సాక్షి, వైఎస్సార్ జిల్లా: భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడి తమ నిండు ప్రాణాలను బలితీసుకున్నారు. చెన్నూరు మండలం ముండ్లపల్లెకు చెందిన సుధీర్‌బాబు(35), పెంచలమ్మ(35) కొన్ని సంవత్సరాల కిందట వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె వున్నారు. సు«దీర్‌బాబు కూలీ పనులకు వెళుతూ వుండేవాడు.
అతని భార్య పెంచలమ్మ కొప్పర్తి ప్రాంతంలో ఓ సంస్థలో విధులు నిర్వహిస్తుండేది. గత నాలుగు రోజులుగా ఇద్దరికి వివాహేతర సంబంధాలపై ఒకరినొకరు గొడవపడ్డారు. శనివారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో కడప– రాయచోటి రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపంలో సుధీర్‌బాబు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటనకు తట్టుకోలేక అతని భార్య పెంచలమ్మ కడప– కనుమలోపల్లె మధ్యలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. దీంతో వారి కుటుంబాలు తీవ్ర విషాదంలోకి వెళ్లాయి. కడప రైల్వే పోలీసులు మృతదేహాలను కడప రిమ్స్ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


