శ్రీమతి కోసం పరపతి పణం | Illegal Promotions of Principals in Government Degree Colleges | Sakshi
Sakshi News home page

శ్రీమతి కోసం పరపతి పణం

Jun 5 2026 5:10 AM | Updated on Jun 5 2026 5:10 AM

Illegal Promotions of Principals in Government Degree Colleges

ఎమ్మెల్సీ చిరంజీవి వక్రమార్గం  

భార్య నివేదిత ప్రమోషన్‌ కోసం అధ్యాపకులకు ద్రోహం

సొంత వారి కోసం ఆగమేఘాలపై జీవోలు.. బదిలీలా? 

బదిలీ నిషేధం ఉండగా పరిపాలన కారణాలు చూపించి బదిలీ చేసేస్తారా? 

కోర్టుల్లో మధ్యంతర ఉత్తర్వులు ఉంటే ఎలా ప్రమోషన్లు కల్పించారు 

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రిన్సిపాల్‌ అక్రమ ప్రమోషన్లపై అధ్యాపకులు ఆగ్రహం

సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వ రాజకీయ స్వార్థానికి అధ్యాపకుల జీవితాలు బలైపోతున్నాయి. ఒక ఎమ్మెల్సీ తన భార్య పదోన్నతి కోసం సాగించిన కుతంత్రాలు వేలాది మంది లెక్చరర్లను తీవ్ర అవస్థలపాలు చేస్తున్నాయి. కొండలు, కోనల్లో కుటుంబానికి వేల కిలో మీటర్ల దూరంలో పని చేస్తూ బదిలీల కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తున్న సగటు అధ్యాపకుడి ఆశలకు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు (చిరంజీవి) గండికొట్టడం మేధావి వర్గాల్లో ఆగ్రహావేశాలు రేకెత్తిస్తోంది. ‘‘లెక్చరర్స్, ప్రిన్సిపాళ్ల బాధ వినే వారు కూటమి ప్రభుత్వంలో లేరా? లోకేశ్‌ విద్యాశాఖ మంత్రి అయినప్పటి నుంచి వినతులిస్తున్నాం. 

కానీ, లోకేశ్‌ ఎప్పుడూ ఎమ్మెల్సీ చిరంజీవితో సంప్రదించేవారు. ఇక్కడే, ఎమ్మెల్సీ కథ నడిపించారు. బదిలీలపై ఎప్పుడు అడిగినా ప్రభుత్వంలో విలీనమైన ఎయిడెడ్‌ అధ్యాపకుల సర్వీసు రూల్స్‌ లేవని అధికారులతో చెప్పించి చాకచక్యంగా బదిలీలు అడ్డుకున్నారు. సర్వీసు రూల్స్‌ ప్రమోషన్లకు అవసరమా? బదిలీలకు అవసరమా? బదిలీలకు స్టేషన్‌ సీనియార్టీ ఉంటే సరిపోతుందని అధికారులకు తెలీదా?’’ అంటూ సామాజిక మాధ్యమాల్లో అధ్యాపకులు దుమ్మెత్తిపోస్తున్నారు. 

సీనియార్టీలో 40వ స్థానంలో ఉన్నా..! 
ఇటీవల ప్రిన్సిపాల్‌ ప్రమోషన్‌ కోసం రూపొందించిన సీనియార్టీ జాబితాలో 20వ స్థానానికి ముందే ఉన్న లెక్చరర్లు సబ్బవరానికి మొదటి ఆప్షన్‌ ఇవ్వగా ఎక్కడో 40వ స్థానంలో ఉన్న ఎమ్మెల్సీ భార్య నివేదితకు ప్రిన్సిపాల్‌ పోస్టు కట్టబెట్టేశారని బాధితులు తూర్పారపడుతున్నారు. అసలు తొలుత తయారు చేసిన జాబితాలో నివేదితకు 17వ స్థానం ఇవ్వగా ఆ తర్వాత దానిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో 40వ స్థానంలో పెట్టారని, అయినా అనుకున్న చోట ప్రిన్సిపాల్‌ పోస్టుల ఇచ్చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియార్టీ జాబితాలో టాప్‌లో ఉన్న ఓ జువాలజీ లెక్చరర్‌ సబ్బవరం తొలి ఆప్షన్‌ ఇస్తే.. ఆమెను మాడుగుల వేశారు.

అయితే, ఫిజిక్స్, తెలుగు లెక్చరర్లు మాడుగుల అవకాశా­న్ని కోల్పోయి ఎక్కడో పాల­కొండ, అరకు వ్యాలీ(ఉమెన్‌) డిగ్రీ కళాశాలలకు పోస్టింగ్‌ ఇచ్చారు. జోన్‌–2లోనూ 24వ స్థానంలో ఉన్న గణితం లెక్చరర్‌ను మంత్రి సిఫారసుతో సీనియర్లను వెనక్కి నెట్టి రామచంద్రాపురం వేశారు. జోన్‌–1 శ్రీకాకుళం ఆర్ట్స్‌ కళాశాలలో ఖాళీని చూపించకుండా బ్లాక్‌లో పెట్టారు.

ఇక్కడి ఐడీ కళాశాలలో ఏడాదిగా ఒక జూనియర్‌ లెక్చరర్‌ ఇన్‌చార్జీగా పాలన సాగిస్తున్నారే తప్ప ప్రిన్సిపాల్‌ పోస్టు భర్తీ చేయట్లేదు. ‘‘అసలు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పుడు ప్రమోషన్లు ఎలా చేశారు. మరో కేసులో ప్రిన్సిపాల్‌ పోస్టు ఖాళీగా ఉంచకుండా ఇన్‌చార్జీ, ఇన్‌టెర్మ్‌ అరేంజ్‌మెంట్‌ చేయాలని సూచించింది. దీనిని అడ్డుపెట్టుకుని ప్రమోషన్లు ఇచ్చేస్తారా? అంటూ దుయ్యబడుతున్నారు. ఈ అక్రమ ప్రమోషన్లపై సమగ్ర విచారణ చేసి విద్యా వ్యవస్థను కాపాడాలని అధ్యాపకులు డిమాండ్‌ చేస్తున్నారు.    

పథకం ప్రకారమే..  
సర్వీసు రూల్స్‌ను అడ్డుపెట్టుకుని బదిలీలను నిలుపుదల చేయడంలో ఎమ్మెల్సీ చిరంజీవి పథకం పారిందని, ఆయన భార్యకు ప్రిన్సిపాల్‌ పోస్టును కొట్టేశారని అధ్యాపకులు మండిపడుతున్నారు. ఎమ్మెల్సీ చిరంజీవి ఈ మూడేళ్ల పదవీ కాలంలో సొంత వారి కోసం స్వార్థ రాజకీయాలు చేశారని ఎండగడుతున్నారు. తన భార్య, స్నేహితుల కోసం ఆగమేఘాలపై ప్రభుత్వంలో జీవోలు తెచ్చుకుని బదిలీలు చేసుకున్నారని విమర్శిస్తున్నారు.

ఎమ్మెల్సీ చిరంజీవి భార్య నివేదిత తొలుత జోన్‌–3 నుంచి జోన్‌–1కు, ఆ తర్వాత చోడవరం నుంచి సబ్బవరం, సబ్బవరం నుంచి విశాఖపట్నం(అటానమస్‌–ఉమెన్‌) కళాశాలకు చకచకా బదిలీలు చేయించుకున్నారని, ఇక భార్య స్నేహితురాలు కోసం, శశిభూషణ్‌ అనే ఎమ్మెల్సీ స్నేహితుడి భార్య కోసం జీవోలు ఇచ్చి  న ప్రభుత్వం వేలాది మంది అధ్యాపకులను మోసం చేస్తోందని దుయ్యబడుతున్నారు. ఇన్ని బదిలీలకు అడ్డురాని సర్వీసు రూల్స్‌ నిబంధన తమకు ఎలా వర్తిస్తుందని ప్రశి్నస్తున్నారు. పైగా ప్రమోషన్లను మే 30కి ఇచ్చారని.. ఒక్క రోజు ఆగితే రిటైర్‌ అయిన వాళ్లతో ఖాళీ అయిన పోస్టులను జూన్‌ 1న చూపించి భర్తీ చేసే అవకాశం ఉన్నప్పటికీ అర్ధరాత్రి అర్జెంటుగా ప్రమోషన్లు ఎందుకు ఇచ్చారని మండిపడుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement