ఇచ్చిన మాటే లక్ష్యంగా సుపరిపాలన

Implementation of the promises made in election manifesto in four years - Sakshi

నాలుగేళ్లలో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 98.5 శాతం అమలు

కులం, మతం, ప్రాంతం, వర్గం చూడకుండా సంక్షేమాభివృద్ధి పథకాలు

పేదరికం నుంచి కుటుంబాలను పైకి తీసుకురావడమే లక్ష్యం 

ప్రతి కుటుంబం భవిష్యత్తు బాగుండాలనే ధ్యేయంతో పాలన

కోవిడ్‌ సంక్షోభం, ఆర్థిక కష్టాలను అధిగమించి మరీ పథకాల అమలు  

నాలుగేళ్లలో అన్ని వర్గాలకు డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా 10.46 కోట్ల ప్రయోజనాలు.. ఇందుకోసం ఏకంగా రూ.3.02 లక్షల కోట్లు వ్యయం

సంక్షేమంలోనూ బీసీలకు సామాజిక న్యాయం

ఇళ్ల స్థలాల లబ్ధిదారుల్లో అత్యధికంగా 16.70 లక్షల మంది బీసీలే

పాలనా సంస్కరణలతో ప్రజల వద్దకే పారదర్శక పాలన

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల­కిచ్చిన మాట నెరవేర్చడమే లక్ష్యంగా నాలు­గేళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన కొనసాగుతోంది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 98.5 శాతం నెరవేర్చడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు. కులం, మతం, ప్రాంతం, వర్గంతో పాటు చివ­రికి ఎవరికి ఓటు వేశారన్నది కూడా చూడకుండా సుపరిపాలన అందించారు. చెప్పిన మాట మేరకు సంక్షేమాభివృద్ధి పథకాల అమలు కొన­సాగి­స్తున్నారు.

పేదరికం నుంచి కుటుంబాలను పైకి తీసుకురావడమే లక్ష్యంగా మేనిఫెస్టోలో చెప్ప­ని పథకాలను సైతం అమలు చేశారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం నిన్నటి కంటే నేడు.. నేటి కంటే రేపు.. రేపటి కంటే భవిష్యత్తు బాగుండాలనే లక్ష్యంగా నాలుగేళ్ల పాలన కొనసాగించారు. కోవిడ్‌ సంక్షోభం, ఆర్థిక కష్టాలను అధిగ­మించి మరీ పథకాలు అమలు చేసి విశ్వసనీయ­తకు మారు పేరుగా పాలన సాగుతోంది.

గత ప్రభు­త్వాలకు భిన్నంగా, మేనిఫెస్టో అంటే పవిత్ర గ్రంథాలైన భగవద్గీత, బైబిల్,  ఖురాన్‌గా అమలు చేసి చూపించారు. అందుకే ధైర్యంగా ‘గడప గడపకు మన ప్రభుత్వం’ ద్వారా ఎన్ని­కలు రాకముందే ఎమ్మెల్యేలను ప్రతి ఇంటికి పంపించే కార్యక్రమం చేపట్టారు. నాలుగేళ్ల పాలనతో ఇంటింటికి, మనిషి మనిషికి ఏం మేలు జరిగిందనే విషయాన్ని 

ఎమ్మెల్యేలు స్వయంగా వివరించడమే కాకుండా.. ప్రింట్‌ చేసిన పుస్తకాలను వారికి ఇచ్చి, ఆ మేలు జరిగిందా లేదా అని ధైర్యంగా అడిగి ప్రజల మద్దతు పొందుతున్నారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చినందునే ఎమ్మెల్యేలు ధైర్యంగా ప్రజల దగ్గరకు వెళ్లగలుగుతున్నారు. మరో పక్క వ్యవసాయ, విద్య, వైద్య రంగాల్లో పరిపాలనలో సంస్కరణల ద్వారా విప్లవాత్మక మార్పులు తెచ్చారు. గ్రామ, వార్డు స్థాయికి పరిపాలనను, పథకాలను, పౌర సేవలను పారదర్శకంగా తీసుకెళ్లారు. తద్వారా గ్రామాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.

రూ.3.02 లక్షల కోట్లు సాయం
గత నాలుగేళ్లలో అన్ని వర్గాలకు నవరత్నాల కింద డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా 10.46 కోట్ల ప్రయోజనాల కోసం ఏకంగా రూ.3.02 లక్షల కోట్లు వ్యయం చేశారు. ఇందులో డీబీటీ ద్వారా 7.90 కోట్ల ప్రయోజనాలకు రూ.2.11 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేశారు. నాన్‌ డీబీటీ ద్వారా 2.57 కోట్ల ప్రయోజనాల కింద రూ.91 వేల కోట్లు వ్యయం చేశారు. సంక్షేమంలో బీసీలకు సామాజిక న్యాయం జరిగింది. వెనుకబడిన వర్గాల వారు ఇన్నాళ్లు వెనుకబడిపోయే ఉన్నారు. జనాభాలో అత్యధికులుగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వాల్లో వారికి ఏ రంగంలో కూడా తగిన వాటా లభించలేదు.

ఆఖరుకు దారిద్య్ర రేఖకు దిగువనున్న బీసీలు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలకు కూడా గత ప్రభుత్వంలో నోచుకోలేదు. బీసీలంటే బ్యాక్‌ వర్డ్‌ క్యాస్ట్‌ కాదు.. దేశానికే బ్యాక్‌ బోన్‌ అంటూ పాదయాత్రతో పాటు ఎన్నికల ముందు నిర్వహించిన బీసీ సదస్సులో కొత్త నిర్వచనం చెప్పిన అప్పటి ప్రతిపక్ష నేత.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తన నాలుగేళ్ల పాలనలో అన్ని రంగాల్లో వారికి తగిన వాటా ఇచ్చారు. ఇళ్ల స్థలాల లబ్ధిదారుల్లో అత్యధికంగా 16.70 లక్షల మంది బీసీలే కావడం గమనార్హం. 
 
ఆయా వర్గాలకు లబ్ధి ఇలా
నాలుగేళ్లలో నవరత్నాలు డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా బీసీలకు రూ.1,48,597 కోట్లు వ్యయం చేశారు. ఇందులో డీబీటీ ద్వారా రూ.99,681 కోట్లు, నాన్‌ డీబీటీ ద్వారా రూ.48,916 కోట్లు వ్యయం చేశారు. 
♦ నవరత్నాలు డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా ఎస్సీలకు రూ.53,929 కోట్లు వ్యయం చేశారు. ఇందులో డీబీటీ ద్వారా రూ.34,963 కోట్లు, నాన్‌ డీబీటీ ద్వారా రూ.18,966 కోట్లు వ్యయం చేశారు. 
♦ నవరత్నాలు డీబీటీ నాన్‌ డీబీటీ ద్వారా ఎస్టీలకు రూ.15,114 కోట్లు వ్యయం చేశారు. ఇందులో డీబీటీ ద్వారా రూ.10,395 కోట్లు, నాన్‌ డీబీటీ ద్వారా రూ.4,719 కోట్లు ఖర్చు చేశారు. 
♦ నవరత్నాలు డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా మైనారిటీలకు రూ.18,960 కోట్లు వ్యయం  చేశారు. ఇందులో డీబీటీ ద్వారా రూ.11,948 కోట్లు, నాన్‌ డీబీటీ ద్వారా రూ.7,012 కోట్లు వ్యయం చేశారు. 
♦  నవరత్నాలు డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా కాపులకు రూ.26,634 కోట్లు వ్యయం చేశారు. ఇందులో డీబీటీ ద్వారా రూ.20,550 కోట్లు, నాన్‌ డీబీటీ ద్వారా రూ.6,084 కోట్లు ఖర్చు చేశారు.
♦  నవరత్నాలు డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా ఇతరులకు రూ.38,871 కోట్లు వ్యయం చేశారు. ఇందులో డీబీటీ ద్వారా రూ.33,531 కోట్లు, నాన్‌ డీబీటీ ద్వారా రూ.5340 కోట్లు వ్యయం చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top