
డిగ్రీ విద్యా విధానంపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి
సింగిల్ మేజర్‌లో మార్పులను సైతం వ్యతిరేకిస్తున్న ప్రైవేటు యాజమాన్యాలు
21న బంద్‌కు పిలుపుతో.. కంగుతిన్న ప్రభుత్వం
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలతో జూమ్ మీటింగ్‌లో చర్చలు
ప్రభుత్వంతో చర్చించి డిగ్రీలో మేజర్ల విధానాన్ని మారుస్తామని హామీ
తాత్కాలికంగా కళాశాలల బంద్ వాయిదా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని సంప్రదాయ డిగ్రీ ప్రవేశాల పరిస్థితి డోలాయమానంలో ఉంది. ఇంటర్ ఫలితాలు వచ్చి వంద రోజులు దాటినా డిగ్రీ ప్రవేశాల్లో జాప్యం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా డిగ్రీ విద్యా విధానంలోని మార్పులను ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం ప్రైవేటు యాజమాన్యాలు కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో కంగుతున్న ప్రభుత్వం పరువు పోకుండా ఆదివారం ఉదయం తన పార్టీకి చెందిన ఐదుగురు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలతో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలతో జూమ్ మీటింగ్ పెట్టించి మరీ చర్చలు నిర్వహించింది.
ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ ప్రధానంగా సింగిల్ మేజర్ డిగ్రీ స్థానంలో డ్యుయల్ మేజర్ డిగ్రీని చేర్చాల్సిందేనని డిమాండ్ చేశాయి. దీనిపై ఎమ్మెల్సీలు విద్యాశాఖ మంత్రితో చర్చించి తగిన పరిష్కారం చూపిస్తామని హామీ ఇవ్వడంతో పాటు కళాశాలల బంద్‌ను వాయిదా వేసుకోవాలని కోరినట్టు సమాచారం. దీంతో ప్రైవేటు యాజమాన్యాలు తాత్కాలికంగా బంద్‌ను వాయిదా వేసుకున్నాయి. అయితే, ప్రభుత్వం తమ ప్రధాన డిమాండ్‌ను నెరవేర్చకుంటే తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని చెబుతున్నాయి.
మరోసారి మార్పులు తప్పవా?
గతంలోని సింగిల్ మేజర్ డిగ్రీ స్థానంలో కూటమి ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలని భావించింది. ఇందులో భాగంగా ప్రత్యేక కమిటీని నియమించి డ్యూయల్ మేజర్‌ను సిఫారసు చేసింది. దీని ప్రకారం ఉన్నత విద్యా మండలి కోర్సుల కన్వర్షన్‌కు నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. దీనిపై నెలల తరబడి ఏటూ తేల్చని ప్రభుత్వం.. మళ్లీ స్వల్ప మార్పులతో సింగిల్ మేజర్‌ను తీసుకొస్తూ మరోసారి కోర్సుల కన్వర్షన్‌కు నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల ఆగ్రహానికి ఇదే కారణమైంది.
ఈ క్రమంలోనే ప్రభుత్వం టీడీపీకి చెందిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలను రంగంలోకి దింపి వారిని బుజ్జగించే ప్రయత్నం చేసింది. ప్రభుత్వం ‘సింగిల్ మేజర్‌ను’ కొనసాగించేలా విధాన నిర్ణయాన్ని తీసుకుంది. అది కూడా కూటమి ప్రభుత్వంలో నియమించిన ఎక్స్‌పర్ట్స్ కమిటీ ఇచ్చిన డ్యూయల్ మేజర్ విధానాన్ని కాదని.. సింగిల్ మేజర్‌ను స్వల్ప మార్పులతో కొనసాగించేందుకు నిర్ణయించింది.
ఇలాంటి తరుణంలో ప్రైవేటు యాజమాన్యాల ఆందోళనలను చల్లార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. జూమ్ మీటింగ్‌లో ఎమ్మెల్సీలు ప్రైవేటు కళాశాలల అభీష్టం మేరకు ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. అంటే, సింగిల్ మేజర్‌లో మరోసారి మార్పులు తప్పవని సంకేతాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది.