‘ప్రకాశం’లో ఫ్లోటింగ్‌ ఫిషింగ్‌ హార్బర్‌

Floating Fishing Harbor in Prakasam District - Sakshi

తక్షణమే ప్రతిపాదనలు పంపాలని ఏపీ మారిటైమ్‌ బోర్డుకు ఆదేశాలు

బుడగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం, బియ్యపుతిప్పకు ఒకే ప్రాజెక్టుగా టెండర్లు

రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ 

ఇప్పటికే 8 ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణానికి నిర్ణయం

సాక్షి, అమరావతి:  ప్రకాశం జిల్లా ఓడరేవు వద్ద నీటిపై తేలియాడే జెట్టీ (ఫ్లోటింగ్‌ జెట్టీ) విధానంలో హార్బర్‌ను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. ఓడరేవు వద్ద ఫ్లోటింగ్‌ జెట్టీ నిర్మాణ వ్యయానికి ప్రతిపాదనలను తక్షణం పంపించాల్సిందిగా ఏపీ మారిటైమ్‌ బోర్డును ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే 8 ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. ఓడ రేపు వద్ద ఫ్లోటింగ్‌ జెట్టీ ఏర్పాటు ఈ 8 హార్బర్లకు అదనం. దీంతో రాష్ట్రంలో మొత్తం తొమ్మిది ఫిషింగ్‌ హార్బర్లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది.

ప్రతిపాదిత 8 హార్బర్లలో ఇప్పటికే సుమారు రూ.1,500 కోట్లతో జువ్వలదిన్నె (శ్రీ పొట్టి శ్రీరా ములు నెల్లూరు), ఉప్పాడ (తూర్పు గోదావరి), నిజాంపట్నం (గుంటూరు), మచిలీపట్నం (కృష్ణా) ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణ పనులు మొదలయ్యాయి. శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం, విశాఖ జిల్లా పూడిమడక, ప్రకాశం జిల్లా కొత్తపట్నం, పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపుతిప్పలో రూ.1,580.22 కోట్లతో నాలుగు ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణానికి తాజాగా పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  ఉత్తర్వులు జారీ చేశారు. 

త్వరలో న్యాయపరిశీలనకు టెండర్లు
తొలి దశలో మాదిరే నాలుగు ఫిషింగ్‌ హార్బర్లను ఒకే ప్రాజెక్టుగా పరిగణించి టెండర్లు పిలవడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. బుడగట్లపాలెం లో రూ.365.81 కోట్లతో, పూడిమడక రూ.392. 53 కోట్లు, కొత్తపట్నంలో రూ.392.45 కోట్లు, బియ్యపుతిప్ప రూ. 429.43 కోట్లతో హార్బర్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు జారీ చేసిం ది. ఇందులో బియ్యపుతిప్ప హార్బర్‌ మినహా మిగిలిన మూడింటి ప్రాజెక్టు ప్రణాళికలను సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కోస్టల్‌ ఇంజనీరింగ్‌ ఫర్‌ ఫిషరీస్‌ (సీఐసీఈఎఫ్‌) ఆమోదించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ మూడు ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణానికి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ఒకొక్క హార్బర్‌ నిర్మా ణానికి రూ.150 కోట్లు గ్రాంటు రూపంలో ఇవ్వ నుంది. మిగిలిన మొత్తంలో 90 శాతం ఎన్‌ఐడీఐ రుణంగా అందిస్తుంది. బియ్యపుతిప్ప హార్బర్‌ ప్రాజెక్టు ప్రణాళికకు సీఐసీఈఎఫ్‌ ఆమోదం తీసుకుని న్యాయ పరిశీలన అనంతరం టెండర్లు పిలవాల్సిందిగా ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ హర్బర్ల నిర్మాణంతో30,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. అలాగే 8.4 లక్షల మంది మత్స్యకార కుటుంబాలు లబ్ధి పొందుతాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top