నామినేషన్‌ వేసే పరిస్థితి లేనప్పుడు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించండి | High Court verdict in the petition filed by YSRCP | Sakshi
Sakshi News home page

నామినేషన్‌ వేసే పరిస్థితి లేనప్పుడు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించండి

Oct 16 2026 4:14 AM | Updated on Oct 16 2026 4:14 AM

High Court verdict in the petition filed by YSRCP

‘స్థానిక’ అభ్యర్థులకు హైకోర్టు వెసులుబాటు

కలెక్టరేట్, ఎన్నికల అధికారి కార్యాలయంలో నామినేషన్‌కు అభ్యర్థించవచ్చు

ఈ అభ్యర్థనపై ఎన్నికల అధికారులు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోవాలి

వైఎస్సార్‌సీపీ దాఖలు చేసిన వ్యాజ్యంలో తీర్పు

సాక్షి, అమరావతి: మునిసిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా నామినేషన్లు వేసే పరిస్థితిలో లేని అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసేందుకు వీలుగా ప్రతి కలెక్టర్‌ కార్యాలయం లేదా జిల్లా ఎన్ని­కల అధికారి కార్యాలయంలో తగిన ఏర్పాటు చేసేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదే­శిం­చాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ  దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది.

‘స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసేందుకు వీలుగా తనకు కలెక్టర్‌ కార్యాలయం లేదా ఎన్నికల అధికారి కార్యాలయంలో నామినేషన్‌ వేసేందుకు వెసులుబాటునివ్వాలని ఎవరైనా అభ్యర్థి వినతి పత్రం సమర్పిస్తే, దానిపై మూడు రోజుల్లోపు తగిన చర్యలు తీసుకోవాలి’ అని హైకోర్టు గురువారం ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించింది.   వైఎస్సార్‌సీపీ  ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి  దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ మండవ కిరణ్మయి ఈ మేరకు తీర్పు వెలువరించారు.

క్రిమినల్‌ కేసుల వివరాలిచ్చేలా ఆదేశాలివ్వండి
హైకోర్టులో వైఎస్సార్‌సీపీ  పిటిషన్‌.. నేడు విచారణ
సాక్షి, అమరావతి: స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని కోరితే, ఆ వివరాలను నిర్ణీత గడువులోపు అందించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ  హైకోర్టును ఆశ్రయించింది. ఒకవేళ ఎలాంటి కేసులు లేకపోతే, ఆ విషయాన్ని తెలియజేస్తూ ధ్రువీకరణ పత్రం ఇచ్చేలా కూడా ఆదేశాలు జారీ చేయాలని తమ పిటిషన్‌లో హైకోర్టును అభ్యర్థించింది.‘ఏ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.. క్రై మ్‌ నంబర్‌ ఎంత వంటి వివరాలతో కూడిన ఒక అధికారిక ధ్రువీకరణ పత్రాన్ని రెండు రోజుల్లోగా లేదా నిర్ణయించిన గడువులోగా అభ్యర్థికి అందించేలా ఆదేశాలివ్వండి.’ అని వైఎస్సార్‌సీపీ తన పిటిషన్‌లో కోర్టును కోరింది. ఈ వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరపాలని సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి గురువారం అభ్యర్థించగా శుక్రవారం వాదనలు వింటామని జస్టిస్‌ వడ్డిబోయన సుజాత స్పష్టంచేశారు.

నామినేషన్ల గడువును 6 రోజులకు పెంచాలి
సాక్షి, అమరావతి: స్థానిక ఎన్నికల్లో నామినేషన్ల దాఖలుకు కేవలం మూడు రోజుల గడువును మాత్రమే ఇవ్వడాన్ని సవాలు చేస్తూ భారత చైతన్య పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ మునిసిపాలిటీలు, మునిసిపల్‌ కార్పొరేషన్ల చట్ట నిబంధనల ప్రకారం నామినేషన్ల గడువును ఆరు రోజులకు పెంచేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని ఆయన వ్యాజ్యంలో హైకోర్టును కోరారు. 

ఎన్నికల సంఘం నిర్దేశించిన 3 రోజుల గడువు నామినేషన్ల దాఖలుకు ఎంత మాత్రం సరిపోదని స్పష్టంచేశారు.  గత ఎన్నికల సమయంలో అనుభవాలను ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకోలేదని వివరించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన నో డ్యూస్‌ సర్టిఫికేట్, కుల ధ్రువీకరణ పత్రాలు వంటి డాక్యుమెంట్లను అధికారులు సమర్పించేందుకు సైతం తగిన గడువు అవసరమని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement