ఖరీఫ్‌ దిగుబడులు...144 లక్షల టన్నులు 

Grain yields were 67 43 lakh tonnes in Andhra Pradesh - Sakshi

ధాన్యం దిగుబడులు 67.43 లక్షల టన్నులు

చెరకు 24.43 లక్షల టన్నులు,పామాయిల్‌ 22.87 లక్షల టన్నులు

పత్తి 12.85 లక్షల టన్నులు, మొక్కజొన్న 4.88 లక్షల టన్నులు

మొదటి ముందస్తు అంచనా నివేదిక విడుదల

సాక్షి, అమరావతి: ప్రతికూల పరిస్థితులు ఉన్నా ఖరీఫ్‌ సీజన్‌లో పంటలు సాగు చేసిన రైతులు దిగుబడులపై ఆశాజనకంగా ఉన్నారు. వ్యవసాయ శాఖ విడుదల చేసిన మొదటి ముందస్తు అంచనా నివేదిక ప్రకారం ఈసారి 144 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది రాష్ట్రంలో ఖరీఫ్‌ సాగు లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.

ఖరీఫ్‌ సీజన్‌లో సాధారణ విస్తీర్ణం 84.98 లక్షల ఎకరాలు కాగా, గత ఏడాది 89.68 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. దిగుబడులు 164 లక్షల టన్నులు వచ్చాయి. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో 74 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు సాగయ్యాయి. దిగుబడులు 144 లక్షల టన్నులు వస్తాయని అంచనా వేశారు. అయితే, రెండో ముందస్తు అంచనా నివేదికలో దిగుబడులు కొంతమేర పెరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. 

జూలైలో అధిక, సెప్టెంబర్‌లలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవగా, జూన్, ఆగస్టు నెలల్లో కనీస వర్షపాతం నమోదుకాక రైతులు ఇబ్బందిపడ్డారు. సగటున 593 మిల్లీ మీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా, 493.8 మిల్లీ మీటర్ల వర్షపాతం కురిసింది. ఈ ప్రభావం ఖరీఫ్‌ పంటల సాగుపై పడింది. ఫలితంగా సాగు విస్తీర్ణం తగ్గింది. అయితే, దిగుబడులు మాత్రం ఆశాజనకంగా ఉంటాయని రైతులు అంచనా వేస్తున్నారు. 

పంటల అంచనాలు ఇలా.. 
మొదటి ముందస్తు అంచనా దిగుబడుల నివేదిక ప్రకారం ఈ ఏడాది ఆహార పంటలు 47లక్షల ఎకరాల్లో సాగు చేయగా, 73.89లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని అంచనా వేశారు. ప్రధానంగా వరి గత ఏడాది 40 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, 74.81 లక్షల టన్నుల ధాన్యం దిగుబడులు వచ్చాయి. ఈ ఏడాది 36.55 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, 67.43 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని అంచనా వేశారు.

చెరకు 24.43లక్షల టన్నులు, పామాయిల్‌ 22.87లక్షల టన్నులు, మొక్కజొన్న 4.88లక్షల టన్నులు, వేరుశనగ 2.32లక్షల టన్నులు, అపరాలు 2.17లక్షల టన్నులు చొప్పున దిగుబడులు వస్తాయని అంచనా వేశారు. ప్రతికూల వాతావరణంలో సైతం మిరప రికార్డు స్థాయిలో 6 లక్షల ఎకరాలకు పైగా సాగవగా, 12 లక్షల టన్నులకు పైగా దిగుబడులు వస్తాయని అంచనా వేశారు. కాగా, పత్తి 12.85లక్షల టన్నులు దిగుబడి వస్తుందని అంచనా వేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top