కృష్ణా, గోదావరి పోటాపోటీ

Huge Flood Flow At Krishna And Godavari Rivers Andhra Pradesh - Sakshi

పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు.. పోటెత్తిన నదులు

శ్రీశైలం ప్రాజెక్టులోకి 2.72 లక్షల క్యూసెక్కుల ప్రవాహం.. ఏడు గేట్లు ఎత్తివేత.. సాగర్‌లోకి 1.91 లక్షల క్యూసెక్కుల ప్రవాహం.. 

276.09 టీఎంసీలకు చేరిన నిల్వ

మరో రెండ్రోజుల్లో నిండిపోనున్న నాగార్జునసాగర్‌

ప్రకాశం బ్యారేజ్‌ నుంచి లక్ష క్యూసెక్కుల కృష్ణా జలాలు సముద్రంలోకి.. భారీ వర్షాలతో వంశధారలోనూ వరద ఉధృతి

మళ్లీ గోదావరి ఉగ్రరూపం

ధవళేశ్వరం బ్యారేజ్‌ నుంచి 7.81 లక్షల క్యూసెక్కులు కడలిలోకి 

కృష్ణా, గోదావరి నదుల్లో వరద మరింత పెరుగుతుందని సీడబ్ల్యూసీ అంచనా

సాక్షి, అమరావతి/పోలవరం రూరల్‌/శ్రీశైలం ప్రాజెక్ట్‌/ధవళేశ్వరం/విజయపురిసౌత్‌/గాంధీనగర్(విజయవాడ సెంట్రల్‌)/: నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, గోదావరి నదులు వరద ఉధృతితో పోటాపోటీగా ప్రవహిస్తున్నాయి. కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్ర మంత్రాలయం వద్ద ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండడంతో అధికారులు ప్రమాద హెచ్చరికను ఎగురవేసి ప్రజలను అప్రమత్తం చేశారు. అలాగే.. మహారాష్ట్ర, తెలంగాణ, చత్తీస్‌గఢ్, ఒడిశాలలో కురుస్తున్న వర్షాలకు పెన్‌ గంగ, ప్రాణహిత, ఇంద్రావతి నదులు ఉరకలెత్తుతుండటంతో గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది.

భద్రాచలం వద్ద గంట గంటకూ ప్రవాహం పెరుగుతోంది. ఇక్కడ మంగళవారం సా.6 గంటలకు 9,74,666 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి మట్టం 44 అడుగులకు చేరుకుంది. దాంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. మరోవైపు..కృష్ణా, గోదావరి నదుల్లో బుధవారం వరద ఉధృతి మరింతగా పెరిగే అవకాశం ఉందని బేసిన్‌ పరిధిలోని రాష్ట్రాలను కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అప్రమత్తం చేసింది. 

శ్రీశైలం ప్రాజెక్టు ఏడు గేట్లు ఎత్తివేత..
కృష్ణా, తుంగభద్రల నుంచి భారీ వరదకు తోడు వాగులు, వంకల వరద తోడవవుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి వస్తున్న వరద ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది. మంగళవారం సా.6 గంటలకు 2,72,943 క్యూసెక్కులు చేరుతుండటంతో.. ఏడు గేట్లను పది అడుగుల మేర ఎత్తి 1,95,559 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 62,617 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 884.7 అడుగుల్లో 213.88 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఇక సాగర్‌లోకి 1,91,646 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 577.6 అడుగుల్లో 276.09 టీఎంసీలకు చేరుకుంది. మరో 36 టీఎంసీలు వస్తే రెండ్రోజుల్లో సాగర్‌ నిండిపోతుందని అధికారవర్గాలు తెలిపాయి.
 
ప్రకాశం బ్యారేజ్‌లోకి భారీ వరద
సాగర్‌లో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదులుతున్న నీటికి మూసీ, వైరా జలాలు తోవడవుతండటంతో పులిచింతలలోకి 30,197 క్యూసెక్కులు చేరుతున్నాయి. ముప్పు నివారణ కోసం ప్రాజెక్టులో కొంతభాగాన్ని ఖాళీచేస్తూ.. స్పిల్‌వే గేట్లు, విద్యుదుత్పత్తి ద్వారా 51,831 క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం పులిచింతలలో 40.07 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పులిచింతల నుంచి దిగువకు వదిలేస్తున్న నీటికి.. పాలేరు, మున్నేరు, కట్టలేరు వరద తోడవుతుంటంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి 1,07,985 క్యూసెక్కులు చేరుతోంది ఇక్కడ నుంచి 70 గేట్లు ఎత్తి 1,00,590 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. 

వరదెత్తిన వంశధార..
ఇక ఒడిశా, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వంశధారలో వరద ఉధృతి మరింతగా పెరిగింది. గొట్టా బ్యారేజ్‌లోకి 21,004 క్యూసెక్కులు చేరుతుండగా.. ముంపు ముప్పును నివారణకు 22,040 క్యూసెక్కులను బంగాళాఖాతంలోకి వదిలేస్తున్నారు. నాగావళి నది నుంచి నారాయణపురం ఆనకట్టలోకి 10,200 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతేస్థాయిలో సముద్రంలోకి వదిలేస్తున్నారు. 

పోలవరం వద్ద అప్రమత్తం
ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో పోలవరం ప్రాజెక్టు వద్ద జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గంట గంటకూ వరద ప్రవాహాన్ని అంచనావేస్తూ.. వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తూ వరదను సమర్థవంతంగా నియంత్రిస్తున్నారు. మంగళవారం సా.6 గంటలకు పోలవరం ప్రాజెక్టులోకి 6,92,948 క్యూసెక్కులు చేరుతుండటం.. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ వద్ద నీటి మట్టం 33.06, దిగువ కాఫర్‌ డ్యామ్‌ వద్ద నీటి మట్టం 23.14 మీటర్లకు చేరుకుంది. వచ్చిన నీటిని వచ్చినట్లుగా 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. మరోవైపు.. ధవళేశ్వరం బ్యారేజ్‌ నుంచి 7,81,627 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top