పేదల చెంతకు విద్య, వైద్య రంగాలు

Ideal services in agriculture sector by RBKs - Sakshi

ఆ ఘనత సీఎం వైఎస్‌ జగన్‌దే

ఆర్‌బీకేల ద్వారా వ్యవసాయ రంగంలో ఆదర్శవంతమైన సేవలు

రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత

ఏపీ తెలుగు, సంస్కృత అకాడమి ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు ప్రదానం

ఏఎన్‌యూ (గుంటూరు) : సామాన్యుడి సంక్షేమం, అభ్యున్నతే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం చేపడుతున్న మహాయజ్ఞంలో మేధావులు భాగస్వామ్యులు కావాలని రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత కోరా రు. ఆంధ్రప్రదేశ్‌ తెలుగు, సంస్కృత అకాడమీ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు–2023 ప్రదానోత్స వం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మంగళవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన వనిత మాట్లాడుతూ.. ఎంతో ఖరీదైనవిగా మారిన విద్య, వైద్య రంగాలను ఉచితంగా పేదల చెంతకు చేర్చిన ఘనత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదేనన్నారు.

విత్తనం నుంచి పంట విక్రయం వరకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందన్నారు. గత ప్రభుత్వం తెలుగు అకాడమీని విస్మరించిందని.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తెలుగుతోపాటు సంస్కృత అకాడమీని కూడా ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నారని, అకాడమి అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ విశ్రాంత అధ్యాపకుడు, చిత్రకళాకారుడు ఆర్‌.సుభాష్‌బాబు మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్థి దశలోనే తోటి విద్యార్థులకు ఎంతో ప్రేరణ ఇచ్చేవారని తెలిపారు. 

ఉగాది పురస్కారాల ప్రదానం
షార్‌ డైరెక్టర్‌ పి.గోపీకృష్ణ (విద్య, శాస్త్ర సాంకేతిక రంగం), డాక్టర్‌ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే (వైద్య రంగం), పసుమర్తి పావని (లలిత కళలు), కురటి సత్యం నాయుడు (జానపద, నాటక రంగం), వి.గోపీచంద్‌ (వ్యవసాయ రంగం), మాదిరెడ్డి కొండారెడ్డి (సేవా రంగం), ఆర్‌.సుభాష్‌బాబు (చిత్రకళా రంగం)కు ఉగాది పురస్కారాలు ప్రదానం చేశారు. ఏఎన్‌యూ వీసీ పి.రాజశేఖర్, తెలుగు అకాడమీ డైరెక్టర్‌ వి.రామకృష్ణ ప్రసంగించారు. 

ఏపీ వేదికగా  విశ్వజనీన ఆరోగ్య పథకాలు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచానికే ఆదర్శమైన ఆరోగ్య పథకాలు అమలువుతున్నాయి. పేదవాడి ఆరోగ్యంపై ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలనే వాస్తవాన్ని గ్రహించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకంలో ఎన్నో రోగాలకు చికిత్స అందించేలా నిర్ణయం తీసుకుని విశ్వజనీన ఆరోగ్య ప్రణాళికను అమలు చేస్తున్నారు. ఇలాంటి ఆరోగ్య ప్రణాళికను నేను ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదు. నాడు–నేడు పథకం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది అవుతోంది. అందుకే ఏపీ ప్రభుత్వంతో కలిసి కొన్ని సేవలందించేందుకు సిద్ధమవుతున్నా.– డాక్టర్‌ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే, ప్రముఖ కార్డియాలజీ వైద్య నిపుణులు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top