వ్యాధి ముదిరిపోయిన తర్వాత లక్షణాలు.. అప్పటికే పరిస్థితి చేయిదాటిపోతే..! ఇలా చేస్తే

Increasing Cases Of Cervical Cancer - Sakshi

కర్నూలు(హాస్పిటల్‌): క్యాన్సర్‌ను పూర్వకాలంలో రాచపుండుగా పిలిచేవారు. ఈ వ్యాధి  ధనికులకే వస్తుందని అప్పట్లో దానికి ఆ పేరు వచ్చింది. కానీ ఇప్పుడు ఈ వ్యాధికి పేద, ధనిక అన్న తేడా లేకుండా అందరికీ సోకుతోంది. చాలా మంది మహిళలకు ఈ వ్యాధి వచ్చినట్లే తెలియదు. వ్యాధి ముదిరిపోయిన తర్వాత దాని తాలూకు లక్షణాలు ప్రారంభమై అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. దీంతో ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కలి్పంచడం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం జనవరి నెలను గర్భాశయ ముఖద్వార అవగాహన మాసంగా నిర్వహించాలని ఆదేశించింది. ఈ సంవత్సరం ‘కొన్ని తరాలలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ అంతం’  అనే నినాదంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

పెరిగిన వైద్యులు 
రెండు దశాబ్దాల క్రితం రాయలసీమ కంతటికీ కర్నూలులో ఒక్కరే క్యాన్సర్‌ వైద్యులుండేవారు.  ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో పాతికమందికి క్యాన్సర్‌ డాక్టర్లున్నారు. వీరి వద్దకు ప్రతిరోజూ 60 నుంచి 80 మంది కొత్తగా క్యాన్సర్‌ బాధితులు వస్తున్నారు. అలాగే ప్రతిరోజూ 10 నుంచి 15 మందికి కీమోథెరపి, 25 మందికి రేడియోథెరపి చేస్తున్నారు. నిత్యం 80 నుంచి 120 మంది ఇన్‌పేషంట్లు చికిత్స తీసుకుంటున్నారు. ఇందులో 20 శాతం మంది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌(సెరి్వకల్‌ క్యాన్సర్‌) బాధితులున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య 40 వేల వరకు ఉంటుందని వైద్యుల అంచనా.  

ఆరోగ్యశ్రీలో ఉచితంగా చికిత్స 
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు విశ్వభారతి, ఒమెగా, శాంతిరామ్‌ హాస్పిటల్‌లలో క్యాన్సర్‌ వ్యాధులకు డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా వైద్యం అందుతోంది. అలాగే ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లోనూ క్యాన్సర్‌ కణతులు తొలగించేందుకు నిర్వహించే శస్త్రచికిత్సలు సైతం ఉచితంగా చేస్తున్నారు. ఈ పథకం లేనప్పుడు రోగులకు లక్షల రూపాయలు ఖర్చు అయ్యేది. అన్ని ఆసుపత్రుల్లో క్యాన్సర్‌కు ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకుని డిశ్చార్జ్‌ అయిన రోగులకు ఆసరా పథకం కింద రోజుకు రూ.225, నెలకు రూ.5వేలు తక్కువ కాకుండా ప్రభుత్వం అందజేస్తోంది.   

సెర్వికల్‌ క్యాన్సర్‌ ఎందుకు వస్తుందంటే.. 
ఈ క్యాన్సర్‌ ప్రధానంగా హ్యూమన్‌ పాపిల్లోమా వైరస్‌(హెచ్‌పీవీ) కారణంగా వస్తుంది.  తక్కువ వయస్సులో వివాహం చేయడం, లైంగిక సంబంధాలు కొనసాగించడం, స్త్రీ, పురుషులిద్దరిలో బహుళ లైంగిక భాగస్వాములుగా ఉండటం, ముందస్తు ప్రసవాలు, ఎక్కువ మంది పిల్లలను కనడం, ధూమపానం, మద్యపానం అలవాట్లు ఈ క్యాన్సర్‌ రావడానికి కారణాలుగా వైద్యులు పేర్కొంటున్నారు. ఇది ప్రధానంగా 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సుగల స్త్రీలను ప్రభావితం చేస్తుంది.  

లక్షణాలు ఇవీ.. 
► సాధారణ రుతుక్రమం గాకుండా యోని నుంచి రక్తస్రావం 
►  లైంగిక సంపర్కం తర్వాత రక్తస్రావం 
►  పీరియడ్స్‌ ఆగిపోయిన తర్వాత రక్తస్రావం (మెనోపాజ్‌) 
►  యోని నుంచి దుర్వాసన, రక్తంతో కూడిన గడ్డలు రావడం 
►  మూత్రం, మలవిసర్జనలో ఆటంకాలు 

ఇలా చేస్తే నివారణ సాధ్యం 
2020లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ క్యాన్సర్‌ నిర్మూలన కోసం ప్రపంచ కార్యాచరణ ప్రణాళికను అందించింది. దీనికింద 2030 నాటికి 90 శాతం కౌమార బాలికలకు 15 సంవత్సరాల వయస్సులోపు హెచ్‌పీవీ వైరస్‌కు వ్యతిరేకంగా టీకాలు వేయాలి. 70శాతం మహిళలు 35 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సుగల కలిగిన వారికి కచ్చితంగా స్క్రీనింగ్‌ పరీక్షలు చేయాలి. గర్భాశయ పూర్వ క్యాన్సర్‌తో బాధపడుతున్న 90 శాతం మహిళలకు తగిన చికిత్స అందించాలి.  

ముందుగా గుర్తిస్తే ప్రాణాలు     కాపాడుకోవచ్చు 
దేశంలో ప్రతి సంవత్సరం కొత్తగా 1,24,000 మంది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ బాధితులు నమోదవుతున్నారు. వారిలో సగం మంది ఒక సంవత్సరంలోపు మరణిస్తున్నారు. ఈ క్యాన్సర్‌ వల్ల ప్రతి 8 నిమిషాలకు ఒక మహిళ మరణిస్తోంది. దీనికి నివారణగా 30 ఏళ్ల వయస్సు నుంచి లైంగికంగా చురుకుగా ఉన్న మహిళలందరూ 5 నుంచి 10 ఏళ్లకు ఒకసారి హెచ్‌పీవీ పరీక్ష చేయించుకోవాలి. 9 నుంచి 26 సంవత్సరాల వయస్సుగల బాలికలందరికీ హెచ్‌పీవీ టీకాలు వేయాలని సూచించాలి. ఈ వ్యాధిని నయం చేయడం కంటే నివారణ ఉత్తమం. క్యాన్సర్‌ను ముందుగా గుర్తించడం వల్ల ప్రాణాలు కాపాడవచ్చు.  
–డాక్టర్‌ శిల్పారెడ్డి, గైనకాలజిస్టు, కర్నూలు 

ల్యాప్రోస్కోపి ద్వారా శస్త్రచికిత్స 
నయం కాని గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు ల్యాప్రోస్కోపి పరికరం ద్వారా ఆధునిక పద్ధతిలో శస్త్రచికిత్స చేయవచ్చు. దీనివల్ల కోత, కుట్టు ఉండదు. త్వరగా ఎవరి పనులు వారు చేసుకోవచ్చు. హెరి్నయా వచ్చే అవకాశం కూడా ఉండదు. సాధారణంగా వైరస్‌ సోకిన 10 నుంచి 15 ఏళ్ల తర్వాత క్యాన్సర్‌గా మారుతుంది. దీనివల్ల వివాహం అయిన మహిళలు ప్రతి సంవత్సరం పాప్‌స్మియర్‌ టెస్ట్‌ చేయించుకుంటే, క్యాన్సర్‌ను ప్రాథమికంగా గుర్తించగలిగితే నయం చేసుకోవచ్చు. దీనికితోడు కౌమారదశ బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ వేయడం వల్ల వారికి 70 నుంచి 80శాతం వరకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ రాకుండా అడ్డుకోవచ్చు.  
 –డాక్టర్‌ సి. వాసురెడ్డి, సర్జికల్‌ ఆంకాలజిస్టు, కర్నూలు  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top