
యుక్త వయస్సులోనే గుండెపోట్లు
ఆకస్మికంగా మృతి చెందుతున్న యువత
25 నుంచి 40 ఏళ్లలోపు వారిలో అధిక గుండె సమస్యలు
జీవనశైలి మార్పులే కారణం
కర్నూలు నగరంలోని ఆదిత్యనగర్‌కు చెందిన ప్రేమ్‌కుమార్ అనే పాతికేళ్ల యువకునికి గత నెలలో గుండెపోటు వచ్చింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశాడు. చేతికి వచ్చిన కుమారుడు అకస్మాత్తుగా మృతి చెందడంతో కుటుంబసభ్యుల ఆవేదన అంతా ఇంతా కాదు.
కల్లూరుకు చెందిన శివకుమార్ అనే 30 ఏళ్ల యువకునికి ఏడాది క్రితమే వివాహమైంది. ఈ నెల మొదటి వారంలో అతనికి అకస్మాత్తుగా వచ్చిన గుండెపోటు ప్రాణం తీసింది. దీంతో ఆయన భార్యతో పాటు తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
పత్తికొండ మండలం దూదెకొండ గ్రామంలో ఈ నెల 5న పీర్ల ఊరేగింపులో నాట్యం చేస్తుండగా గ్రామానికి చెందిన రామాంజనేయులు(42) గుండెపోటుకు గురయ్యాడు. ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో అతని కుటుంబసభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
కర్నూలు(హాస్పిటల్): గుండెపోటు అంటే ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వారికి మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు పాతికేళ్ల వయస్సు వారికీ వస్తోంది. ఇటీవల కాలంలో పట్టణాలు, నగరాలు, గ్రామాల్లో యువత గుండెపోటుతో మృతి చెందుతున్నారు. జీవనశైలిలో మార్పులు, వ్యాయామం లేకపోవడం, మితిమీరిన ఆహారపు అలవాట్లు, దురవాట్లే ఈ పరిస్థితికి కారణమని వైద్యులు చెబుతున్నారు.
బాధితుల్లో 5 శాతం యువత
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని క్యాజువాలిటీకి ఇటీవల గుండెపోటుతో చికిత్సకు వచ్చేవారి సంఖ్య ఎక్కువైంది. ఇందులో కొందరు ఆసుపత్రికి వచ్చేలోపు, మరికొందరు చికిత్స పొందుతూ మృతి చెందుతున్నారు. ఇంకొందరు కార్డియాలజీ విభాగానికి ఆపరేషన్‌కు వెళ్తున్నారు. ఇలా కార్డియాలజీ విభాగానికి గత సంవత్సరం రోజుల్లో ఓపీకి 22,325 మంది గుండెజబ్బులతో చికిత్సకు రాగా 4,281 మంది విభాగంలో చేరారు. వీరిలో 1,235 మందికి యాంజియోగ్రామ్, 433 మందికి యాంజియోప్లాస్టీ(స్టెంట్) వేశారు.
ఇందులో 125 మంది 25 నుంచి 40 ఏళ్ల వయస్సు వారే ఉండటం గమనార్హం. ఇదే పరిస్థితి నగరంలోని పలు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో నెలకొంది. ఆయా ఆసుపత్రులకు ఒక్కో దానికి ప్రతిరోజూ రోజుకు సగటున 10 మంది గుండెజబ్బులతో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో 10 శాతం మంది ప్రజలు గుండెజబ్బులతో బాధపడుతున్నట్లు గతంలో నిర్వహించిన ఓ సర్వేలో నిర్ధారణ అయ్యింది.
ఆసుపత్రులకు చికిత్స కోసం వస్తున్న వారిలో 5 శాతం మంది యువతే ఉంటున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు వంశపారంపర్యం, జన్యులోపాలు, మేనరికపు వివాహం వంటి కారణాలతో పుట్టుకతోనే గుండెజబ్బులతో జన్మించే పిల్లలూ ఇటీవల అధికమయ్యారు.
మారిన ఆహారపు అలవాట్లు
ప్రతి ఒక్కరికీ పోషకాహారం తీసుకుని మరింత ఆరోగ్యంగా ఉండాలన్న ఉత్సుకత అధికమైంది. ఈ క్రమంలో తీసుకోవాల్సిన దానికన్నా అధికంగా ఆహారాన్ని తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఆహారంలో మాంసాహార సేవనం అధికమైంది. డ్రైఫ్రూట్స్ వాడకం పెంచేశారు. అందుకుతగ్గ వ్యాయామం చేయడం లేదు. దీంతో శరీరంలో కొవ్వు శాతం పెరిగిపోతోంది. రక్తనాళాల్లో ఎక్కడికక్కడ బ్లాక్‌లు ఏర్పడుతున్నాయి.
ఈ క్రమంలోనే ఉన్న ఫలంగా గుండెపోటు, పక్షవాతం కేసులు అధికమవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. దీనికితోడు కార్పొరేట్ సంస్కృతితో ఇతర దేశాలు, రాష్ట్రాల్లో లభించే ఆహారాన్ని సైతం ఇక్కడి వారు ఎక్కువ తీసుకుంటున్నారు. సాధారణంగా ఏ ప్రాంతం వాతావరణానికి తగ్గట్లు అక్కడి ప్రజలు ఆహారం తీసుకుంటారు. ఉత్తరాదిలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి.. అక్కడి వారు శరీరంలో ఉష్ణోగ్రతను పెంచే ఆహారాన్ని ఎక్కువ తీసుకుంటారు.
దక్షిణాదిలో వాతావరణం వేడిగా ఉంటుంది పెద్దలు చెప్పిన ఆహార నియమాలను పాటించాలి. అయితే ప్రాంతీయ భేదం లేకుండా అన్ని ఆహార పదార్థాలను ప్రజలు రుచి చూస్తున్నారు. దీనివల్లే జీవన విధానంలో మార్పులు వచ్చి ఆరోగ్యం దెబ్బతింటోందని వైద్యులు చెబుతున్నారు. అలాగే పాటు ఒకేచోట ఎక్కువసేపు కూర్చుని పనిచేసే ఉద్యోగాలు కావడంతో అధికబరువున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ కారణంగా శరీరంలో కొవ్వు శాతం పెరిగి అనేక అనారోగ్య సమస్యలు పలకరిస్తున్నాయి.
నిద్రలేమి, మానసిక ఒత్తిడి కారణం
ఇటీవల కాలంలో చాలా మంది యువకుల్లోనూ గుండెపోటు వస్తోంది. ఆసుపత్రికి వచ్చే వారిలో 30 శాతానికి పైగా వీరుంటున్నారు. శారీరక వ్యాయామం లేకపోవడం, మితిమీరిన మానసిక ఒత్తిడి, అనియత జీవనశైలి, నిద్రలేమి, పొగతాగడం, మద్యంసేవనం అలవాట్లు చిన్న వయస్సులో గుండెపోటు రావడానికి కారణం. కొందరు యువత శారీరక దారుఢ్యం కోసం అధికంగా వర్కవుట్స్ చేయడం కూడా గుండెపై ఒత్తిడి పెంచుతోంది. –డాక్టర్ బి.కిరణ్‌కుమార్‌రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, కార్డియాలజీ విభాగం, జీజీహెచ్, కర్నూలు