ఎర్రకాళ్ల కొంగలు
అడుగంటుతున్న పులికాట్ సరస్సు
విదేశీ వలస విహంగాలకు ఆహారం కొరత
పులికాట్‌లో విదేశీ అతిథుల కిలకిల రావాలు మూగబోతున్నాయి. ఆహారం కొరతతో వలస పక్షుల జీవనం ప్రశ్నార్థకంగా మారుతోంది. జనవరికే పులికాట్ ఎడారిని తలపిస్తుండంతో ఆహారం దొర క్క విదేశీ విహంగాలు రోదిస్తున్నాయి. దీనికితోడు రోజురోజుకూ ఉష్ణోగ్రత పె రుగుతుండడంతోపాటు ఆహారం లేక మౌనంగా రోదిస్తున్నాయి. పక్షుల సందడి లేకపోవడంతో పర్యాటక ప్రియు లు, ప్రకృతి ప్రేమికులు ఇదేమిటయ్యా.. పాలకుల మాటలు పండుగలకేనా? విదేశీ అతిథులు రక్షణకు లేదా? అని ప్రశ్నిస్తున్నారు.
సూళ్లూరుపేట: పులికాట్ సరస్సు జనవరికే అడుగంటిపోతోంది. ఫలితంగా విదేశీ వలస విహంగాలకు ఆహారం కొరత ఏర్పడుతోంది. దీంతో విదేశీ పక్షుల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ ఏడా ది పుష్కలంగా వర్షాలు కురిసినప్పటికీ పులికాట్ సరస్సు అప్పుడే ఎడారిలా మారుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాన్‌ల ప్రభావంతో కురిసిన భారీవర్షాలతో సరస్సుకు నీరు చేరడంతో ఈ ఏడాది నవంబర్ నెలలోనే పలు రకాల విదేశీ వలస విహంగాలు విడిదికి విచ్చేశాయి. ముఖ్యంగా ఫ్లెమింగోలు (సముద్రపు రామచిలుకలు), పెలికాన్స్ (గూడ బాతులు) పెయింటెడ్ స్టార్క్స్(ఎర్రకాళ్లకొంగలు) లతోపాటు అనేక రకాల పక్షులు విచ్చేసి ఆహారవేటలో ఉండి పర్యాటకులకు కనువిందు చేశాయి.
ఇందులో ఫ్లెమింగోలు మాత్రం నీళ్లు అలా ఎండిపోగానే కనిపించకుండా దూరంగా వెళ్లిపోయాయి. పెలికాన్స్ నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంలో పిల్లలను పొదిగి పెద్దవి చేసుకునే పనిలో ఉన్నాయి. శ్రీహరికోట రోడ్డుకు ఉత్తరం వైపు సర స్సు ఎడారిగా మారడంతో నేలపట్టులోని పక్షులు సమీపంలోని చెరువుల్లో, పల్‌వేరికాడ్, ఎన్నూరు ప్రాంతాలకు వెళ్లి ఆహారవేట చేస్తున్నాయి. ఎర్రకాళ్లకొంగలు మాత్రం ఇప్పటికీ ఇక్కడే ఉన్నాయి. సరస్సు ఎండిపోతుండడంతో ఆహారం లేక పక్షులు అల్లాడిపోతున్నాయి.
సాధారణంగా విదేశీ వలస విహంగాలు పిల్లలను పొదిగి, వాటిని పెద్దవి చేసుకునే వెళ్లే సమయమిది. ఈ సమయంలో ఎండిపోయిన సరస్సులో నేలపై మోకాళ్లు మడిచి కూర్చుని తమ విలాపాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా అక్కడక్కడా దర్శనమిస్తున్నాయి. కొన్ని వలస విహంగాలు ఆహారం లేకపోవడంతో కాళ్లు మడతేసుకుని కూర్చుని కనిపించాయి. మరికొన్ని విహంగాలు అప్పుడే ఆహారం అయిపోయిందా! దిగులుతో ఉన్నట్టు కనిపిస్తున్నాయి. వీటి మూగరోదన చూసిన పర్యాటకులు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పక్షుల పండుగతోనే సరి..
ఆపై ఆమడదూరంలో పులికాట్ అభివృద్ధి రాష్ట్ర పర్యాటక శాఖ రూ.కోట్లు వెచ్చించి పక్షుల పేరుతో పండుగ చేస్తున్నారే తప్ప వలస వస్తున్న విహంగాలకు కడుపునిండా ఆహారం వనరు అయిన పులికాట్ సరస్సును మాత్రం అభివృద్ధి చేయడం లేదు. పక్షులు పండుగకు కేటాయిస్తున్న నిధుల్లో కొంత భాగం వెచ్చించి ముఖద్వారాలు పూడిక తీయిస్తే ఈ పరిస్థితి నుంచి బయటపడే అవకాశం ఉన్నప్పటికీ పాలకులు, అధికారులు ఆ దిశగా ఆలోచించడం లేదు. పండుగ జరిగిన ప్రతిసారీ అన్ని రూ.కోట్లు ఇన్ని రూ.కోట్లు కేటాయించాం. అని మాటలు చెబుతున్నారే తప్ప, వాస్తవంగా మాత్రం ఏమీ కనిపించడం లేదు.
ఈ ఏడాది పండుగ ముగింపు ఉత్సవానికి విచ్చేసిన పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ ప్రాంతంలోని పులికాట్ సరస్సును, నేలపట్టు పక్షుల కేంద్రాన్ని పర్యాటక హబ్‌గా ఏర్పాటు చేస్తానని చెప్పేసి వెళ్లారు. ఇక వచ్చే పండుగకు కూడా వచ్చి ఇదే హామీలే ఇచ్చేసి వెళతారు. ఈ సరస్సును నమ్ముకుని ఏటా శీతాకాలంలో ఇక్కడే తలదాచుకుని సంతానోత్పత్తిని చేసుకునే వెళ్లే పక్షుల ఆహారం కొరతను ఎవరు తీరుస్తారు. పండుగ మూడు రోజుల తరువాత సరస్సును పట్టించుకోకపోవడంతో జనవరి నెల ముగియకముందే ఎడారిలా మారి, పక్షులకు ఆహారం కొరత ఏర్పడింది. ఇప్పటికైనా స్పందించి ప్రత్యామ్నాయంగా సముద్ర ముఖద్వారాన్ని పూడిక తీయించాలని పర్యాటక ప్రియులు, ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు.


