టెన్త్, ఇంటర్‌లో భారీగా ‘రీ అడ్మిషన్లు’  | heavily Readmissions in ssc and Intermediate: Andhra pradesh | Sakshi
Sakshi News home page

టెన్త్, ఇంటర్‌లో భారీగా ‘రీ అడ్మిషన్లు’ 

Jan 2 2024 4:17 AM | Updated on Jan 2 2024 9:50 AM

heavily Readmissions in ssc and Intermediate: Andhra pradesh - Sakshi

సాక్షి, అమరావతి: గత విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ ఫెయిలైన విద్యార్థులకు ప్రభుత్వం కల్పించిన ‘రీ అడ్మిషన్‌’ అవకాశాన్ని భారీ సంఖ్యలో వినియోగించుకున్నారు. సుమారు 1,93,251 మంది తిరిగి ఆయా తరగతుల్లో ప్రవేశాలు పొందారు. వీరికి ఈ విద్యా సంవత్సరంలో చేరిన రెగ్యులర్‌ విద్యార్థులతో సమానంగా అన్ని అవకాశాలు కల్పించనున్నారు.

రాష్ట్రంలో నూరు శాతం గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో (జీఈఆర్‌) సాధనలో భాగంగా 10వ తరగతి, ఇంటర్‌ తప్పినవారికి రాష్ట్ర ప్రభుత్వం పునర్‌ ప్రవేశ అవకాశం కల్పించింది. గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా సర్వే చేసి, ఆయా విద్యార్థులను తిరిగి ఎన్‌రోల్‌ చేశారు.

దాంతో 2022–­23 విద్యా సంవత్సరంలో పదో తరగతి తప్పిన 1,23,680 మందిలో 1,03,000 మంది, ఇంటర్‌లో 90,251 మంది ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. సాధారణంగా పరీక్ష తప్పినవారు తిరిగి ఫీజు కట్టి పరీక్షలు రాస్తే (సప్లిమెంటరీ) వారిని ‘ప్రైవేటు’ విద్యార్థులుగా పరిగిణిస్తారు. కానీ.. రీ అడ్మిషన్‌ తీసు­న్న వారిని ‘రెగ్యులర్‌’ విద్యార్థులుగానే పరిగణిస్తారు.   

ఎక్కువ మార్కులే పరిగణనలోకి.. 
ఆయా తరగతుల్లో రీ అడ్మిషన్లు పొందిన విద్యార్థులు ఫెయిలైన సబ్జెక్టులు మాత్రమే కాకుండా రెగ్యులర్‌ విద్యార్థులతో సమానంగా పబ్లిక్‌ పరీక్షల్లో అన్ని పేపర్లు రాయాల్సి ఉంటుంది. అయితే, విద్యార్థులు గత విద్యా సంవత్సరంలో సాధించిన మార్కులు, ప్రస్తుత విద్యా సంవత్సరంలో మార్కులను పరిశీలించి, ఆయా సబ్జెక్టుల్లో ఏ విద్యా సంవత్సరంలో ఎక్కువ మార్కులు వస్తే వాటినే అంతిమంగా లెక్కలోనికి తీసుకుంటారు.

ఉదాహరణకు ఓ విద్యార్థి 2022–23 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫెయిలై, ఇప్పుడు రీ అడ్మిషన్‌ తీసుకుంటే.. గతేడాది మ్యాథ్స్‌ పేపర్‌లో 70 మార్కులు వచ్చాయనుకుంటే.. ఈ ఏడాది పరీక్షల్లో అదే పేపర్‌ 30 మార్కులే వస్తే.. గత ఏడాది వచ్చిన 70 మార్కులనే పరిగణనలోకి తీసుకుంటారు. అలా­గే.. అన్ని సబ్జెక్టులు పాసైన రీ అడ్మిషన్‌ విద్యార్థుల 

సర్టీఫికెట్లపై ప్రైవేట్‌/కంపార్ట్‌మెంటల్‌/స్టార్‌ గుర్తు వంటివి లేకుండా ‘రెగ్యులర్‌’ అని గుర్తింపు ఇస్తా­రు. వీరికి కూడా ప్రభుత్వం నుంచి వచ్చే జగనన్న విద్యా­కానుక, అమ్మ ఒడి వంటి అన్ని పథకాలు వర్తింపజేశారు.  

ఒక్కసారే అవకాశం 
ఓ విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ ఫెయిలైన వారికి మరుసటి సంవత్సరం మాత్రమే రీ అడ్మిషన్‌తో పాటు అన్ని రెగ్యులర్‌ ప్రభుత్వ పథకాలు పొందే అవకాశం కల్పిస్తారు. ఈ విద్యార్థులు రెండో ఏడాదీ ఫెయిలైతే వారికి మరో అవకాశం ఉండదు. వారు ప్రైవేటుగానే పరీక్షలు రాయాల్సి ఉంటుంది.

2022–23లో ఇంటర్మీడియెట్, పదో తరగతి ఫెయిలై తిరిగి రెగ్యులర్‌ గుర్తింపు పొందిన 1,93,251 మంది విద్యార్థులు 2023–24 విద్యా సంవత్సరానికి గాను వచ్చే మార్చిలో పరీక్షలు రాయనున్నారు. వీరు ఈ విద్యా సంత్సరంలో అన్ని సబ్జె­క్టులు పాసైతే ‘రెగ్యులర్‌’ సర్టీఫికెట్‌ అందుకుంటారు. ఫెయిలైతే తిరిగి సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement