ఆరోగ్యశ్రీలో చికిత్సలు పెంపు

Increase treatments at YSR Aarogyasri Andhra Pradesh - Sakshi

ప్రస్తుతమున్న 2,446 ప్రొసీజర్లు 3,254కు పెంపు 

వచ్చే వారంలో అందుబాటులోకి కొత్త చికిత్సలు

సర్కారు నిర్ణయంతో ప్రజలకు ఉచితంగా మరింత మెరుగైన, కార్పొరేట్‌ వైద్యం

సాక్షి, అమరావతి: డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరింత బలోపేతం చేస్తోంది. పథకం కింద ఇప్పటికే 2,446 చికిత్స విధానాలు ఉండగా మరో 808 విధానాలను దాని పరిధిలోకి తీసుకొస్తోంది. దీంతో ఆరోగ్య శ్రీలో చికిత్సల సంఖ్య ఏకంగా 3,254కు పెరుగుతోంది. వచ్చే వారంలో వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ నిర్ణయంతో ప్రజలకు మెరుగైన, కార్పొరేట్‌ వైద్యం ఉచితంగా అందించడానికి మరింత వీలవుతుంది.

టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే 2,195 చికిత్సలు అదనం
2019కి ముందు టీడీపీ హయాంలో ఆరోగ్యశ్రీ పథకం కింద 1,059 చికిత్సలు మాత్రమే అందుతుండేవి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ సంఖ్యను ఏకంగా 2,446కు పెంచింది. ప్రజల ఆరోగ్యానికి మరింత రక్షణ కల్పించేలా సీఎం జగన్‌ మరో అడుగు ముందుకేస్తూ ఇంకో 808 చికిత్సలను పథకం పరిధిలోకి తెస్తున్నారు. దీంతో టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే 2,195 చికిత్సలు అదనంగా ఆరోగ్యశ్రీలోకి వచ్చినట్లవుతుంది. మరోవైపు.. 2019 అనంతరం రూ.ఐదు లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ పథకం పరిధిలోకి తెచ్చారు. ఫలితంగా రాష్ట్రంలో 1.40 కోట్ల కుటుంబాలకు ఉచిత వైద్యసేవలు అందుతున్నాయి.

ఆసరా రూపంలో అండగా..
పేద, మధ్య తరగతి కుటుంబాల్లోని వ్యక్తులు జబ్బుచేసి మంచానికి పరిమితమైతే వారి పోషణ చాలా కష్టంగా ఉంటుంది. దీనిని గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దీనికింద 1,519 రకాల చికిత్సలు చేయించుకున్న వారికి వైద్యులు సూచించిన విశ్రాంత సమయానికి రోజుకు రూ.225లు.. లేదా గరిష్టంగా నెలకు రూ.5వేలు చొప్పున భృతి అందిస్తోంది. 2019లో ఆసరా కార్యక్రమం ప్రారంభించిన నాటి నుంచి ఈ ఏడాది మే నెల వరకూ రాష్ట్రవ్యాప్తంగా 9,85,315 మందికి రూ.624.02 కోట్లు ప్రభుత్వం సాయంచేసింది. 

వచ్చే వారంలో అందుబాటులోకి..
కొత్తగా పెంచుతున్న 808 చికిత్సలను వచ్చే వారం నుంచి అందుబాటులోకి తీసుకొస్తాం. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరోవైపు.. 450 చికిత్సల ప్యాకేజీలను రీవైజ్‌ చేస్తున్నాం. రీవైజ్డ్‌ ప్యాకేజీలను వచ్చే వారంలోనే అందుబాటులోకి తెస్తాం. 
– హరేంధిరప్రసాద్, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ సీఈఓ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top