అభివృద్ధిని అడ్డుకుంటున్నారు

High Court bench comments on PILs hearing on construction of medical colleges - Sakshi

ప్రజాహిత వ్యాజ్యాల పేరుతో పనులకు అడ్డంకులు

పరిశ్రమలు, కాలేజీల నిర్మాణం వంటివి ఇలానే ఆగిపోతున్నాయి

మెడికల్‌ కాలేజీల నిర్మాణంపై పిల్స్‌ విచారణలో హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు

పిటిషనర్లు వాయిదా కోరడంపై అదనపు ఏజీ అభ్యంతరం

ఇరుపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం

విచారణ నవంబర్‌ 22కి వాయిదా

సాక్షి, అమరావతి: ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్స్‌) దాఖలు చేయడం వల్ల రాష్ట్రంలో పనులేవీ జరగడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజాప్రయోజన వ్యాజ్యాల పేరుతో అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారంది. పరిశ్రమలు, కాలేజీల నిర్మాణం వంటివి ఇలానే ఆగిపోతున్నాయని పేర్కొంది. వైద్య కళాశాలల ఏర్పాటుపై దాఖలైన వ్యాజ్యాల్లో తదుపరి విచారణను నవంబర్‌ 22కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ ఆకుల వెంకటశేషసాయిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.

కర్నూలు జిల్లా నంద్యాల, విశాఖపట్నం జిల్లా అనకాపల్లిల్లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రానికి చెందిన భూమిని వైద్య కళాశాలల నిర్మాణం కోసం ప్రభుత్వం తీసుకోవడాన్ని సవాలు చేస్తూ బొజ్జా దశరాథరామిరెడ్డి, మరికొందరు హైకోర్టులో గత ఏడాది ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. పిల్‌ దాఖలు చేసిన ఆది రామకృష్ణుడు పార్టీ ఇన్‌పర్సన్‌గా వాదనలు వినిపిస్తూ.. ఈ వ్యవహారంపై అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు.

స్టే ఉత్తర్వుల వల్ల వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఎలాంటి పనులు జరగడం లేదని తెలిపారు. మరో పిటిషనర్‌ న్యాయవాది బొజ్జా అర్జునరెడ్డి.. ఈ వ్యాజ్యంలో విచారణను వాయిదా వేయాలని కోరారు. ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాయిదాను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికే పిటిషనర్‌ పలు వాయిదాలు తీసుకున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. వారికి అనుకూలంగా స్టే ఇవ్వడంతో ఇలా పదేపదే వాయిదాలు కోరుతున్నారని తెలిపారు. వాయిదాల వల్ల మెడికల్‌ కాలేజీల నిర్మాణం ముందుకెళ్లడం లేదని చెప్పారు.

ప్రభుత్వం సైతం ప్రజల కోసమే మెడికల్‌ కాలేజీలు కడుతోందన్నారు. ఈ సమయంలో అటు అదనపు ఏజీ సుధాకర్, ఇటు పిటిషనర్‌ న్యాయవాది అర్జున్‌రెడ్డిల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ఈ వాదనలతో తమకు దీపావళి వేడుకలను ముందుగానే జరుపుకొన్నట్లు ఉందని నవ్వుతూ వ్యాఖ్యానించింది. దీపావళి తరువాత కూడా కాల్చుకోవడానికి టపాసులను (వాదనలు) దాచుకోవాలని ఇరుపక్షాలకు సూచించింది. దీంతో కోర్టులో ఉన్న న్యాయవాదులతోసహా అందరూ నవ్వుకున్నారు. ఇలాంటి వ్యాజ్యాల వల్ల రాష్ట్రంలో పనులేవీ జరగడం లేదంటూ వ్యాఖ్యానించిన ధర్మాసనం.. తదుపరి విచారణను నవంబర్‌ 22కి వాయిదా వేసింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top