
విహారయాత్రకు చలో ఇండోనేసియా
విదేశీ పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంగా ఇండోనేసియా అడుగులు
ఆసియాలో...ఆఫ్రికా శైలి సఫారీ ప్యాకేజీలు
వన్యప్రాణుల వీక్షణకు ప్రసిద్ధ గమ్యస్థానంగా మార్పు
24 గంటల సఫారీ... ప్రత్యేక ఆకర్షణగా నైట్ సఫారీ
ఠీవిగా నడిచే సింహం...మెడ సాగదీసే జిరాఫీ,.. ఘీంకరించే ఏనుగులు...గాల్లో బెలూన్‌లను అందుకునే డాల్ఫీన్స్... ఇలా వివిధ రకాల జంతువులను వాటి సహజ ఆవాసాలను పోలి ఉండే వాతావరణంలో దగ్గరగా వీక్షిస్తూ ఉల్లాసంగా గడిపేలా ఇండోనేసియా పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇవేకాక... చిన్నారులను సైతం ఆకట్టుకునేలా సెంట్రల్‌జావా, సోలో సఫారీ డినోరైడ్, సవన్నాజిప్‌లైన్, గోకార్ట్ వంటివి ఏర్పాటు చేసింది.
సాక్షి, అమరావతి: వన్యప్రాణి పర్యాటకంపై ఇండోనేసియా దృష్టి సారించింది. ప్రకృతి ఒడిలోకి పర్యాటకులను ఆహ్వానిస్తోంది. ఆసియాలో... ఆఫ్రికాను పోలిన సఫారీ అనుభవాన్ని అందిస్తోంది. వీసా నిబంధనలను సైతం సరళతరం చేసింది. 2025 నాటికి కోటిన్నర మంది విదేశీ పర్యాటకులను ఆకర్షించాలనేది లక్ష్యం. ఈక్రమంలో భారతీయ మార్కెట్‌పైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది. దీంతో ఇప్పుడు భారత్‌తో సహా 97 దేశాలకు చెందిన ప్రయాణికులు ఆన్‌లైన్‌లో వీసాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇకపై ఈ–వీసా ఆన్ అరైవల్స్‌లో ఇండోనేసియా చుట్టిరావచ్చు. వాస్తవానికి ఇండోనేసియా ఇన్»ౌండ్ వేగంగా విస్తరిస్తోంది. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులతో గణనీయమైన వృద్ధిని సాధిస్తోంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్–2024 డేటా ప్రకారం ఇండోనేసియాను సందర్శించే భారతీయ పర్యాటకుల సంఖ్య 7.10 లక్షలకు చేరుకుంది. ఇది గతేడాదికంటే 17.20 శాతం పెరుగుదలను నమోదు చేయడం విశేషం.
కుటుంబంతో సహా విహార, సాహస యాత్రలు, బీచ్ అందాలు, సాంస్కృతిక పర్యటనల సమ్మేళనంతో ఇండోనేసియా భారతీయ పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది. ఈ క్రమంలోనే ‘తమన్ సఫారీ’ ఒక ప్రధాన వన్యప్రాణుల గమ్యస్థానంగా మారింది.

కంగారూలూ కనిపిస్తాయి
తమన్ సఫారీ ప్రిజెన్‌లో ప్రయాణికులకు ఆ్రస్టేలియా వన్యప్రాణులను పరిచయం చేస్తుంది. కంగారూలు, వొంబాట్స్, ఈములతో పాటు త్వరలో కోలాస్ వంటి జంతువులు సందర్శించవచ్చు. ఇక్కడ చిన్నచిన్న ఏటీవీ వాహనాల్లో సాహస యాత్రలు కూడా చేయవచ్చు. సెంట్రల్ జావా, సోలో సఫారీ డినోరైడ్, సవన్నా జిప్‌లైన్, గోకార్ట్ వంటివి చిన్నారులకు మంచి అనుభవాలను అందిస్తున్నాయి. సింహాలను చూస్తూ భోజనం చేయవచ్చు. తమన్ సఫారీ బాలిలో కొమోడో డ్రాగన్లు, ఒరంగుటాన్లు (కోతిజాతి), స్టార్లింగ్ పక్షుల అందాలను వీక్షించొచ్చు.
ప్రిడేటర్ ఫీడింగ్ సెషన్‌లు, జీప్ సఫారీలు వంటి సాహస యాత్రలు ఉంటాయి. నీటి కింద భోజనం చేస్తూ వరుణ షో, అగుంగ్‌షోల ద్వారా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సంస్కృతి ప్రదర్శనలు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తాయి. జకార్తా అక్వేరియం సఫారీలో మెరై్మడ్ షోలు, అక్వాట్రెక్కింగ్, అండర్ వాటర్ ఫాంటసీ డైనింగ్‌లు ఉంటాయి. వీటితో సఫారీల్లో విభిన్న ఆహార ప్రాధాన్యతలను అందిస్తున్నాయి. సందర్శకులకు మొక్కల ఆధారిత వంటకాలనూ అందిస్తున్నాయి.
ఆకట్టుకుంటున్న బహుళ సఫారీ పార్కులు
వివిధ దేశాల్లో ఉన్న జూ మాదిరిగా కాకుండా ఆఫ్రికా తరహాలో జంతువుల మధ్య వాహనాల్లో ప్రయాణిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించేలా ‘తమన్ సఫారీ’ సాహస యాత్రను తలపిస్తోంది. ఇక్కడ జంతువులను వాటి సహజ ఆవాసాలను పోలి ఉండే వాతావరణంలో వీక్షించవచ్చు. పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంతో ఇండోనేసియా... ప్రధాన విమానాశ్రయాలు, పర్యాటక కేంద్రాలకు సమీపంలోనే సఫారీలను అభివృద్ధి చేసింది.
ప్రస్తుతం ఇండోనేసియాలో బహుళ సఫారీ పార్కుల యాత్రలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో తమన్ సఫారీ బోగోర్ (పశ్చిమ జావా), తమన్‌సఫారీ ప్రిజెన్ (తూర్పు జావా), తమన్ సఫారీ బాలి, సోలో సఫారీ (సెంట్రల్ జావా), జకార్తా అక్వేరియం సఫారీ సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.
నైట్ సఫారీ..24 గంటలూ సాహసం!
ఇండోనేసియా సఫారీల్లో ప్రతిదానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇందులో తమన్ సఫారీ బోగోర్ 24 గంటల పాటు వన్యప్రాణుల మధ్య సాహసయాత్రలను నిర్వహిస్తోంది. అందుకే అత్యధిక సందర్శకులు దీనికే క్యూ కడుతున్నారు. ప్రయాణించే వాహనంలో భోజన సదుపాయాలు సైతం కల్పిస్తుండటంతో రోజంతా చుట్టిరావచ్చు.
సింహాలు, జిరాఫీలు, ఏనుగులతో పాటు వివిధ దేశాల జంతువులను చూడొచ్చు. దీనికి తోడు డాల్ఫీన్లతో ఈతకొట్టడం, పెంగ్విన్‌లకు ఆహారం అందించడం వంటి అనుభవాలు పొందవచ్చు. ముఖ్యంగా పర్యాటకులు రాత్రిపూట కూడా వన్యప్రాణులను చూసేలా నైట్ సఫారీ ఉంది. అక్కడే రిసార్టుల్లో బస చేసేందుకు ఏర్పాట్లు కూడా చేశారు.