
ఇల్లు రాసిచ్చాక కన్నవారిని పట్టించుకోని ఐదుగురు కుమార్తెలు
జమ్మలమడుగు ఆర్డీవోను ఆశ్రయించిన వృద్ధ దంపతులు
తిరిగి తల్లిదండ్రులకే వారి ఇల్లు దక్కేలా ఆర్డీవో ఉత్తర్వులు
జమ్మలమడుగు: తల్లిదండ్రులను బాగా చూసుకుంటామని నమ్మబలికి వారి ఆస్తిని రాయించుకున్న ఐదుగురు కుమార్తెలు ఆ తర్వాత పట్టించుకోవడం మానేశారు. దీంతో కుమార్తెలకు రాసిచ్చిన గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేసి తిరిగి తల్లిదండ్రులకే వారి ఆస్తి చెందే విధంగా గురువారం జమ్మలమడుగు ఆర్డీవో ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొద్దుటూరుకు చెందిన మాలేపాటి మోహన్‌రావు, గౌరమ్మ దంపతులకు ఐదుగురు కుమార్తెలు. సొంతంగా స్వీట్స్ వ్యాపారం చేసి కుమార్తెలకు అందరికీ పెళ్లిళ్లు చేశారు. వయోభారం, ఆరోగ్య సమస్యల కారణంగా వ్యాపారం నిలిపివేశారు.
జీవిత చరమాంకంలో తమను కుమార్తెలు చూసుకుంటారనే నమ్మకంతో ప్రొద్దుటూరులోని రంగయ్యగారి సత్రంవీధిలో ఉన్న ఇంటిని 2024 జూలై 23న పిల్లలకు గిఫ్ట్ డీడ్‌గా రాసిచ్చారు. అప్పటివరకు బాగా చూసుకున్న కుమార్తెలు ఇల్లు రాసిచ్చిన తర్వాత తల్లిదండ్రులను పట్టించుకోవడం మానేశారు. భోజనం, మందులు కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారు. సేవాసంస్థలు, ఇరుగుపొరుగువారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి కొద్దిరోజులు గడిపిన మోహన్‌రావు, గౌరమ్మ.. ఆ తర్వాత వృద్ధాశ్రమంలో చేరారు. అయినా పిల్లల తీరులో మార్పు రాకపోవడంతో జమ్మలమడుగు ఆర్డీవో సాయిశ్రీకి ఫిర్యాదు చేశారు.
మోహన్‌రావు, గౌరమ్మ దంపతుల ఐదుగురు కుమార్తెలు ఫిబ్రవరి 22న తన కార్యాలయంలో హాజరుకావాలని ఆర్డీవో నోటీసులు పంపారు. ఈ ఫిర్యాదుపై మార్చి 12, 29, ఏప్రిల్ 19వ తేదీల్లో విచారణ జరిపారు. మోహన్‌రావు, గౌరమ్మ దంపతుల కుమార్తెలు పూర్తిస్థాయిలో విచారణకు హాజరుకాకపోవడంతోపాటు తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతలను చూస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు సమర్పించలేదు. దీంతో కుమార్తెలకు ఇచ్చిన గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేసి, తిరిగి మోహన్‌రావు దంపతులకు వారి ఇల్లు దక్కే విధంగా గురువారం ఆర్డీవో ఉత్తర్వులు జారీ చేశారు. ఆ పత్రాలను మోహన్‌రావు దంపతులకు అందించారు.