సెంటున్నర ఇంటికి జాతీయ అవార్డు

This Home Constructed In Cent And Half Place In Prakasam - Sakshi

అద్దంకి పట్టణానికి చెందిన అనంతలక్ష్మి గృహం ఎంపిక 

జనవరి 1న ఒంగోలు కలెక్టర్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో గృహిణితో మాట్లాడనున్న పీఎం నరేంద్రమోదీ

సాక్షి, అద్దంకి: ‘‘సెంటు, సెంటున్నర స్థలంలో ఏం ఇల్లు పడుతుందండీ.. ఉండటానికేనా.. అంతా ఇరుకే..’’ అనే వారి నోటికి తాళం వేసేలా సెంటున్నర విస్తీర్ణంలో ప్రభుత్వం ఇచ్చిన నగదుతో పొందికగా ఇల్లు నిర్మించుకుని ఏకంగా కేంద్ర ప్రభుత్వ అవార్డుకు ఎంపికై అందరి మన్ననలు అందుకుంటున్నారు అద్దంకి పట్టణానికి చెందిన మందలపు అనంత లక్ష్మి. జనవరి ఒకటో తేదీన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆమెతో ఒంగోలు కలెక్టర్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడబోతున్నారు. ఆ గృహం విశేషాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. 

ఇంటి నిర్మాణ విశేషాలివీ.. 
అద్దంకి పట్టణానికి చెందిన మందలపు అనంతలక్ష్మి, తిరుపతయ్యలది చిన్న కుటుంబం. ఒకటిన్నర ఎకరం వ్యవసాయ భూమి మాత్రమే ఉంది. గేదెలు పెంచుకుంటూ పాలపై వచ్చే ఆదాయంతోనే జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో వారికి 2018లో ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకం(అర్బన్‌) కింద ఇల్లు మంజూరైంది. ఆ నగదుతోపాటు, పాలు పెరుగు అమ్మగా వచ్చిన నగదును జోడించి, సొంత భూమి సెంటున్నర స్థలంలో ముచ్చటగా పొందికైన గృహాన్ని సకాలంలో నిర్మించుకున్నారు. బయటి నుంచి చూస్తే అనంత లక్ష్మి గృహం ఆ ఏముంది సాధారణమైనదే కదా? ఇల్లు ఇరుకుగానే ఉంటుందిలే అనుకుంటారు.!  కానీ ఇంట్లోకి వెళ్లి చూస్తే తక్కువ విస్తీర్ణంలోనే ఉన్నంతలో విశాలంగా బెడ్‌ రూం, వరండా, హాల్, వంట గది, ముందు కొంచెం, వెనుక కొంచెం ఖాళీ స్థలంతో సుందరంగా అబ్బురపడేలా నిర్మించారు. 

సర్వాంగ సుందరంగా ఉన్న హాల్‌ 

ఇంటి కొలతలు..
నాలుగు వైపులా 12 అడుగులతో హాల్, 12 అడుగుల వెడల్పు, 6 అడుగుల పొడవుతో వంట గది, ఎటు చూసినా 7 అడుగుల వెడల్పుతో ఉండే బెడ్‌ రూం, చిన్న వరండా, వెనుక ఖాళీ స్థలంలో అటాచ్డ్‌ బాత్‌రూం లెట్రిన్‌ నిర్మించుకున్నారు. మొత్తం 36 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పు స్థలంలో నిర్మించిన ఈ ఇంటి వివరాలను గృహ నిర్మాణ శాఖ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు. రాష్ట్రం మొత్తం మీద పంపిన గృహాల్లో అద్దంకికి చెందిన అనంతలక్ష్మి గృహాన్ని వారు బెస్ట్‌ కన్‌స్ట్రక్షన్‌ హౌస్‌గా ఎంపిక చేశారు. జనవరి ఒకటో తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఆమెకు అవార్డు ఇవ్వనున్నారు.

అన్ని వసతులతో నిర్మించుకున్నాం 
సెంటున్నర స్థలంలోనూ మంచి ఇల్లే నిర్మించుకోవచ్చు. ఇంటి విస్తీర్ణానికి మితం ఏముంది. మా ఇల్లు చాలా బాగుంది. నేను, మా భార్య, కుమారుడు ఆ ఇంట్లో హాయిగా ఉండేలా అన్ని వసతులతో నిర్మించుకున్నాం.
– తిరుపతయ్య

అవార్డు వస్తుందనుకోలేదు 
మేము గతంలో ఇల్లు లేక ఇబ్బందులుపడ్డాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకంలో ఇల్లు మంజూరు కావడంతో మాకున్న సెంటున్నర స్థలంలో పొందికగా కట్టుకున్నాం. ఇంటి నిర్మాణ విశేషాలను చూసిన గృహ నిర్మాణ శాఖ మా ఇంటి ఫొటో పంపిందంట. దాంతో మాకు జాతీయ అవార్డు వచ్చిందని అధికారులు వచ్చి చెప్పారు. చాలా సంతోషంగా ఉంది.  
– మందలపు అనంత లక్ష్మి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top