సోమవారం జరిగిన హుండీ కానుకల లెక్కింపు
రోల్డ్ గోల్డ్ పేరుతో చెత్తలోకి అసలైన బంగారం
రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ట్రస్ట్ బోర్డు సభ్యులు
మెమోలతో సరి అంటున్న ఆలయ అధికారులు
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): అమ్మలగన్న అమ్మ.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ కానుకలకు రెక్కలొచ్చాయి. అమ్మవారికి భక్తులు ఎంతో భక్తితో సమర్పించే బంగారు కానుకలను తరలిస్తున్న ఘటన సోమవారం రాత్రి వెలుగు చూసింది. రోల్డ్ గోల్డ్ పేరిట రూ.1.25 లక్షల విలువైన బంగారు వస్తువుల్ని ఆలయ సిబ్బంది పక్కదారి పట్టిస్తూ ట్రస్ట్ బోర్డు సభ్యులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు.
ఈ వ్యవహారాన్ని ఆలయ అధికారులు గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించడం చర్చనీయాంశమైంది. ఘటనకు కారణమైన ఉద్యోగితోపాటు మరికొందరికి ఆలయ అధికారులు మెమోలు జారీ చేశారు. మంగళవారం దేవదాయ శాఖ గోల్డ్ వెరిఫికేషన్ అధికారి ఈ ఘటనపై విచారణ చేపట్టారు. మహా మండపం ఆరో అంతస్తులోని కానుకల లెక్కింపు ప్రాంతంతో పాటు సోమవారం నాటి సీసీ కెమెరా ఫుటేజీని సైతం పరిశీలించారు. దీనిపై దేవదాయ శాఖ కమిషనర్‌కు నివేదిక అందజేస్తామని ఆయన పేర్కొన్నారు.
20 రోజులకు ఒకసారి లెక్కింపు
శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో 20 రోజులకొకసారి కానుకల లెక్కింపు జరుగుతుంది. హుండీలలో నగదుతో పాటు భక్తులు బంగారు, వెండి వస్తువులను కానుకగా సమరి్పస్తుంటారు. వీటిలో గ్రాము బరువు గల మంగళ సూత్రాలు, నాణేలు హుండీలో వస్తుంటాయి. కానుకల లెక్కింపు సమయంలో ఆలయ సిబ్బంది వాటిని వేరుచేసి దేవస్థానం లాకర్‌లో భద్రపరుస్తుంటారు. కొందరు రోల్డ్‌గోల్డ్ ఆభరణాలను సైతం హుండీలో వేస్తుంటారు. ఆలయ సిబ్బంది, పోలీసులు, ఎస్‌పీఎఫ్ సిబ్బంది వాటిని గుర్తించి దగ్ధం చేస్తుంటారు.
గోల్డ్‌ను రోల్డ్‌గోల్డ్‌లో కలిపేసి
సోమవారం జరిగిన హుండీ లెక్కింపులో రోల్డ్‌గోల్డ్ వస్తువులతో పాటు బంగారు రేకుతో తయారు చేసిన మంగళసూత్రాలు, నాణేలను ఆలయ సిబ్బంది గుర్తించారు. అధికారులెవరికి అనుమానం రాకుండా బంగారు ఆభరణాలను రోల్డ్‌గోల్డ్ వస్తువుల్లో కలిపివేయడాన్ని ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుడు గుర్తించారు. కొన్ని దఫాలుగా కానుకల లెక్కింపులో సదరు ఉద్యోగి తీరుపై అనుమానంతో నిఘా పెట్టారు. సోమవారం రోల్డ్‌గోల్డ్ వస్తువులలో బంగారు ఆభరణాలు, వస్తువులను వేయడంతో పక్కా ఆధారాలతో ఆ ఉద్యోగిని పట్టుకున్నారు.
ఈ వ్యవహారం బయటకు రాకుండా కొందరు ఉద్యోగులు ప్రయత్నించినట్టు సమాచారం. మంగళవారం ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో ఆలయ వర్గాలు కలవరపడ్డాయి. కొన్ని నెలల క్రితం భక్తులు అమ్మవారికి సమర్పించిన ఆభరణాల్లో డైమండ్స్, విలువ కలిగిన రాళ్లను సైతం ఆలయ సిబ్బంది మాయం చేశారని జోరుగా ప్రచారం జరిగింది. బంగారాన్ని కరిగించే సమయంలో రాళ్లను పగులగొట్టి బంగారాన్ని వేరు చేశామని చెప్పడం గమనార్హం.
మట్టీ మాయమవుతోంది
ప్రతి 20 రోజులకు ఒకసారి జరిగే కానుకల లెక్కింపులో వచ్చిన రోల్డ్‌గోల్డ్ వస్తువులను మహా మండపం దిగువన ఆలయ సిబ్బంది, పోలీసు, సెక్యూరిటీ, ఎస్‌పీఎఫ్ సిబ్బంది సమక్షంలో పెట్రోల్ పోసి దగ్ధం చేస్తారు. అయితే.. రోల్డ్‌గోల్డ్ వస్తువులను దగ్ధం చేసిన మట్టిని గుర్తు తెలియని వ్యక్తులు తెల్లారేసరికి మాయం చేస్తున్నారు. ఈ మట్టి బంగారం శుద్ధిచేసే వారి వద్దకు చేరుతోంది. అంటే రోల్డ్‌గోల్డ్ ముసుగులో అసలైన బంగారు వస్తువుల్ని కూడా దగ్ధం చేసి.. మట్టిలో కరిగిపోయిన బంగారాన్ని మాయం చేస్తున్నట్టు తెలుస్తోంది.
అప్రైజర్‌పై చర్యలు
దుర్గగుడి గోల్డ్ అప్రైజర్ డి.షమ్మీపై చర్యలు తీసుకుంటూ ఆలయ ఈవో శీనానాయక్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. తాత్కాలికంగా తొలగించినట్లు పేర్కొన్నారు. విధుల్లో అలసత్వంగా కారణంగా దేవస్థాన ప్రతిష్టకు భంగం కలిగిందని భావించి చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ]
సీసీ కెమెరాలు, అధికారులు ఉన్నా..
దుర్గగుడిలో కానుకల లెక్కింపును 50కి పైగా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తుంటారు. లెక్కింపు జరుగుతున్నంత సేపు ఆలయ ముఖ్య అధికారులు, సిబ్బంది అక్కడే ఉన్నా చాకచక్యంగా బంగారు వస్తువులను రోల్డ్‌గోల్డ్ పేరిట బయటకు తరలించడం వెనుక ఆలయ అధికారుల పాత్ర, భద్రతా సిబ్బంది పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


