ఆక్రమిత భూముల్లో గీతం వర్సిటీ నిర్మాణాలు: కేకే రాజు | Geetam University Constructions on Encroached Lands: K.K. Raju | Sakshi
Sakshi News home page

ఆక్రమిత భూముల్లో గీతం వర్సిటీ నిర్మాణాలు: కేకే రాజు

Mar 22 2026 5:30 PM | Updated on Mar 22 2026 6:02 PM

Geetam University Constructions on Encroached Lands: K.K. Raju

విశాఖ: ఆక్రమిత భూముల్లో గీతం యూనివర్సిటీ నిర్మాణాలు చేపడుతోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. 5 వేల కోట్ల రూపాయల భూములను కబ్జా చేయడమే కాకుండా నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. ఒక ప్రజా ప్రతినిధి అయి ఉండి ఎంపీ భరత్ భూకబ్జాకు పాల్పడ్డారని చెప్పారు.

‘కోర్టులో కేసులు ఉండగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. అక్రమ మార్గంలో యూనివర్సిటీ కోసం జీవీఎంసీ సమావేశంలో వాటిని క్రమబద్ధీకరించారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఏ ఎంపీ 5 వేల కోట్ల రూపాయల భూ కబ్జాకు పాల్పడలేదు. ప్రభుత్వ భూముల బోర్డులను తొలగించి అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. గీతం భూకబ్జాపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. 

మళ్లీ అధికారంలోకి రాబోమని తెలిసి భూ దోపిడీకి పాల్పడుతున్నారు. జీవీఎంసీ కమిషనర్ కు ఐఏఎస్‌కు ఉండాల్సిన లక్షణాలు ఒకటీ లేవు. గీతం భూకబ్జాపై ప్రైవేట్ కేసులు వేస్తున్నాము. ఈ కేసుల్లో కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్, ఆర్డీఓలను భాగస్వాములగా చేస్తున్నాము. ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులకు బానిసలు కాదు.

 ఊరు, పేరు లేని కంపెనీలకు 99 పైసలకే వేల కోట్ల రూపాయల భూములు కట్టబెడుతున్నారు. విశాఖ నగరంలో జరుగుతున్న భూ కేటాయింపులు ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద కుంభకోణం. కూటమి భూ రాబందుల నుంచి విశాఖ నగరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది’ అని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement