AP: ‘కార్పొరేట్‌’కు కన్నుకుట్టేలా..

Good Treatment Available In Government Teaching Hospitals - Sakshi

టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే బోధనాస్పత్రుల్లో పెరిగిన ఓపీ, ఐపీ, సర్జరీలు

రాష్ట్రవ్యాప్తంగా 2018–19లో సుమారు 2.98 లక్షల సర్జరీలు..

అదే 2022 ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ మధ్య 3.61 లక్షల సర్జరీలు

రోజుకు 22 వేలకు పైగా ఓపీలు నమోదు

ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి 2017 నుంచి ఉన్నట్లుండి కండరాలు బిగుసుకుపోయే సమస్యతో బాధపడుతున్నాడు. ఒంగోలు, గుంటూరు, విజయవాడల్లోని కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్నా ఫలితం లేకపోవడంతో నాలుగేళ్లపాటు నరకయాతన అనుభవించాడు. వెళ్లిన ప్రతి ఆస్పత్రిలో సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ, ఎక్స్‌రే అంటూ శరీరంలోని ప్రతి అవయవాన్ని పరిశీలించారు.

ఒకరు వెన్నెముకలో సమస్య ఉందని, మరొకరు నాడీవ్యవస్థలో సమస్య ఉందని.. అనేక రకాల మందులు రాసిచ్చి ఫీజులు గుంజారే తప్ప ఎక్కడా నయంకాలేదు. చివరి ప్రయత్నంగా 2021లో బాధితుడిని కుటుంబసభ్యులు గుంటూరు జీజీహెచ్‌కి తీసుకెళ్లారు. వైద్యపరీక్షల అనంతరం అతడు ‘స్టిఫ్‌ పర్సన్‌ సిండ్రోమ్‌’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్‌ సుందరాచారి నిర్ధారించారు. మూడ్రోజుల చికిత్స తరువాత ఆ వ్యక్తి అందరిలాగే లేచి నడవడం ప్రారంభించాడు. 

కృష్ణాజిల్లా పెనమలూరుకు చెందిన 44 ఏళ్ల బసవయ్య ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి. గత నెల 20వ తేదీ ఉదయం విధినిర్వహణలో ఉండగా ఇతనికి ఎడమ చేయి, కాలు చచ్చుబడిపోయాయి. దీంతో తోటి ఉద్యోగులు హుటాహుటిన విజయవాడ జీజీహెచ్‌కు తరలించారు. బ్రెయిన్‌స్ట్రోక్‌గా వైద్యులు నిర్ధారించారు. గంటన్నరలోనే వైద్యులు థ్రోంబలైజ్‌ ఇంజక్షన్‌ ఇచ్చారు. ఐదున్నర గంటల్లో బసవయ్య లేచి ఎవరి సాయంలేకుండా నడవగలిగాడు. 

సాక్షి, అమరావతి: ప్రైవేట్‌ కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో వైద్యులకు అంతుపట్టని అరుదైన వ్యాధులకు ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో మంచి వైద్యం లభిస్తోంది. దీంతో పెద్దాస్పత్రులపై ప్రజల్లో నమ్మకం రోజురోజుకు పెరుగుతోంది. పెద్దాస్పత్రుల్లో సేవలు పొందుతున్న వారిసంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ వైద్య రంగంపై సీఎం జగన్‌ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారిస్తోంది. ఈ క్రమంలో విలేజ్‌ క్లినిక్‌ నుంచి బోధనాస్పత్రుల వరకూ అన్ని స్థాయిల్లో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు లభిస్తున్నాయి. 

గణనీయంగా పెరిగిన సర్జరీలు
టీడీపీ హయాంలో ప్రభుత్వాస్పత్రుల్లో ఎలుకలు కొరికి శిశువులు మృతిచెందడం, సెల్‌ఫోన్‌ టార్చ్‌లైట్‌ల వెలుతురులో ఆపరేషన్లు చేసిన ఘటనలు రాష్ట్ర ప్రజలు చూశారు. ఇప్పుడు అదే ఆస్పత్రుల్లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కన్నా మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు లభిస్తున్నాయి. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే బోధనాస్పత్రుల్లో గణనీయంగా సర్జరీల సంఖ్య పెరగడమే. 2018–19లో రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో 1.99 లక్షల మైనర్, 98 వేల మేజర్‌ సర్జరీలు నిర్వహించారు. అప్పట్లో ఏడాది కాలంలో జరిగిన సర్జరీల కంటే ఎక్కువ సర్జరీలను ప్రస్తుతం 9 నెలల్లోనే చేపట్టారు. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ నెలాఖరు నాటికి అన్ని బోధనాస్పత్రుల్లో 2,42,980 మైనర్, 1,18,482 మేజర్‌ సర్జరీలను చేశారు. ఈ లెక్కన పరిశీలిస్తే టీడీపీ హయాంలో రోజుకు సగటున 870 సర్జరీలు నిర్వహిస్తే, ప్రస్తుతం రోజుకు సగటున 1,338 సర్జరీలు చేపడుతున్నారు.

రోజుకు 22వేలకు పైగా ఓపీలు
ఇక ప్రస్తుతం బోధనాస్పత్రుల్లో రోజుకు 22 వేల మందికి పైగా అవుట్‌ పేషెంట్‌ (ఓపీ) సేవలు పొందుతున్నారు. అదే విధంగా 2,400 మంది వరకూ ఇన్‌ పేషెంట్‌ (ఐపీ) సేవలు అందుకుంటున్నారు. 2022 ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ మధ్య రాష్ట్రవ్యాప్తంగా బోధనాస్పత్రుల్లో 60.99 లక్షలకు పైగా ఓపీలు, 6.25 లక్షలకు పైగా ఐపీలు నమోదయ్యాయి. అత్యధికంగా కర్నూల్‌ జీజీహెచ్‌లో 6.06 లక్షల మంది ఓపీ సేవలు పొందారు. ఆ తర్వాత విశాఖ కేజీహెచ్‌లో 5.34 లక్షలు, కాకినాడ జీజీహెచ్‌లలో 5.31 లక్షల ఓపీలు నమోదయ్యాయి.

నాడు అవస్థలు.. నేడు అత్యున్నత ప్రమాణాలు
టీడీపీ పాలనలో ప్రభుత్వాస్పత్రులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. అప్పట్లో బోధనాస్ప­త్రుల్లో మందులు, వైద్యులు, వైద్య సిబ్బంది, ఇతర వసతుల కొరత తీవ్రంగా వేధించేది. కానీ, 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం వైఎస్‌ జగన్‌ ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ సారించారు. ఈ క్రమంలో మానవ వనరుల కొరతకు చెక్‌పెడుతూ వైద్యశాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 47 వేలకు పైగా పోస్టులు భర్తీచేపట్టారు. దీంతో 2019తో పోలిస్తే ప్రస్తుతం ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధన, ఇతర ఆస్పత్రుల్లో వైద్యల సంఖ్య పెరిగింది. ఇక టీడీపీ ప్రభుత్వంలో ఎసెన్షియల్‌ డ్రగ్స్‌కు కూడా కొరత ఉండేది.

కానీ, ప్రస్తుత ప్రభుత్వం మందుల కొరతకు తావులేకుండా, డబ్ల్యూహెచ్‌ఓ ప్రమా­ణాలు కలిగిన మందులను 608 రకాల వరకూ బోధనాస్పత్రుల్లో అందుబాటులో ఉంచుతోంది. ఇందులో 530కు పైగా రకాల మందులను సెంట్రల్‌ ప్రొక్యూర్‌మెంట్‌ రూపంలో సరఫరా చేస్తోంది. మిగిలిన మందులను ఆస్పత్రుల్లో అవసరా­లకు అనుగుణంగా స్థానికంగా కొనుగోలు చేస్తు­న్నారు. ఇందుకు కూడా ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పా­టుచేశారు. ఆరోగ్యశ్రీలోనూ టీడీపీ హయాంలో కేవలం 1,059 రకాల వ్యాధులకు చికిత్స అందిస్తే.. ఇప్పుడు ఏకంగా 3,255 రకాలకు చికిత్స అందిస్తున్నారు. అంతేకాక.. నాడు–నేడు కింద రూ.16వేల కోట్లకు పైగా నిధులతో ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు­తోపాటు, ప్రస్తుతం ఉన్న బోధనాస్ప­త్రులు, కళాశాలలను బలోపేతం చేస్తున్నారు. గడిచిన మూడున్నరేళ్లలో ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా ఇప్పటికే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 207 పీజీ సీట్లు పెరిగాయి. ఇవేకాక.. గత ఏడాది మరో 630 పీజీ సీట్ల పెంపునకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆమోదం తెలిపింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top