తగ్గుతున్న గోదా‘వడి’

Godavari Flood Flow Reduced At Dhavaleswaram Barrage - Sakshi

ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 20,79,187 క్యూసెక్కుల ప్రవాహం

18.70 అడుగులకు తగ్గిన నీటిమట్టం

కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక..

పోలవరానికి 17,76,590 క్యూసెక్కుల వరద నీరు

ఎగువన గోదావరిలో వరద తగ్గుముఖం

భద్రాచలం వద్ద 56.20 అడుగులకు తగ్గిన వరద మట్టం

నేడు 48 అడుగుల కంటే దిగువకు చేరుకునే అవకాశం

వరద బాధితులకు కొనసాగుతున్న సహాయక చర్యలు

వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో బాధితులకు నేవీ హెలికాప్టర్‌ ద్వారా ఆహార పొట్లాలు, వాటర్‌ ప్యాకెట్లు

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం/సాక్షి, ప్రతినిధి, ఏలూరు/ధవళేశ్వరం/చింతూరు: పరీవాహక ప్రాంతం(బేసిన్‌)లో వర్షాలు తెరిపి ఇవ్వడం, ఉపనదుల్లో వరద ప్రవాహం తగ్గుముఖం పడుతుండటంతో గోదా‘వడి’ కూడా క్రమేణ తగ్గుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి వచ్చే వరద సోమవారం రాత్రి 10 గంటలకు 20,79,187 క్యూసెక్కులకు తగ్గింది. నీటిమట్టం కూడా 18.70 అడుగులకు తగ్గింది. 17.75 అడుగుల కంటే దిగువకు నీటిమట్టం చేరుకోకపోవడంతో ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు కొనసాగిస్తున్నారు. గోదావరి డెల్టా కాలువలకు 5,900 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 20,73,287 క్యూసెక్కులను (179.17 టీఎంసీలను) సముద్రంలోకి వదిలేస్తున్నారు.

ఎగువన వరద తగ్గిన నేపథ్యంలో మంగళవారం నుంచి ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి వచ్చే వరద మరింత తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఎగువన గోదావరి, ఉపనదుల్లో వరద తగ్గింది. మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజ్‌లోకి వస్తున్న వరద 6.06 లక్షలకు తగ్గితే.. దాని దిగువనున్న తుపాకులగూడెం (సమ్మక్క) బ్యారేజ్‌లోకి చేరుతున్న వరద 10.95 లక్షల క్యూసెక్కులకు తగ్గింది.

ఆ బ్యారేజ్‌కు దిగువన ఉన్న సీతమ్మసాగర్‌లోకి వస్తున్న వరద 15.48 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. ఎగువ బ్యారేజ్‌లలోకి చేరుతున్న వరదను వచ్చింది వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద కూడా వరద ప్రవాహం తగ్గుతోంది. సోమవారం రాత్రి 9 గంటలకు భద్రాచలం వద్దకు 16.01 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండటంతో వరద మట్టం 56.20 అడుగులకు తగ్గింది. మంగళవారం సాయంత్రానికి భద్రాచలం వద్ద వరద మట్టం 48 అడుగులు లేదా అంతకంటే దిగువకు చేరుకునే వీలుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పోలవరంలోకి వచ్చే వరద సైతం క్రమేణా తగ్గుతోంది. సోమవారం రాత్రి 10 గంటలకు 17,76,590 క్యూసెక్కులు చేరుతుండటంతో ఎగువ కాఫర్‌ డ్యామ్‌ వద్ద నీటిమట్టం 35.44 మీటర్లు, దిగువ కాఫర్‌ డ్యామ్‌ వద్ద నీటిమట్టం 27.18 మీటర్లుగా నమోదైంది. పోలవరం వద్ద 24 గంటలు అప్రమత్తంగా ఉంటున్న అధికారులు వరదను సమర్థంగా నియంత్రిస్తూ దిగువకు విడుదల చేస్తున్నారు. 

కోనసీమ లంకలను వీడని ముంపు
వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. లంకల్లో ఇళ్లను చుట్టుముట్టిన నీరు నెమ్మదిగా దిగువకు లాగుతోంది. కాగా పి.గన్నవరం, ఐ.పోలవరం, ముమ్మిడివరం, అయినవిల్లి, సఖినేటిపల్లి, రాజోలు, మలికిపురం, కొత్తపేట, కె.గంగవరం, కపిలేశ్వరపురం, ఆత్రేయపురం మండలాల్లోని లంక గ్రామాల్లో ముంపు కొనసాగుతోంది. ముంపు బాధితులకు పునరావాస, సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ అల్లవరం మండలం రెబ్బనపల్లి, అమలాపురం రూరల్‌ బండార్లంక తదితర ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులకు పాలు, భోజనం ప్యాకెట్లు, నిత్యావసరాలు పంపిణీ చేశారు. బాధితులకు అందుతున్న సహాయాన్ని అడిగి తెలుసుకున్నారు.

గోదావరి, శబరి నదుల వరద నెమ్మదిగా తగ్గుముఖం పట్టినా అల్లూరి సీతారామరాజు జిల్లాలో వందలాది గ్రామాలు ముంపులోనే ఉన్నాయి. పోలవరం బ్యాక్‌ వాటర్‌ కారణంగా విలీన మండలాలైన కూనవరం, ఎటపాక, వీఆర్‌ పురం, చింతూరు మండలాల్లోని వందలాది గ్రామాల్లో ఇంకా వరద నీరు ఉంది. కొన్ని ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాల నుంచి తమ ఇళ్లకు చేరుకున్నారు. మరో రెండురోజుల్లో వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.

ఏలూరు జిల్లాలో పోలవరం ముంపు మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడుల్లో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ మండలాల్లోని ముంపు గ్రామాలకు సోమవారం నేవీ హెలికాప్టర్‌ ద్వారా నాలుగువేల ఆహార పొట్లాలు, వాటర్‌ ప్యాకెట్లు సరఫరా చేశారు. ముంపు మండలాల్లో ముఖ్యమంత్రి ఆదేశాలతో రేషన్‌ సహా నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో ముంపునకు గురయ్యే వీలున్న 15 ప్రాంతాల్లో కరకట్టలను పటిష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం, యలమంచిలి, ఆచంట మండలాల్లో 31 గ్రామాల్లో వరద ప్రభావం ఉంది.

గో‘దారి’ క్లియర్‌
సముద్రంలో సంభవించే ఆటు పోటులు వరదపై ప్రభావం చూపుతున్నాయి. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో 4 రోజులుగా సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. గోదావరి నుంచి కొత్త నీటిని రాకుండా అడ్డుకున్నట్టుగా మారటంతో వరద నీరు వెనక్కి పొంగి గ్రామాలను ముంచెత్తింది. ఆదివారం సాయంత్రం నుంచి ఈ పరిస్థితి మారింది. సముద్రం పోటు తగ్గి.. ఆటు వచ్చి వెనక్కి వెళ్లిపోడవంతో వరద నీరు సముద్రంలో ఆటంకం లేకుండా సునాయాసంగా కలుస్తోంది. ఇప్పటివరకు పోటెత్తిన వరద ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది.  
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top