
ప్రభుత్వ ఆదేశాలతో పలు ప్రాంతాల్లో సినిమా థియేటర్ల తనిఖీ.. పాలకొల్లు, నరసరావుపేటలో గీతా ఆర్ట్స్ వారి థియేటర్ల పరిశీలన
పలు ప్రాంతాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సైతం తనిఖీలు.. బంద్ విరమించినా ఈ తనిఖీలేంటని వాపోతున్న యజమానులు
రాజకీయ రంగు పులిమి బెదిరింపులు తగవని ఆవేదన.. విజయవాడ మల్టీ ఫ్లెక్స్‌లలో ధరల సంగతి చూడాలన్న ప్రేక్షకులు
సాక్షి నెట్‌వర్క్: సినిమా థియేటర్ల విషయంలో ‘అత్త మీద కోపం దుత్త మీద చూపిందన్నట్లు’ తయారైంది కూటమి ప్రభుత్వ పరిస్థితి. సినిమా థియేటర్ల బంద్.. ఆపై విరమణ ప్రకటనల నేపథ్యంలో ప్రభుత్వం కన్నెర్ర చేయడంతో ఎక్కడ ‘సీజ్ ద థియేటర్..’ అంటారోనని థియేటర్ల యజమానులు వణికిపోతున్నారు. జూన్ 12న తాను నటించిన హరి హర వీరమల్లు చిత్రం విడుదలవుతున్నందున ఇప్పుడు థియేటర్లు బంద్ చేస్తారా.. సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది.. దీని వెనుక ఎవరున్నారంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
తీరా దీని వెనుక జనసేన నేత ఉన్నారని తెలిసి ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంది ప్రభుత్వం. ఇంత హంగామా చేసి మిన్నకుండిపోతే బావుండదని భావించి రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లను తనిఖీ చేయాలని ఆదేశించింది. ఆయా థియేటర్లలో ఉన్న లోపాలన్నింటిపై నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో బుధవారం పలు నగరాలు, పట్టణాల్లో పోలీస్, రెవెన్యూ, ఆహార కల్తీ నిరోధక శాఖ, మున్సిపల్ శాఖ, తూనికలు, కొలతలు తదితర శాఖల అధికారులు థియేటర్‌లలో తనిఖీలు చేపట్టారు.
మచిలీపట్నంలో ఆర్డీవో కె స్వాతి మల్టీప్లెక్స్ థియేటర్‌ను తనిఖీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అల్లు అరవింద్‌కు చెందిన గీతా అన్నపూర్ణ థియేటర్‌తో పాటు అడబాల, కోడి రామకృష్ణకు చెందిన మారుతి థియేటర్లను తనిఖీ చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్‌కు చెందిన మూడు థియేటర్లలో ఆర్డీవో కె.మధులత ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు.
లైసెన్స్‌లు, టికెట్ల ధరలు, తినుబండారాలు, శీతల పానీయాల ధరలు, మరుగుదొడ్లు, ఫైర్ సేఫ్టీ.. తదితరాలను పరిశీలించారు. నరసరావుపేట డివిజన్‌లో 22 థియేటర్‌లు ఉన్నాయని, వాటన్నింటిలో తనిఖీలు చేయాలని ఆయా మండలాల తహసీల్దార్‌లను ఆదేశించామని ఆర్డీవో తెలిపారు. రాజమహేంద్రవరంలోని గీతా అప్సర, శ్యామల, స్వామి థియేటర్‌లను జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు తనిఖీ చేశారు.

విజయవాడ గాందీనగర్‌లోని శైలజ, రాజ్ యువరాజ్, ఐనాక్స్, అలంకార్ థియేటర్లలో తనిఖీలు నిర్వహించారు. గుంటూరు జిల్లా పొన్నూరు, ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల, వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, శ్రీకాకుళం, నెల్లూరు, అమలాపురం, అన్నమయ్య జిల్లా రాయచోటి, రైల్వేకోడూరు తదితర పట్టణాల్లోనూ థియేటర్ల తనిఖీలు కొనసాగాయి.
ఉన్నట్లుండి ఈ తనిఖీలేంటి?
తనిఖీల సమయంలో థియేటర్ల యజమానులు అధికారులతో వారి కష్టాలు చెప్పుకున్నారు. ఇప్పటికే అరకొర ఆదాయాలతో నష్టపోతున్నామని, చిన్నచిన్న లోపాలను సాకుగా తీసుకుని ‘సీజ్ ద థియేటర్’ అంటే తమ గతి ఏం కావాలని వాపోయారు.

ఇదే సమయంలో ఆయా ప్రాంతాల్లో కొంతమంది ప్రేక్షకులు కలుగజేసుకుంటూ విజయవాడ తదితర నగరాల్లోని మల్టీఫ్లెక్స్‌లలో తినుబండారాలు, మంచినీటి బాటిల్ ధర ఆకాశాన్నంటుతున్నాయని.. చిత్తశుద్ధి ఉంటే అక్కడి నుంచి మొదలు పెట్టండని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్టీఫ్లెక్స్ థియేటర్లలో కళ్లెదుటే అధిక ధరలతో తినుబండారాలు విక్రయిస్తుంటే ఏమీ చేయలేకపోతున్నారని వాపోయారు.
ఇదీ సంగతి
మల్టీఫ్లెక్స్ థియేటర్లలో సినిమాలు ప్రదర్శిస్తే మొదటి వారం రెవెన్యూలో 53 శాతం మల్టీప్లెక్స్ యజమానికి, 47 శాతం డిస్ట్రిబ్యూటర్ తీసుకునే విధంగా నిర్ణయించారు. రెండో వారం కూడా అదే సినిమా ప్రదర్శిస్తే మల్టీప్లెక్స్ యజమానికి 50 శాతం, డిస్ట్రిబ్యూటర్ 50 శాతం తీసుకుంటున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కేవలం షోల ఆధారంగానే అద్దెలు చెల్లిస్తున్నారు.
ఒక షో ప్రదర్శనలో హాల్ ఫుల్ అయితేనే అద్దె వస్తోందని, ఫుల్ కాకపోతే రెవెన్యూలో 40 శాతం మాత్రమే చెల్లిస్తున్నారని.. అలా కాకుండా మల్టీప్లెక్స్‌ల మాదిరిగా తమకు కూడా పర్సంటేజీలు ఇవ్వాలని థియేటర్ యజమానులు డిమాండ్ చేస్తున్నారు.