వాట్సాప్‌ ‘పింక్‌ లుక్‌’ పేరుతో మాయాజాలం 

Fraud In The Name Of WhatsApp Pink Look - Sakshi

కొత్త రకం మోసాలపై తస్మాత్‌ జాగ్రత్త

మోసాలకు మార్గాలెన్నో...ఆ మార్గాల్లోకి తొంగిచూస్తే చిక్కుల్లో చిక్కుకోవడం ఖాయమంటున్నారు సైబర్‌ నేర నిరోధక అధికారులు. అప్రమత్తంగా లేకుంటే మనకు తెలియకుండానే సైబర్‌ కేటుగాళ్ల వలలో పడిపోతాం. సెల్‌ఫోన్‌ చేతిలో ఉందని, కొత్తగా వచ్చిన లింక్‌లు టచ్‌ చేస్తే ఇక టార్చర్‌ తప్పదు...అది ఎలా అంటే...

పార్వతీపురం టౌన్‌: సైబర్‌ కేటుగాళ్లు మరో కొత్త రకం మోసానికి తెరదీస్తున్నారు. వాట్సాప్‌ అప్‌డేట్స్, ఫ్రీ ఓటీటీ స్ట్రీమింగ్‌ల పేరుతో లింక్‌లు పంపిస్తున్నారు. ఆ లింక్‌ను క్లిక్‌ చేయగానే ఫోన్లోకి వైరస్‌ చొచ్చుకుని డేటాను చోరీ చేస్తుంది. ఈ డేటా సాయంతో సైబర్‌ కేటుగాళ్లు బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు. ‘మీ ఫోన్లో వాట్సాప్‌ను అప్‌డేట్‌ చేసేందుకు ఈ లింక్‌ను క్లిక్‌ చేయండి.. పింక్‌ లుక్‌తో కొత్త ఫీచర్లను ఆస్వాదించండి.. అమెజాన్‌ ప్రైమ్‌ అద్భుతమైన ఆఫర్‌..ఉచితంగా పొందాలంటే ఈ లింక్‌ను క్లిక్‌ చేయండి..‘సినిమాలు, సిరీస్‌లు, ఐపీఎల్‌ మ్యాచ్‌లు మీ మొబైల్‌లోనే హెచ్‌డీ నాణ్యతతో వీక్షించండి..ఉచితంగా ప్రత్యక్ష ప్రసారాల కోసం ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి.’ ప్రస్తుతం ఫోన్లు, వాట్సాప్‌ గ్రూపుల్లో ప్రత్యక్షమవుతున్న సంక్షిప్త సందేశాలివీ.

వీటితో పాటు వచ్చే లింక్‌ను పొరపాటున క్లిక్‌ చేస్తే చాలు ఫోన్‌లోకి వైరస్‌ ప్రవేశిస్తోంది. వెంటనే సదరు ఫోన్‌ సైబర్‌ నేరస్తుల స్వా«దీనంలోకి వెళ్లిపోతోంది. సైబర్‌ నేరస్తులు ఆయా సంస్థల పేర్లను వినియోగించుకొని లింకుల్ని పంపిస్తున్నారు. పొరపాటున దానిని క్లిక్‌ చేస్తే స్పామ్‌ రూపంలో వైరస్‌లు ఫోన్లోకి చొరబడుతున్నాయి. డేటా చోరీకి గురవుతోంది. ఫోన్లో రహస్య సమాచారమేదైనా ఉంటే వాటిని చూపించి బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులను డిమాండ్‌ చేస్తున్నారు. లింక్‌ల్ని తెరవగానే ‘ఆన్‌లైన్‌ స్ట్రీమ్‌’కు అనుమతి ఇవ్వాలని నేరగాళ్లు అడుగుతున్నారు. అనుమతి ఇస్తే దాని ఆధారంగా నేరస్తులు బల్‌్కగా లింక్‌ల్ని మనకు ప్రమేయం లేకుండానే మన ఫోన్లోని కాంటాక్టులకు పంపేస్తారు. వారు వాటిని తెరుస్తూ ఇబ్బందుల పాలవుతున్నారు.

అప్రమత్తంగా ఉండాలి 
సామాజిక మాధ్యమాల్లో సైబర్‌ నేరగాళ్లు కొత్త మోసాలకు తెరదీస్తున్నారు. దీనిపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. వాట్సాప్‌లలో వస్తున్న లింక్‌ల జోలికి వెళ్లి అనవసర ఇబ్బందులను కొనితెచ్చుకోవద్దు. లింక్‌లను టచ్‌ చేస్తే వ్యక్తిగత సమాచారమంతా హ్యాకర్ల జోలికి పోతుంది. అందుకే అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి ఆన్‌లైన్‌ నేరాలపై ప్రత్యేక నిఘా ఏర్పరిచాం. ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.           
– సుభాష్‌, డీఎస్పీ, పార్వతీపురం

చదవండి: కంటతడి పెట్టించిన హృదయ విదారక దృశ్యం.. 
జూదానికి డబ్బు ఇవ్వలేదని ఓ తండ్రి దారుణం.. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top