విశాఖ మేయర్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇచ్చిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్కు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ధన్యవాదాలు తెలిపారు. విశాఖ ప్రజల ఆశీస్సులతో ఘన విజయం సాధించి, జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ విశాఖను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి విశ్వ నగరంగా తీర్చిదిద్దారని గుర్తుచేశారు. నగరంలో జగన్ చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ ఫలాలనే రాబోయే ఎన్నికల్లో తమ ప్రధాన ప్రచార అస్త్రాలుగా మలుచుకుని ప్రజల ముందుకు వెళ్తామని వెల్లడించారు.
ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, వైఫల్యాలను ప్రజల్లో ఎండగడతామన్నారు. విశాఖలో రూపాయి, అర్ధ రూపాయికే విలువైన భూములను కట్టబెడుతూ అడ్డగోలు అమ్మకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
అలాగే ఉత్తరాంధ్ర ప్రజల జీవనాడి అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ను కూటమి ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు.


