తండ్రి కోసం వెళ్లిన బాలిక అదృశ్యం! | Incident in Kakinada district | Sakshi
Sakshi News home page

తండ్రి కోసం వెళ్లిన బాలిక అదృశ్యం!

Jun 8 2026 4:51 AM | Updated on Jun 8 2026 4:51 AM

Incident in Kakinada district

జాహ్నవి (ఫైల్‌)

బాలిక వెంట పెంపుడు కుక్క ఉన్నట్టు సమాచారం

డ్రోన్, డాగ్‌ స్క్వాడ్‌తో పోలీసుల గాలింపు

భిన్న కోణాల్లో పోలీసుల విచారణ

కాకినాడ జిల్లాలో కలకలం రేపిన ఘటన

తుని రూరల్‌: తండ్రి కోసం ఇంటి నుంచి వెళ్లిన రెండేళ్ల బాలిక దారితప్పి అదృశ్యమైంది. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక శివారు రాజానగరం (సీహెచ్‌ అగ్రహారం)లో జరిగిన ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సీహెచ్‌ అగ్రహారానికి చెందిన సుంకర గణేష్‌ , భవానీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. గణేష్‌ గ్రామ సమీపంలోని మామిడి తోటలో కాపలాదారుగా ఉంటున్నాడు. గణేష్‌ శనివారం ఉదయం పెద్ద కుమార్తె జాహ్నవి (జ్ఞానేశ్వరి)ని తీసుకుని తోటకు వెళ్లాడు. కొద్దిసేపటికి ట్రాన్స్‌కో సిబ్బంది రావడంతో జాహ్నవిని ఇంటి వద్ద దించేసి తోటకు వచ్చాడు.

అయితే జాహ్నవి మళ్లీ తండ్రి కోసం తోటకు వెళ్తూ దారితప్పిపోయింది. కొండ ప్రాంతంలో వెళుతున్న జాహ్నవిని, పెంపుడు కుక్కను అదే గ్రామానికి చెందిన (మతి స్థిమితం లేని) వ్యక్తి చూసి ఇంటికి వెళ్దాం రా.. అని జాహ్నవి వద్దకు వెళ్లగా పెంపుడు కుక్క అతనిపై దాడికి యతి్నంచింది. దీంతో ఆ వ్యక్తి గ్రామానికి వెళ్లి బాలిక తల్లి భవానికి విషయం చెప్పాడు. ఆమె కుమార్తె కోసం వెళ్లగా కనిపించలేదు.దీంతోభర్త గణేష్‌, గ్రామస్తులకు విషయం తెలియడంతో కొండ ప్రాంతంలో గాలింపు చేపట్టారు.

అయినా ఆచూకీ లేకపోవడంతో శనివారం సాయంత్రం పోలీసులకు సమాచారం అందించారు. పోలీ సులు గ్రామస్తులతో కలసి కొండ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం అర్ధరాత్రి వరకు.. ఆ తర్వాత ఆదివారం ఉదయం నుంచి  డ్రోన్, డాగ్‌ స్క్వాడ్‌ సహాయంతో కొండ ప్రాంతాన్ని జల్లెడ పట్టినా బాలిక, పెంపుడు కుక్క ఆచూకీ తెలియరాలేదు. పెద్దాపురం డీఎస్పీ తిలక్‌  పరిస్థితిని సమీక్షించారు. బాలిక అదృశ్యం వెనుక ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.  రెండేళ్ల బాలికతో పాటు పెంపుడు కుక్క సైతం కనిపించకపోవడం అంతుబట్టని అదృశ్యంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement