30% మందితోనే ట్రిపుల్‌ ఐటీ తరగతులు

IIIT classes with 30 percent students - Sakshi

70 శాతం మంది విద్యార్థులకు ఆన్‌లైన్‌ బోధన

తరగతుల నిర్వహణపై ఆర్జీయూకేటీ మార్గదర్శకాలు

పరీక్షల షెడ్యూల్‌ కూడా విడుదల  

సాక్షి, అమరావతి/నూజివీడు: రాష్ట్రంలోని ట్రిపుల్‌ ఐటీల్లో 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించిన తరగతుల నిర్వహణపై రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జి టెక్నాలజీ(ఆర్జీయూకేటీ) శనివారం మార్గదర్శకాలు విడుదల చేసింది. కోవిడ్‌–19 నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం బ్లెండెడ్‌ లెర్నింగ్‌(ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌) విధానంలో కొనసాగనుంది. తరగతిలో బోధన(ఆఫ్‌ లైన్‌)కు 30 శాతం మంది విద్యార్థులను అనుమతిస్తారు. మిగతా 70 శాతం మందికి ఆన్‌లైన్‌లో బోధిస్తారు. పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ కూడా ఇచ్చింది. కోవిడ్‌ నేపథ్యంలో స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ ప్రకారం క్యాంపస్‌లను నిర్వహించాల్సి ఉంటుంది. 

మార్చి చివర్లో మొదటి సెమిస్టర్‌ పరీక్షలు
మొదటి సెమిస్టర్‌లో బ్లెండెడ్‌ లెర్నింగ్‌ విధానాన్ని బోధన–అభ్యాస వ్యూహంగా అనుసరిస్తారు. మొత్తం విద్యార్థుల సంఖ్యలో 30 శాతం మందిని క్యాంపస్‌లోకి అనుమతిస్తారు. మిగిలిన వారికి ఆన్‌లైన్‌ బోధన ఉంటుంది. ఆర్జీయూకేటీ నాలుగు క్యాంపస్‌లలో నవంబర్‌ 2 నుంచి పీయూసీ–2, ఈ–2, ఈ–3, ఈ–4కు ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు షెడ్యూల్‌ ఇచ్చారు. 2019–20 పీయూసీ–2 బ్యాచ్‌ ప్రస్తుతం క్యాంపస్‌లలో జరిగే సెమిస్టర్‌–2కు సంబంధించిన పరీక్షలకు హాజరవ్వాలి. వీటి ఫలితాల ఆధారంగా ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరంలో వారికి ప్రవేశాలు జరుపుతారు. ఇక 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించిన మొదటి సెమిస్టర్‌ ముగింపు పరీక్షలు 2021 మార్చి చివర్లో జరుగుతాయి.

2వ సెమిస్టర్‌ ఏప్రిల్‌లో ప్రారంభమై ఆగస్టు నాటికి పూర్తవుతుంది. కరోనా భయంతో విద్యార్థులను పంపించేందుకు తల్లిదండ్రులు భయపడితే.. డిసెంబర్‌ మొదటి వారంలో నిర్వహించే పీయూసీ–2 పరీక్షలకు హాజరయ్యేందుకు వర్సిటీ మరో అవకాశమిస్తుంది.  విద్యార్థులకు కోవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తారు. పాజిటివ్‌ ఉన్న విద్యార్థులను క్యాంపస్‌లోకి అనుమతించరు. కాగా, ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశానికి నిర్వహించనున్న ఏపీ ఆర్జీయూకేటీ సెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువును ఈ నెల 13 వరకు పొడిగించినట్లు వర్సిటీ తెలిపింది. రూ.1,000 అపరాధ రుసుంతో ఈనెల 16 వరకు గడువు ఇచ్చింది. ట్రిపుల్‌ ఐటీల్లో రోబోటిక్స్, మెషిన్‌లెర్నింగ్‌ నూతన బ్రాంచిలను ప్రవేశపెట్టనున్నట్లు వర్సిటీ చాన్స్‌లర్‌ ఆచార్య కేసీ రెడ్డి చెప్పారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top