Vizag: ఇన్ఫోసిస్‌ కోసం చకచకా.. విశాఖలో పూర్తి స్థాయి కార్యకలాపాలు

Infosys will start operations from Visakhapatnam District administration - Sakshi

ఐటీ సెజ్‌కు ఆర్టీసీ బస్సు సర్వీసులు 

వీధి దీపాల మెరుగుకు చర్యలు 

ఆ మార్గంలో సెక్యూరిటీ పెంపు 

పెట్రోలింగ్‌ నిర్వహించనున్న పోలీసులు

సాక్షి, విశాఖపట్నం: దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ విశాఖలో పూర్తి స్థాయి కార్యకలాపాలు చేపట్టడానికి అవసరమైన చర్యలను జిల్లా యంత్రాంగం చకచకా తీసుకుంటోంది. ఇప్పటికే విశాఖ రుషికొండ ఐటీ సెజ్‌లో అక్టోబర్‌ ఒకటిన ఇన్ఫోసిస్‌ శాటిలైట్‌ కార్యాలయాన్ని తెరిచింది. త్వరలోనే ఈ ఐటీ సెజ్‌ నుంచి ఉద్యోగులు విధులు నిర్వహించడానికి ఇన్ఫోసిస్‌ సన్నద్ధమవుతోంది. 

ఈ నేపథ్యంలో తమకు అవసరమైన వనరులు, సదుపాయాల గురించి ఇన్ఫోసిస్‌ ప్రతినిధులు పరిశ్రమల శాఖ, ఆర్టీసీ, పోలీసు, జీవీఎంసీ తదితర అధికారులతో ఇటీవల చర్చించారు. నగరం నుంచి రుషికొండ ఐటీ సెజ్‌కు ఆ సంస్థ ఉద్యోగులు రాకపోకలు సాగించడానికి వీలుగా బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులను కోరారు. ఇందుకు ఆర్టీసీ అధికారులు సమ్మతిని తెలియజేశారు. ఐటీ కంపెనీల్లో ఉద్యోగులు షిఫ్టుల వారీగా విధులు నిర్వహిస్తారు. అందువల్ల 24 గంటలూ బస్సు సర్వీసులు అందుబాటులో ఉండాల్సి ఉంటుంది.

ఇన్ఫోసిస్‌ అవసరాలకు ప్రత్యేకంగా బస్సులను కేటాయించడానికి కూడా తమకు అభ్యంతరం లేదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఐటీ సెజ్‌కు ఎన్ని బస్సుల అవసరం అన్నది ఉద్యోగుల సంఖ్యను బట్టి  ఉంటుందని, దీనిపై కొద్ది రోజుల్లోనే స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. జనవరి నాటికి తమకు బస్సుల అవసరం ఉంటుందని ఇన్ఫోసిస్‌ ప్రతినిధులు చెప్పారని, కావలసినన్ని బస్సులను నడపడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పినట్టు ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి ఎ.అప్పలరాజు ‘సాక్షి’కి చెప్పారు.  

రోడ్లకు మరమ్మతులు.. వీధిలైట్లు..  
మరోవైపు భీమిలి వెళ్లే బీచ్‌ రోడ్డు నుంచి ఐటీ సెజ్‌కు వెళ్లే రోడ్డు మరింత మెరుగు పరచడంతో పాటు మరమ్మతులు చేపట్టేందుకు జీవీఎంసీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. అలాగే రాత్రి వేళల్లో రాకపోకలు సాగించే వారు ఇబ్బందులు పడకుండా ఆ రోడ్డుకు ఇరువైపులా పూర్తి స్థాయిలో వీధి లైట్లను ఏర్పాటు చేయనున్నారు.  

భద్రతకు పెద్దపీట 
ఐటీ సెజ్‌కు వెళ్లే దారిలో భద్రత (సెక్యూరిటీ)పై కూడా దృష్టి సారిస్తున్నారు. ఆ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలను, ఆకతాయిలు, తాగుబోతులు, అల్లరి మూకల ఆగడాలను కట్టడి చేయడానికి పోలీసులు చర్యలు తీసుకోనున్నారు. ఇందుకోసం పోలీసులతో నిరంతరం పెట్రోలింగ్‌ నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో ఇన్ఫోసిస్‌తో పాటు ఐటీ సెజ్‌లో విధులు నిర్వహించడానికి వెళ్లి వచ్చే ఉద్యోగినులు ఎలాంటి భయాందోళనలకు ఆస్కారం లేకుండా చూస్తారు.

త్వరలో విశాఖ క్యాంపస్‌ నుంచి కార్యకలాపాలు ప్రారంభించేందుకు పరిశ్రమల శాఖ నుంచి అన్ని ఏర్పాట్లు వేగవంతం చేస్తున్నామని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ ఎ.రామలింగేశ్వరరాజు ‘సాక్షి’కి చెప్పారు. ఇందుకోసం సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తున్నామని తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top