
మహారాణిపేట (విశాఖ దక్షిణ): బిహార్ నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్ వరకు ద్రోణి కొనసాగుతోంది. దక్షిణ భారతదేశంలో కొనసాగుతున్న తూర్పు, పడమర ద్రోణి క్రమేపీ ఉత్తరం వైపునకు ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 13న ఆంధ్రా తీరం ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది.
► ద్రోణులు, ఎండల తీవ్రత ప్రభావంతో కోస్తా, రాయలసీమ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో రానున్న 48 గంటల్లో అంటే శనివారం, ఆదివారం రాష్ట్రంలో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ తదితర ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
► రాష్ట్రంలో వేసవిని తలపించే రీతిలో ఎండలు మండుతున్నాయి. వాతావరణ సమతుల్యం లేకపోవడం వల్ల ఎండ వేడిమి, వేడి గాలులు ఎక్కువగా ఉన్నాయి. దీని వల్ల పగటి పూట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. విజయవాడ –36.2, తుని– 36.1, గుంటూరు– 33.8, శ్రీకాకుళం– 33.7, చిత్తూరు, నందిగామ, విజయనగరంలలో 33.6, కావలి, రాజమహేంద్రవరంలలో 30.6, ఏలూరు– 30.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.