తుది తీర్పునకు లోబడే 25% కోటా సీట్ల ఫీజు చెల్లింపు వ్యవహారం

Interim orders of AP High Court 25 percent quota Private Schools - Sakshi

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు 

సాక్షి, అమరావతి: విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం కోటా కింద ఉచిత సీట్లు పొందే పిల్లల తల్లిదండ్రులు అమ్మఒడి పథకం చెల్లించే మొత్తం నుంచే ఫీజులు చెల్లించుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో 24ను సవాలు చేస్తూ ఇండిపెండెంట్‌ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (ఐఎస్‌ఎంఏ) అధ్యక్షుడు కోగంటి శ్రీకాంత్, యునైటెడ్‌ ప్రైవేట్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్‌ ఫెడరేషన్‌(యుపీఈఐఎఫ్‌) చైర్మన్‌ గొల్లపూడి మోహనరావు హైకోర్టును ఆశ్రయించారు.

25 శాతం కోటా కింద భర్తీ చేసే సీట్ల ఫీజులను తల్లుల ఖాతాల్లో కాకుండా నేరుగా పాఠశాలలకు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని వారు కోర్టును కోరారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణప్రసాద్‌ శుక్రవారం విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు వేదుల వెంకటరమణ, బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. 25 శాతం కోటా సీట్ల ఫీజులను ప్రభుత్వం సరైన రీతిలో నిర్ణయించలేదని వారు కోర్టుకు నివేదించారు.

ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో కాకుండా నేరుగా పాఠశాలల ఖాతాలో సొమ్ము జమ చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయ­మూర్తి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ.. ఫీజు చెల్లింపు వ్యవహారం ఈ వ్యాజ్యాల్లో తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయా­లని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌లకు నోటీసులిచ్చారు. తదుప­రి విచారణను  15కి వాయిదా వేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top