
ఉపరితల ఆవర్తనమే కారణం
తాజాగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
దీనిప్రభావం వల్ల 24 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
మహారాణిపేట (విశాఖ)/సాక్షి నెట్‌వర్క్: ఉపరితల ఆవర్తనం వల్ల రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. తాజాగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడ ద్రోణి వల్ల రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ఉపరితల ఆవర్తనం వల్ల ఇప్పటికే నైరుతి రుతుపవనాల కదలిక జోరుగా ఉంది.
రానున్న మూడు రోజుల్లో కేరళలో రుతుపవనాలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్నిప్రాంతాల్లో గంటకు 40 –50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వివరించింది.
ఉమ్మడి కృష్ణాజిల్లాను 2 రోజులుగా వర్షాలు వీడటం లేదు
మచిలీపట్నంతోపాటు కృష్ణాజిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం వర్షం కురిసింది. ఉదయం 8.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7.2 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. తాజాగా రాత్రి 8 గంటల సమయంలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో జోరు వాన కురిసింది. రహదారులన్నీ జలమయమయ్యాయి.
» గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు గుంటూరు నగరంతోపాటు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గుంటూరులో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మే నెల 21 వరకు జిల్లా సాధారణ వర్షపాతం 42.8 మిల్లీ మీటర్లు కాగా, ఇప్పటి వరకు 106.2 మి.మీ వర్షపాతం నమోదైంది.
» ప్రకాశం జిల్లాలో బుధవారం ఓ మోస్తరు వర్షం కురిసింది. గిద్దలూరు, మార్కాపురం, వైపాలెం, కనిగిరి నియోజకవర్గాల్లో ఉరుము లు, మెరుపులతో కూడిన జల్లులు పడ్డాయి. అత్యధికంగా దోర్నాల మండలంలో 10.2 మి.మీ వర్షపాతం నమోదైంది. తీగలేరు పొంగిపొర్లడంతో మార్కాపురం–దోర్నాల మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
» శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంతోపాటు పలు మండలాల్లో బుధవారం జోరు వాన కురిసింది. నెల్లూరులోని పలు ప్రాంతాలు నీటమునిగాయి.