
మండీ యజమాని దాష్టీకం
నాలుగు వాహనాలు దెబ్బతిన్న వైనం
జాక్‌పాట్ వద్దన్నందుకు దౌర్జన్యం
పోలీసులు, అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి అంటూ రైతుల ఆవేదన
అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో ఘటన
గుర్రంకొండ: కూటమి ప్రభుత్వంలో రైతులకు రక్షణ లేకుండా పోతోంది. మండీలకు టమాటాలను తీసుకొచ్చిన రైతుల వాహనాలను ఓ మండీ యజమాని ట్రాక్టర్‌తో తొక్కించిన ఘటన అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో జరిగింది. రెండు ద్విచక్రవాహనాలు, ఒకబొలెరో, ఒక ఆటో దెబ్బతిన్నాయి.
వాహనాల వద్ద రైతులు లేక పోవడంతో ప్రాణాపాయం తప్పింది. జాక్‌పాట్ వద్దన్నందుకే తమపై మండీ యజమానులు దౌర్జన్యాలకు దిగుతున్నారంటూ రైతులు పేర్కొన్నారు. ఈ ఘటనతో రైతులు మార్కెట్‌యార్డు గేట్లు మూసేసి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది.
మండీ యజమాని విపరీతం ఇదీ..
స్థానిక మార్కెట్‌యార్డుకు ఆదివారం రైతులు వాహనాల్లో టమాటాలను తీసుకొచ్చారు. ఇక్కడ తగినంత పార్కింగ్ స్థలం లేకపోవడంతో తమ వాహనాలను మండీల ముందు ఉంచారు. గత కొన్ని రోజులుగా రైతులు జాక్‌పాట్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవి మనసులో పెట్టుకొన్న మండీ యజమానులు రైతులపై కక్ష గట్టారు.
ఈనేపథ్యంలో ఆదివారం రాత్రి 8 గంటలకు ఓ యజమాని తన మండీ ముందు వాహనాలు పెట్టారంటూ మరో రైతుకు చెందిన ట్రాక్టర్ తీసుకొని రైతుల వాహనాలపైకి వేగంగా ఎక్కించాడు. ఈసంఘటనలో పెద్దమండ్యం మండలానికి చెందిన ఇద్దరు రైతుల ద్విచక్రవాహనాలు ట్రాక్టర్ చక్రాల కింద పడి ధ్వంసం అయ్యాయి. కాగా ఒక బొలోరో వాహనం, ఒక ఆటో దెబ్బతిన్నాయి.
కట్టలు తెంచుకున్న రైతుల ఆగ్రహం
ఈ ఘటనతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండీల యజమానులపై తిరగబడ్డారు. అక్కడి నుంచి మార్కెట్ యార్డు ముందువైపుకు చేరుకొని యార్డుగేట్లు మూసేసి ఆందోళకు దిగారు. మండీల యజమానులు వచ్చి జరిగిన నష్టానికి పరిహారం చెల్లిస్తామని చర్చలు జరిపినా ఫలించలేదు. విషయం తెలుసుకొన్న పోలీసులు, మార్కెట్‌కమిటీ అధికారులు అక్కడికి చేరుకొన్నారు. మార్కెట్‌కమిటీ సూపర్‌వైజర్ నయూబ్ బాషా రైతులతో చర్చించారు.
‘మీరు పట్టించుకోకపోవడంతో మండీల యజమానులు ఇలా రెచ్చిపోతున్నారు’ అంటూ రైతులు ఈ సందర్భంగా పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జాక్‌పాట్‌లు వద్దన్నందుకే మండీల యజమానులు తమపై కక్షగట్టి మమ్మల్ని చంపాలను చూస్తున్నారని మండిపడ్డారు. జాక్ పాట్‌లు అరికట్టాల్సిన అధికారుల చేతగాని తనం వల్లే ఈ ఖర్మ పట్టిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటన జరిగినప్పుడు రైతులు వాహనాల వద్ద ఉండి ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
కేసు నమోదుకాకుండా ‘మేనేజ్’ చేయడం కొసమెరుపు!
సదరు మండీల యజమానులపై చర్యలు తీసుకొని లైసెన్స్‌లు రద్దు చేస్తామని మార్కెట్ కమిటీ అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. బాధిత రైతులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని ఏఎస్‌ఐ గజేంద్ర పేర్కొన్నారు. అయితే రాత్రంతా మార్కెట్ కమిటీ అధికారులు, మండీల యజమానులు బాధిత రైతులను లోబరుచుకొని బెదిరింపులకు గురి చేసి కేసు నమోదు కాకుండా చేయడం ఈ మొత్తం వ్యవహారంలో కొసమెరుపు.
జాక్‌పాట్ అంటే..
మండీలకు రైతులు 100 టమాటా బుట్టలను తీసుకునివస్తే, అందులో 15 నుంచి 20 బుట్టలను ఉచితంగా వ్యాపారులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్ని బుట్టలు ఉచితంగా ఇవ్వాలనే అంశంపై నిర్ణయాన్ని వ్యాపారులే తీసుకోవడం ఇక్కడ గమనించాల్సిన మరో విషయం.