డీజీపీగా అత్యధిక కాలం పని చేసిన సవాంగ్‌

Gautam Sawang who has served as DGP for the longest time - Sakshi

రెండేళ్ల.. 8 నెలల.. 18 రోజులు

తద్వారా పోలీసు వ్యవస్థ పటిష్టం

టీడీపీ హయాంలో ఐదేళ్లలో నలుగురు డీజీపీలు

సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన అనంతరం అత్యధిక కాలం డీజీపీగా బాధ్యతలు నిర్వర్తించిన పోలీసు అధికారిగా గౌతం సవాంగ్‌ రికార్డు సృష్టించారు. ఆయన రెండు సంవత్సరాల ఎనిమిది నెలల 18 రోజులపాటు రాష్ట్ర పోలీస్‌ బాస్‌గా కీలకమైన స్థానంలో కొనసాగారు. డీజీపీలుగా విధులు నిర్వహించిన వారెవరూ ఇంత కాలం ఆ పోస్టులో కొనసాగలేదు. రాష్ట్ర విభజన తర్వాత నుంచి అంటే 2014 జూన్‌ 2 నుంచి 2022 ఫిబ్రవరి 18 వరకు ఏపీలో ఐదుగురు డీజీపీలుగా వ్యవహరించారు. ప్రస్తుతం నియమితులైన కేవీ రాజేంద్రనాథ్‌ రెడ్డి ఆరో డీజీపీ.   టీడీపీ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో అంటే 2014 జూన్‌ నుంచి 2019 మే 30 వరకు నలుగురు పోలీసు అధికారులు డీజీపీగా పని చేశారు. అంటే సగటున ఒక్కో డీజీపీ కేవలం 15 నెలల పాటు ఆ పదవిలో కొనసాగారు.

గత ప్రభుత్వంలో కుర్చీలాట!
టీడీపీ ప్రభుత్వ హయాంలో డీజీపీ పోస్టును ఓ కుర్చీలాటగా మార్చారని పరిశీలకులు విమర్శిస్తున్నారు. చీటికిమాటికి డీజీపీలను మార్చడం, లేదా తక్కువ సర్వీసు ఉన్న పోలీసు అధికారులను ఆ పోస్టులో నియమించడం టీడీపీ రాజకీయ వ్యూహమని చెబుతున్నారు. అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నియమించిన తొలి డీజీపీ గౌతం సవాంగ్‌ను రికార్డు స్థాయిలో అత్యధిక కాలం ఆ పోస్టులో కొనసాగేందుకు అవకాశం కల్పించింది. దాంతో పోలీసు అధికారుల నైతిక స్థైర్యం పెరగడంతోపాటు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పటిష్టమైందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. డీజీపీగా చేసిన అనంతరం కూడా గౌతం సవాంగ్‌ను రాజ్యాంగ బద్ధమైన ఏపీపీఎస్సీ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top