టాప్‌ 20లో రెండు జిల్లాలు.. ఎగుమతుల్లో మరో మెట్టు ఎక్కిన ఏపీ

Good Results On District Export Hubs In Andhra Pradesh - Sakshi

జిల్లా కేంద్రంగా ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్‌ ఎక్స్‌పోర్ట్‌ హబ్స్‌ సత్ఫలితాలిస్తున్నాయి. డైరక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా అత్యధికంగా ఎగుమతులు చేసిన టాప్‌–20లో విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలు చోటు దక్కించుకున్నాయి.

సాక్షి, అమరావతి: జిల్లా కేంద్రంగా ఎగుమతులను ప్రోత్సహించే విధంగా ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్‌ ఎక్స్‌పోర్ట్‌ హబ్స్‌ సత్ఫలితాలిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఎగుమతుల్లో భారీ వృద్ధి నమోదు చేయడం ద్వారా ఏడో స్థానం నుంచి నాలుగో స్థానానికి చేరుకుని రికార్డు సృష్టించిన ఆంధ్రప్రదేశ్‌ ఈ ఏడాది టాప్‌–20 జిల్లాల జాబితాలో రెండు స్థానాలను కైవసం చేసుకుంది. తాజాగా డైరక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరునెలల్లో (ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు) అత్యధికంగా ఎగుమతులు చేసిన 20 జిల్లాల జాబితాలో విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలు చోటు దక్కించుకున్నాయి.  

విశాఖ జిల్లా రూ.20,662.5 కోట్ల (275.50 కోట్ల డాలర్ల) విలువైన వాణిజ్య ఎగుమతులతో 14వ స్థానంలో నిలిచింది. తూర్పుగోదావరి జిల్లా రూ.18,204.15 కోట్ల (242.72 కోట్ల డాలర్ల) విలువైన ఎగుమతులతో 18వ స్థానంలో నిలిచింది. విశాఖ జిల్లా నుంచి జరిగిన ఎగుమతుల్లో ఇంజనీరింగ్‌ గూడ్స్‌ (92.06 కోట్ల డాలర్లు), రసాయనాలు (57.21 కోట్ల డాలర్లు), ఫార్మాస్యూటికల్స్‌ (18.81 కోట్ల డాలర్లు), ప్లాస్టిక్‌ అండ్‌ లినోలియం (16.41 కోట్ల డాలర్లు), మాంసం– పాలు– గుడ్లు (15.34 కోట్ల డాలర్లు) మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎగుమతి జరిగిన వాటిలో ఇంజనీరింగ్‌ గూడ్స్‌ (149.51 కోట్ల డాలర్లు), సముద్ర ఉత్పత్తులు (34.28 కోట్ల డాలర్లు), బియ్యం (30.57 కోట్ల డాలర్లు), ఎలక్ట్రానిక్‌ గూడ్స్‌ (4.01 కోట్ల డాలర్లు), మాంసం– పాలు– గుడ్లు (1.30 కోట్ల డాలర్లు) మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి.  

జిల్లాల వారీగా ఉత్పత్తుల గుర్తింపు 
గత సంవత్సరం రాష్ట్రం నుంచి రూ.1,22,640 కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయి. 2030 నాటికి రూ.2,46,010 కోట్ల విలువైన ఎగుమతులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఇందుకోసం ఇటీవల జరిగిన వాణిజ్య ఉత్సవ్‌ సందర్భంగా జిల్లాల వారీ కీలక ఉత్పత్తులను గుర్తించి వాటి ఎగుమతులను ప్రోత్సహించే విధంగా కార్యాచరణ ప్రణాళికను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేసిన సంగతి తెలిసిందే. జిల్లాను ఒక ఎక్స్‌పోర్ట్‌ హబ్‌గా చేసి అక్కడి నుంచే ఎగుమతులకు సంబంధించిన అన్ని సేవలందించే విధంగా ప్రతి జిల్లాలో ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ సెల్‌ ఏర్పాటు చేసినట్లు పరిశ్రమలశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ జి.ఎస్‌.రావు రావు తెలిపారు. ప్రతి జిల్లా నుంచి ఎగుమతి అవకాశాలున్న ఐదు, ఆరురకాల ఉత్పత్తులను ఎంపికచేసి వాటిని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఏపీ ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ద్వారా ఎగుమతులకు సంబంధించిన సమాచారంతో మ్యాగ్‌జైన్లు, కొనుగోళ్లు–అమ్మకందారులతో ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్న సమావేశాలు సత్ఫలితాలిస్తున్నాయని తెలిపారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top