ఆర్మీలో చేరకున్నా అతని చుట్టూ యుద్ధ వాతావరణమే 

He Is Not An Army Man But War Atmosphere Around Him - Sakshi

పాత సామాన్లు.. చెక్కతో చక్కగా యుద్ధ పరికరాలు తయారు చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు ఆ యువకుడు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలం కొమరగిరి శివారు వెంకటరాయపురానికి చెందిన పంపన వెంకటరమణ వడ్రంగి పని చేస్తుంటాడు. అతని కుమారుడు నాగేంద్ర ఇంటర్‌మీడియట్‌ వరకూ చదివాడు. బాల్యం నుంచి పోలీసులు.. సైనికులు అంటే అమితంగా ఇష్టం. యుద్ధ ఇతివృత్తాలున్న  సినిమాలనే చూసేవాడు. 


చెక్కతో తయారు చేసిన జేసీబీ  

సైనికుడు తరహాలో యూనిఫాంకుట్టించుకుని ధరించేవాడు.  సైన్యంలో చేరాలనే ప్రయత్నాలు ఫలించలేదు. అయినా అదే ధ్యాసతో తనలోని వృత్తిపరమైన నైపుణ్యానికి పదును పెడుతున్నాడు.  చెక్కతోపాటు ఇంట్లోని కొన్ని వ్యర్థ సామాన్లతో ఏకే–47ను తలపించే తుపాకీ తయారు చేశాడు. వాటిలో ఉపయోగించడానికి చెక్క బుల్లెట్లనూ తయారు చేశాడు. గన్‌లో బుల్లెట్‌ వేసి పేల్చగానే చెక్క బుల్లెట్‌ సుమారు 10 మీటర్ల దూరం దూసుకుపోతోంది. వడ్రంగి సామాన్లతో చెక్కలతో యుద్దటాంక్, బాంబర్‌లను తయారు చేశాడు. దీపావళి మందుగుండు సామగ్రితో బాంబర్ల మాదిరి సౌండ్‌తో పాటు దూసుకు పోతుండడం విశేషం.


ఇది ఉత్తుత్తి యుద్ద ట్యాంకే.. 

ఆర్మీకల నెరవేరకున్నా.. 
ఎలాగైనా సైన్యంలో చేరాలనే పట్టుదలతో గతంలో నాగేంద్ర కాకినాడలో నిర్వహించిన ఆర్మీ రిక్రూట్‌మెంటు ర్యాలీకి వెళ్లాడు. పరుగులో వెనుకబడటంతో ఆర్మీ చాన్సు పోయింది.. కొడుకు ఉత్సాహం చూసి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించారు. తమ వంతు సహకారం అందించారు. ప్రయత్నాలు ఫలించలేదు. అదే సమయంలో ఆర్ధిక పరిస్థితులూ అనుకూలించలేదు. దీంతో  మధ్య లోనే చదువు ఆపేసిన కుల వృత్తిలో సెటిలయ్యాడు. తండ్రికి చేదోడువాదోడయ్యాడు. అయినా అతనిలో సైనికోత్సాహం వీడలేదు. తీరిక దొరికనప్పుడల్లా యుద్ధ పరికరాలు తయారు చేస్తుంటాడు. ఎప్పటికైనా మరిన్ని యుద్ద పరికరాలు,  సామగ్రి, ఆయుధాలు, ట్యాంకులు తయారు చేసి ఆర్మీ పేరున ఎగ్జిబిషన్‌ పెట్టాలని నాగేంద్ర ఉత్సాహపడుతున్నాడు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top