Sabbam Hari: లాన్‌ వెనక మాస్టర్‌ ప్లాన్‌?.. ఎవరీ అప్పారావు...? | Sakshi
Sakshi News home page

Sabbam Hari: లాన్‌ వెనక మాస్టర్‌ ప్లాన్‌?.. ఎవరీ అప్పారావు...?

Published Fri, Sep 30 2022 1:17 PM

Former MP Sabbam Hari GVMC Land kabza Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం: సబ్బు బిళ్ల.. కుక్క పిల్ల కాదేదీ కవితకనర్హం అన్నారు శ్రీశ్రీ. గెడ్డలు, పార్కు స్థలాలు.. కావేవీ ఇంటి నెంబర్లను కేటాయించేందుకు అనర్హం అన్నట్టు జీవీఎంసీ తయారైంది. పదేళ్లుగా మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి వెనక తూర్పున గల ఖాళీ స్థలంలో రెండు షెడ్లు ఉన్నట్టుగా పేర్కొని ఏకంగా ఇంటి నెంబర్లను కూడా జీవీఎంసీ కేటాయించింది. అప్పారావు పేరు మీద 355 గజాల స్థలానికి 50–1–40/18(3), 50–1–40/(4) ఇంటి నెంబర్లను ఇచ్చింది.

ఈ స్థలం విలువ మార్కెట్‌లో రూ.5 కోట్ల పైమాటే ఉంటుందని తెలుస్తోంది. ఇప్పుడు ఈ స్థలాన్ని విక్రయించేందుకు కొద్ది మంది రంగంలోకి దిగినట్టు సమాచారం. కేవలం ఇంటి నెంబర్లతో పాటు 1980 ప్రాంతంలో అగ్రిమెంటు చేసుకున్న కాగితాలతోనే ఈ స్థలాన్ని విక్రయించేందుకు పావులు కదులుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో అసలు ఖాళీ స్థలంలో షెడ్లు ఉన్నట్టుగా ఇంటి నెంబర్లు ఎలా ఇచ్చారు? ప్లాన్‌ అనుమతి తీసుకున్నారా? తీసుకుంటే అసలు ఇళ్లు ఎక్కడకు వెళ్లాయి? అనే వివరాల లోతుల్లోకి వెళితే అసలు వ్యవహారం బయటకు వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

సబ్బం హరి ఇంటి ప్లాన్‌లో కూడా అప్పారావుకు షెడ్డు ఉన్నట్లు చూపించారు.

ఎవరీ అప్పారావు...? 
వాస్తవానికి సీతమ్మధారలోని సబ్బం హరి ఇంటి వెనకాల తూర్పు వైపున లాన్‌ ఉంది. దీనికి ఆనుకుని జీవీఎంసీ పార్కు ఉంది. ఇన్ని రోజులుగా ఈ లాన్‌ మొత్తం సబ్బం హరి ఇంటి ఆవరణ భాగమని అందరూ అనుకున్నారు. ఈ స్థలం కాస్తా ఎం.అప్పారావు పేరు మీద ఉంది. తాజాగా సబ్బం హరి తీసుకున్న రుణంపై ఆయన ఆస్తులను అటాచ్‌ చేసుకుంటామంటూ న్యాయవాది ద్వారా వచ్చిన ప్రకటనలోనూ సబ్బం హరి ఇంటికి తూర్పు భాగంలో ఉన్న స్థలం అప్పారావుకు చెందిన షెడ్లుగా పేర్కొన్నారు. అయితే, ఇంతకీ ఎవరీ అప్పారావు అంటే సబ్బం హరికి శిష్యుడుగా ఉండేవారని తెలుస్తోంది.

తన స్థలాన్ని ఇన్ని రోజులుగా లాన్‌గా ఉపయోగించుకుంటున్నా అప్పారావు ఎందుకు మిన్నకుండిపోతున్నారు? అసలు షెడ్లు లేకపోయినప్పటికీ పదేళ్లకుపైగా ఎందుకు అప్పారావు ఇంటి పన్ను చెల్లిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలంటే మొదటగా జీవీఎంసీకి ప్లాన్‌ ఇచ్చి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జీవీఎంసీకి చెందిన పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బంది ఇవేవీ లేకుండానే అప్పట్లో ఇంటి నెంబర్లను ఇచ్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై జీవీఎంసీ అధికారులు విచారణ చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

రూ.5 కోట్ల స్థలంపై కన్ను...! 
ఇన్ని రోజులు ఇంటి లాన్‌గా ఉపయోగించుకుంటున్న స్థలం తమదేనని సబ్బం హరి కుటుంబీకులు భావిస్తున్నారు. సబ్బం హరి మరణం తర్వాత కూడా ఇదంతా తమ స్థలమేనని భ్రమలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, తాజాగా కోర్టు నుంచి అటాచ్‌మెంట్‌ వ్యవహారంలో తమ ఇంటి సరిహద్దుల్లో తూర్పువైపు అప్పారావు షెడ్లు ఉన్నట్టు చూపించారు. తీరా చూస్తే తూర్పు వైపునకు లాన్‌కు ఆనుకుని జీవీఎంసీ పార్కు మాత్రమే ఉంది. దీనితో అసలు వ్యవహారాన్ని కొద్ది మంది డాక్యుమెంట్లతో సహా వెలికితీసినట్టు ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో రూ.5 కోట్లకుపైగా విలువ చేసే ఈ 355 గజాల స్థలాన్ని తక్కువ ధరకు తమ చేతుల్లోకి తీసుకునేందుకు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో సబ్బం హరి కుటుంబీకుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద ఈ స్థలం వ్యవహారంపై మరింత లోతుల్లోకి వెళ్లి జీవీఎంసీ రికార్డులను పరిశీలిస్తే ఇన్ని రోజులుగా లాన్‌గా ఉపయోగించుకుంటూ అనుభవించిన సబ్బం హరి కుటుంబీకుల పాత్ర ఉందా? ఇంకా తెరవెనుక ఎవరైనా ఉన్నారా అనే విషయం తేలనుంది.  

 
Advertisement
 
Advertisement