బతుకు నేర్పిన.. బామ్మలు | Grandmothers who believed in hard work even in old age | Sakshi
Sakshi News home page

బతుకు నేర్పిన.. బామ్మలు

Jun 7 2026 5:11 AM | Updated on Jun 7 2026 5:11 AM

Grandmothers who believed in hard work even in old age

వయసు నిండుగా... ఆత్మాభిమానం మెండుగా..  

ముదిమి వయసులోనూ శ్రమనే నమ్ముకున్న బామ్మలు 

ఇవి ఒకరికి పెట్టే చేతులే కానీ సాయం కోసం చాచేవి కాదన్న సందేశం  

విజయనగరం గంటస్తంభం: నేటి సమాజంలో పాతికేళ్లు కూడా నిండని యువకులు తమ చిన్నచిన్న అవసరాల కోసం తల్లిదండ్రుల వైపు చూస్తున్నారు. చేతిలో పనిఉన్నా చేయకుండా కాలక్షేపం చేస్తున్నారు. ఇంకొందరు జీవిత పోరాటానికి దూరంగా ఉండి సులభమైన మార్గాల కోసం వెతుకుతున్నారు. ఆ కోవలో తప్పుదారి పడుతూ అప్పులపాలవుతున్నారు. మరికొందరు ఈజీ మనీకోసం తప్పుదారి పడుతున్నారు. బతుకులను దుర్భరం చేసుకుంటున్నారు. 

అలాంటి వారందరికీ వయసు పైబడినా ఆత్మగౌరవాన్ని ఏమాత్రం కోల్పోకుండా చెమటోడ్చి బతుకుతున్న ఈ బామ్మలే నిలువెత్తు స్ఫూర్తి. వయస్సు 70 నుంచి 80 ఏళ్ల మధ్య ఉన్నా, శరీరం ముడతల పడినా.. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా విజయనగరం పట్టణంలో చిరు వ్యాపారులు చేస్తూ తమ సంపాదన తమదే అని నిరూపిస్తున్నారు. ఒకరికి పెట్టేచేతులే కాని చాచే చేతులు కావని చెబుతున్నారు. ప్రతిరోజూ వచ్చిన కొద్ది సంపాదనే తమకు రూ.కోట్లతో సమానమని గర్వపడుతున్నారు.   

చేయి చాచడం కంటే పని చేయడం మేలు...  
ఒకప్పుడు కుటుంబ సభ్యులందరికీ వండి పెట్టిన చేతులు ఇవి. పిల్లలను పెంచి పెద్ద చేసి, బంధువులు, అతిథులకు ఆతిథ్యం ఇచ్చిన గౌరవం మాది. అలాంటి చేతులు ఇప్పుడు తమ అవసరాల కోసం ఎవరిముందూ చాచడానికి సిద్ధంగా లేవు. వయసు పెరిగిందనే కారణంతో ఇతరులపై ఆధారపడాలని భావించడం లేదు. తమకు చేతనైనంత వరకు నిజాయితీగా కష్టపడి సంపాదించి తినడమే గౌరవమని నమ్ముతున్నారు. సమాజం నుంచి జాలి కోరడం కాదు. తమ శ్రమకు తగిన గౌరవం కోరుతున్నారు. 

మా వయసు కాదు... మాధైర్యం చూడండి..  
వీరిలో ప్రతి ఒక్కరి జీవితం ఒక పాఠం. ప్రతి అడుగు ఒక సందేశం. ప్రతి చెమట చుక్క ఆత్మగౌరవానికి ప్రతీక. ఎండను లెక్కచేయకుండా రోడ్డుపక్కన కూర్చుని సరుకులు అమ్ముకుంటున్న వీరిని చూసి చాలామంది ఆశ్చర్యపోతుంటారు. ఈ వయసులో ఎందుకమ్మా ఈ కష్టం అని అడుగుతుంటారు. అప్పుడు వారి సమాధానం జీవితానికి అర్ధం చెప్పేలా ఉంటుంది. సోషల్‌ మీడియా, మొబైల్‌ ఫోన్లు, కాలక్షేపాలతో రోజులు గడిపే యువతకు ఈ బామ్మలు నిశ్శబ్ద సందేశం ఇస్తున్నారు. పని చిన్నది కాదు.. వయసు అడ్డంకి కాదు.. ఆత్మగౌరవమే అసలు సంపద అని చేతలతో చెబుతున్నారు. కష్టపడే మనిషికి వయసుతో సంబంధం లేదని, గౌరవంగా బతకాలనే సంకల్పం ఉంటే పరిస్థితులు కూడా ఓడిపోతాయని నిరూపిస్తున్నారు

సంకల్పానికి సలాం చేయాల్సిందే..   
ఎండలు మండుతున్నా, ఒంట్లో ఓపిక లేకపోయినా ఆత్మాభిమానాన్ని మాత్రం వదులుకోను. నా ముఖం మీద ముడతలు నా వయసునే చూసిస్తాయి కానీ  మనసులోని కష్టపడే తత్వాన్ని కాదు. ఎవరి ముందైనా తలవంచి నిలబడడం కంటే, ఇలా రోడ్డు పక్కన పండ్లు అమ్ముకుంటూ గౌరవంగా బతకడమే ఇష్టం. – జాగులు రాములమ్మ(73), గుణపూరుపేట 

ఈ చేతులు శ్రమిస్తాయే కానీ సాయం కోసం చాచవు 
ఈ చేతులు ఒకప్పుడు ఎందరికో అన్నం పెట్టాయి నాయనా... ఇప్పుడు నా ఒక్కదాని కడుపు నింపుకోలేనా.. చేతిలో కర్ర పట్టుకున్నా బతుకుపోరాటంలో వెనకడుగు వేయను. ఎవరి ముందైనా చేయిచాచి యాచించడం కంటే, ఈ మల్లెపూలు, తమలపాకులు అమ్ముకుంటూ వచ్చే పది రూపాయల సంపాదనతోనే నా ఆత్మగౌరవం నిలుస్తోంది.   – సోము ఆదిమ్మ(75), కోరాడ వీధి, విజయనగరం 

ముడతలు పడిన చర్మం..  మురిసిపోయే ఆత్మాభిమానం 
కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. అందుకే ఈ వయసులోనూ రోడ్డు పక్కన చిన్న దుకాణం పెట్టుకున్నా. నా పిల్లలను, కుటుంబాన్ని నేనే రెక్కల కష్టంతో పెంచి పెద్ద చేశా. ఈ చివరి రోజుల్లో ఎవరికీ భారం కాకూడదన్నదే నా కోరిక. నా కష్టార్జితంతో తినే బువ్వే నాకు కొండంత తృప్తిని ఇస్తుంది.  – గోక అప్పయ్యమ్మ(78), ఎల్బీకాలనీ, విజయనగరం  

Advertisement
 
Advertisement
Advertisement