విశాఖ to బెంగళూరు వీక్లీ ఎక్స్‌ప్రెస్‌కు ఫుల్‌ డిమాండ్‌ | Sakshi
Sakshi News home page

విశాఖ to బెంగళూరు వీక్లీ ఎక్స్‌ప్రెస్‌కు ఫుల్‌ డిమాండ్‌

Published Thu, Sep 15 2022 7:53 PM

Full Demand For Visakhapatnam to Bangalore Weekly Express - Sakshi

తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): బెంగళూరు రైలు ప్రయాణం విశాఖ వాసులకు గగనంగా మారింది. ఫుల్‌ డిమాండ్‌ ఉన్న ప్రాంతాల్లో ఒకటి అయినా.. బెంగళూరుకు విశాఖ నుంచి నేరుగా ఒక్క రైలు కూడా లేదు. అన్నీ ఇతర ప్రాంతాల నుంచి విశాఖ మీదుగా వెళ్లేవే. వాటిలో విశాఖ కోటా చాలా తక్కువ. గతంలో విశాఖపట్నం నుంచి నడిచే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ను భువనేశ్వర్‌కు మళ్లించేశారు. అప్పటి నుంచి ప్రజాప్రతినిధులు, బెంగళూరుకు ప్రత్యేక రైలు కోసం ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకునేవారే లేకపోయారు.  

రిజర్వేషన్‌ కష్టమే.. 
విశాఖపట్నం మీదుగా బెంగళూరుకు ఎన్ని రైళ్లు రాకపోకలు సాగిస్తున్నా అన్ని ఫుల్‌గానే నడుస్తాయి. ప్రస్తుతం విశాఖపట్నం మీదుగా ప్రశాంతి, హౌరా –యశ్వంత్‌పూర్‌ వంటి రెగ్యులర్‌ రైళ్లతో పాటు, ముజఫర్‌పూర్‌–యశ్వంత్‌పూర్‌(మంగళ), గౌహతి–శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య టెర్మినస్‌ బెంగళూరు(ఎస్‌ఎంవీటీ) (సోమ, మంగళ, బుధ), హౌరా–ఎస్‌ఎంవీటీ (హమ్‌సఫర్‌)(మంగళ), హతియా–ఎస్‌ఎంవీటీ (సోమ, బుధ) భువనేశ్వర్‌–కృష్ణరాజపురం(హమ్‌సఫర్‌)(బుధ), డిబ్రూఘడ్‌–ఎస్‌ఎంవీటీ స్పెషల్‌ (గురు), భాగల్‌పూర్‌–ఎస్‌ఎంవీటీ (బుధ), టాటా–యశ్వంత్‌పూర్‌(శుక్ర), పూరీ–యశ్వంత్‌పూర్‌ (గరీబ్‌రధ్‌)(శుక్ర), హౌరా–మైసూరు(శని), టాటా–యశ్వంత్‌పూర్‌(శని). 

ప్రతీ ఆదివారాలలో హతియా–ఎస్‌ఎంవీటీ(ఆది), భువనేశ్వర్‌–బెంగళూరు కంటోన్మెంట్‌(ఆది), న్యూ టిన్‌సుకియా–బెంగళూరు(సోమ), అగర్తలా–ఎస్‌ఎంవీటీ(హమ్‌సఫర్‌) (సోమ) వంటీ వీక్లీ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. కానీ ఈ రైళ్లలో ఎప్పుడూ రిజర్వేషన్‌ దొరకదు. ఈ ఎక్స్‌ప్రెస్‌లలో రిజర్వేషన్‌ కావాలంటే కనీసం రెండు, మూడు నెలలు ముందుగా రిజర్వేషన్‌ చేయించుకోవాలి. నగరవాసులు ఎక్కువశాతం బెంగళూరు వంటి ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వీరు తరచూ నగరానికి రాకపోకలు సాగిస్తుంటారు. కానీ రైళ్లలో వీరికి రిజర్వేషన్‌ దొరకక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  

వీక్లీ ఎక్స్‌ప్రెస్‌.. మరో రెండు ఆదివారాలే.. 
ప్రస్తుత డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ అనూప్‌కుమార్‌ సత్పతి ప్రత్యేక కృషితో విశాఖపట్నం నుంచి బెంగళూరుకు డైరెక్ట్‌గా వీక్లీ స్పెషల్‌ రైలును తాత్కాలికంగా రెండు నెలలు నడిపేందుకు అనుమతి వచ్చింది. ఈ విషయం జూలై 22న ప్రకటించగా వెంటనే ఈ రైల్లోని సీట్లు అన్ని దాదాపుగా ఫుల్‌ అయిపోయాయి. ఆగస్ట్‌ 7వ తేదీ నుంచి ఇప్పటివరకు ఈ రైలు 6 ట్రిప్పులు నడవగా ప్రతీ సారి సీట్లు, బెర్తులు ఫుల్‌ అయ్యి, పూర్తి ఆక్యుపెన్సీతో ఈ రైలు నడిచింది. ఇంకా మిగిలి ఉన్న రెండు ట్రిప్పులలో అంటే సెప్టెంబరు 18, 25తేదీల్లోనూ స్లీపర్‌ వెయిటింగ్‌ లిస్ట్‌ 64, 08  ఉంది, ఇక ఏసీలో 25, 2 ఉంది. 

కోచ్‌లు పెంచినా తరగని జాబితా.. 
ఈ రైలు ఆక్యుపెన్సీ దృష్టిలో పెట్టుకుని ఆగస్ట్‌ 22వ తేదీ నుంచి ఒక స్లీపర్‌క్లాస్, ఒక థర్డ్‌ ఏసీ కోచ్‌లను అదనంగా జత చేశారు. అయినా  వెయిటింగ్‌ లిస్ట్‌ జాబితా తరగడం లేదు. గత ఆదివారం (సెప్టెంబరు 11వ తేదీన) రిజర్వేషన్లు దొరక్క స్లీపర్‌లో దాదాపు 43 మంది, ఏసీలో 15 మంది టికెట్లు రద్దు చేసుకున్నట్లు సమాచారం. అదనంగా పెంచిన కోచ్‌లతో ఈ రైల్లో మొత్తం స్లీపర్‌ క్లాస్‌ 720, థర్డ్‌ ఏసీ–370, సెకండ్‌ ఏసీ–46 బెర్తులు, సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయినా విశాఖపట్నం నుంచే ప్రతీసారి నూరు శాతం ఆక్యుపెన్సీతో బయల్దేరుతుంది.   

ఇంత డిమాండ్‌ ఉన్న ఈ మార్గంలో నడిచే ఈ వీక్లీ స్పెషల్‌ను డైలీ ఎక్స్‌ప్రెస్‌గా మార్చాలని నగరవాసులు కోరుతున్నారు. దీనిపై ఇటీవల విలేకరుల సమావేశంలో డీఆర్‌ఎం మాట్లాడుతూ డిమాండ్‌ ఉన్న రూట్లలో రైళ్లు నడిపేందుకు, అవసరమైనప్పుడు అదనపు కోచ్‌లను జత చేసేందుకు వాల్తేర్‌ డివిజన్‌ సిద్ధంగా ఉందని తెలిపారు. ఆయన కృషి ఫలించి, విశాఖ వాసుల ఆశ నెరవేరాలని ఆకాంక్షిద్దాం. (క్లిక్: నయా ‘ఆన్‌లైన్‌’ మోసం.. ఆర్డర్‌ ఇవ్వకపోయినా ఇంటికి కొరియర్‌)

Advertisement
 
Advertisement
 
Advertisement