పాడి కోసం ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్

సాక్షి, అమరావతి: అన్నివేళలా అన్నదాతలకు అండగా నిలిచేందుకు గన్నవరంలోని ‘సమీకృత రైతు సమాచార కేంద్రం’ మాదిరిగానే పాడి రైతుల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. మారుమూల ప్రాంతాల్లోని మూగజీవాలకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలందించాలన్న సంకల్పంతో రూ.7.53 కోట్లతో దేశంలోనే తొలిసారి ఏర్పాటవుతున్న ఈ కాల్‌సెంటర్ నిర్వహణకు మార్గదర్శకాలను జారీచేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కాల్ సెంటర్ ద్వారా పాడిరైతులకు అవసరమైన సలహాలు, సూచనలతో పాటు టెలిమెడిసిన్ సేవలు కూడా అందిస్తారు. ఉదయం 9.00 నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు ఈ కాల్ సెంటర్ పనిచేస్తుంది.