మా భూముల జోలికొస్తే పోరాటమే | Farmers strongly opposed land acquisition | Sakshi
Sakshi News home page

మా భూముల జోలికొస్తే పోరాటమే

Apr 20 2026 4:57 AM | Updated on Apr 20 2026 4:57 AM

Farmers strongly opposed land acquisition

ఉండవల్లిలో రోడ్ల విస్తరణ కోసం భూ సేకరణ  

రైతులతో చర్చించకుండానే నోటిఫికేషన్‌ జారీ  

తాడేపల్లిలో సమావేశమై తీవ్రంగా వ్యతిరేకించిన రైతులు  

తాడేపల్లి రూరల్‌: అమరావతి ముఖ ద్వారమైన గుంటూరు జిల్లా ఉండవల్లిలో పంట పొలాలను తీసుకునేందుకు ప్రభుత్వం ఈ నెల 16న భూ సేకరణ కింద నోటిఫికేషన్‌ విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ రైతులంతా ఆదివారం సమావేశమయ్యారు. ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్లాలని, వేర్వేరుగా పోరాటం చేస్తే ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందని, గతంలో భూ సమీకరణకు ఏవిధంగా పోరాడామో ఇప్పుడూ అదేవిధంగా పోరాటానికి సిద్ధం కావాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. 

ఒకవేళ ప్రభుత్వం దిగొచ్చి భూ సేకరణ నోటిఫికేషన్‌ వెనక్కి తీసుకుంటే... చర్చించి ఏ విధంగా అభివృద్ధి చేస్తారో, రైతులకు ఎలా న్యాయం చేస్తారో అడగడానికి సిద్ధంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఉండవల్లిలోని పంట పొలాల్లో నుంచి వచ్చే సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూమిని ప్రభుత్వానికి భూ సమీకరణకు ఇచ్చేందుకు గతంలో కొంత మంది రైతులు 9.3 పత్రాలను అందజేశారు. ప్రస్తుతం రోడ్డు నిర్మాణానికి పోను మిగిలిన భూములకు కూడా భూ సేకరణ నోటిఫికేషన్‌ ఇస్తారని తెలియడంతో వారు తీవ్రంగా వ్యతిరేకిస్తూ అవసరమైతే కోర్టుల ద్వారా 9.3 పత్రాలను వెనక్కి తీసుకుంటామని తెలిపారు. 

ఉండవల్లిలో భూ సమీకరణకు భూములు ఇచ్చిన రైతులకు ఉండవల్లి రేగడ పొలాన ప్లాట్లు కేటాయించారు. ఆ ప్లాట్లకు సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌కి, పాత జాతీయ రహదారికి అనుసంధానం చేస్తూ రోడ్ల నిర్మాణం చేపట్టే ఆలోచనలో ప్రభుత్వం, సీఆర్‌డీఏ ఉందని, మొట్టమొదటగా గుంటూరు చానల్‌ ఒడ్డున సీడ్‌ యాక్సెస్‌ నుంచి మాతాశ్రీ ఆశ్రమం వరకు 160 మీటర్ల రోడ్డు నిర్మాణానికి 34 ఎకరాల రైతులకు భూ సేకరణ నోటిఫికేషన్‌ ఇచ్చారు. 

త్వరలోనే కొండవీటి వాగు ఎత్తిపోతల పథకానికి, కొండవీటి వాగు వెడల్పుకు, ఉండవల్లి – అమరావతి రోడ్డు నుంచి నాయుళ్ల రామమందిరం, రెడ్ల రామమందిరం మీదుగా ఉండవల్లి దళితవాడ వరకు... అక్కడి నుంచి నులకపేట ఫైరింగ్‌ స్టేషన్‌ మరోవైపు పెనుమాక నుంచి సొరంగం ఏర్పాటు చేసి ఉండవల్లి కరకట్ట వైపు కూడా రోడ్ల నిర్మాణానికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. 

వీటన్నింటికి విడివిడిగా భూ సేకరణకు, ఇళ్లను తొలగించేందుకు నోటిఫికేషన్‌ త్వరలో ఇస్తారని, మనందరం ఐక్యంగా పోరాటం చేసి ప్రభుత్వం చర్చలకు వచ్చేవిధంగా నిలబడాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం నాయకులు దొంతిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రైతులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.  లేని పక్షంలో కలిసొచ్చే పార్టీలతో రైతులకు మద్దతుగా నిలిచి పోరాటం చేస్తామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement