డారు. ఎవ్వరూ ప­ట్టించుకునే వారు కాదు.

వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆయన ద­యవల్ల ప్రతినెలా రూ.10 వేలు పింఛన్‌ అందుకుంటున్నాను. విశాఖకు వెళ్లే పని తప్పింది. పలాసలోనే డయాలసిస్, మందులు అందుతున్నాయి. పెద్ద ఆసుపత్రిని కూడా సిద్ధం చేశా­రు. ఇప్పుడు జీవితంపై ఆశ కలుగుతోంది. సీఎంకు ఉద్దానం వాసులంతా రుణపడి ఉంటా­రు.   – గేదెల కోదండరావు, చినడోకులపాడు గ్రామం, వజ్రపుకొత్తూరు మండలం, శ్రీకాకుళం జిల్లా

ప్రభుత్వం మాలాంటి వారికి ప్రాణం పోస్తోంది
చికిత్స కోసం నాకు లక్షల రూపాయలు ఖర్చేయ్యేవి. వైఎస్సార్‌  కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంది. 108 అంబులెన్స్‌లో ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లి, డయాలసిస్‌ అయ్యాక మళ్లీ ఇంటి వద్ద  దిగబెడుతున్నారు. రూ.10వేలు పింఛను కూడా అందుతోంది. పౌష్టికాహారం, పండ్లు, మందులు కొనడానికి ప్రభుత్వం సహకరిస్తోంది. నాలాంటి ఎంతోమందికి జగన్‌ ప్రభుత్వం ప్రాణం పోస్తోంది.   – నర్తు సీతారాం, లోహరిబంద, మందస మండలం, శ్రీకాకుళం జిల్లా

ఇంటింటికీ కుళాయి ఇచ్చారు..జగనన్న చల్లగా ఉండాలి
మా ప్రాంత వాసుల కష్టాల తీర్చేందుకు.. కిడ్నీ మహమ్మారి బారినపడిన ఉద్దానం వాసుల్ని రక్షించేందుకు జగనన్న మంజూరు చేసిన వైఎస్సార్‌ సుజలధార ప్రారంభానికి సిద్ధమయ్యిందనే విషయం తెలియగానే చాలా ఆనందం అనిపించింది. రోజూ కిడ్నీ వ్యాధులకు భయపడి 20 లీటర్ల క్యాన్లను కొనుగోలు చేస్తున్నాం. జగనన్న దయవల్ల ఇంటింటికీ కుళాయిలను ఇప్పటికే అమర్చారు. మా ప్రాంత వాసుల కష్టాలు తీరుస్తున్న జగనన్న చల్లగా ఉండాలి.  – కర్ని సుహాసిని, గృహిణి,  అమలపాడు, వజ్రపుకొత్తూరు మండలం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top