భూములివ్వం.. గోబ్యాక్‌.. గోబ్యాక్‌ | Farmers oppose capital land consolidation | Sakshi
Sakshi News home page

భూములివ్వం.. గోబ్యాక్‌.. గోబ్యాక్‌

Jul 6 2025 5:12 AM | Updated on Jul 6 2025 7:48 AM

Farmers oppose capital land consolidation

రాజధాని భూ సమీకరణ సభలో ఎమ్మెల్యే, అధికారులను తరిమికొట్టిన పొన్నెకల్లు రైతులు 

సమీకరణ పేరుతో రైతుల పొట్టగొట్టేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని మండిపాటు 

ఒక్కమాట కూడా మాట్లాడనీయకుండా అడ్డుకున్న రైతులు.. గరికపాడు సభ వాయిదా 

పీఎం కిసాన్, రైతు భరోసా పోను మాకు అదనంగా దక్కేది రూ.4 వేలేనా అని ప్రశ్నల వర్షం 

భూములిచ్చేందుకు రైతులు ససేమిరా అంటుండటంతో దొడ్డిదారిలో తీర్మానాలు 

రాజధాని గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారుల బరితెగింపు

తాడికొండ: ‘గోబ్యాక్‌ గోబ్యాక్‌.. మా భూములిచ్చేది లేదు.. గోబ్యాక్‌ గోబ్యాక్‌’.. అంటూ రాజధాని భూసమీకరణ గ్రామ­సభలలో రైతులు పార్టీలకు అతీతంగా శనివారం కూడా పెద్దఎత్తున నిరసన గళం వినిపించారు. సభ జరిగిన ప్రతీచోటా స్థానిక టీడీపీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, అధికారుల­ను ఉక్కిరిబిక్కిరి చేశారు. ప్రశ్నలతో హోరెత్తించారు. భూ­ము­లిచ్చేందుకూ ఎవరూ సిద్ధంగా లేరని తెగేసి చెప్పారు. లక్షల ఎకరాలు తీసుకుని ఏం చేస్తారంటూ వారి­పై విరుచుకుపడ్డారు.

రాజధాని భూసమీకరణ సమాయత్త సభలలో భాగ­ంగా గుంటూరు జిల్లా తాడికొండ మండలం గరికపాడులో గ్రా­మసభ నిర్వహించిన అనంతరం తాడి­కొండ విచ్చేసిన ఎమ్మె­ల్యే శ్రావణ్‌కుమార్, అధికారులు సభ మొదలు పెట్టేందుకు మైకు అందుకోగానే రైతులు వారిని అడుగడుగునా అడ్డుకుంటూ నినాదాలతో హోరెత్తించారు. భూసమీకరణ పే­రు­తో రైతుల పొట్టగొట్టేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం యత్ని­స్తోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘అసలు మా ప్రాణ సమానమైన భూములు ఎందుకివ్వాలి’.. అని పలువు­రు సూ­టి­గా ప్రశ్నించారు. ఒక్క­మాట కూడా మాట్లాడకుండా వెళ్తే మంచిదని, అంతకుమించి మాట్లాడితే ఒప్పుకునేదిలేదని రైతులు తీవ్రస్థాయిలో హెచ్చ­రించారు. 

గతంలో 33 వేల ఎకరాలు ఇచ్చి న రైతు­లకు న్యాయం చేయలేదుగానీ.. ఇప్పుడు ప్రై­వేటు కంపెనీలకు మా భూములు ధారాదత్తం చేసి మమ్మల్ని రోడ్డున పడేసేందుకు వచ్చారా.. భూములు ఇవ్వబోమని రైతులు తెగేసి చెప్పారు. పైగా.. పీఎం కిసాన్‌ కింద కేంద్రం ఇప్పటికే రూ.6వేలు ఇస్తోందని.. రైతుభరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.20వేలు ఇస్తానని హామీ ఇచ్చి ందని.. ఇలా మొత్తం రూ.26 వేలు వస్తుందని.. కానీ, మీరిచ్చే రూ.30 వేలు కౌలు ద్వారా మాకు అదనంగా దక్కేది కేవలం నాలుగు వేలేనా అని ముక్తకంఠంతో రైతులు నిలదీశారు. 

పైగా.. భూమిపై వచ్చే పంట సాగు ఆదాయం కూడా తాము కోల్పోతామని వారు కుండబద్దలు కొట్టారు. దీంతో.. చేసేది­లేక సభ వాయిదా వేస్తున్నట్లు ఎమ్మెల్యే, అధికారులు ప్రకటించి అక్కడ నుంచి జారుకున్నారు. పొన్నేకల్లు సభ­లోనూ ఎమ్మె­ల్యే శ్రావణ్‌కుమార్, ఆర్డీఓ శ్రీనివాస­రావు తదితర అ«ధికారులను రైతులు తరిమికొట్టి సభ జరగకుండా అడ్డుకున్నా­రు.  

నిడుముక్కలలోనూ ఉక్కిరిబిక్కిరి.. 
అనంతరం.. నిడుముక్కల గ్రామంలో నిర్వహించిన సభలోనూ రైతులు వారిని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. గ్రామానికి చెందిన రైతు బండ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ..  మాకెలాంటి ఇబ్బందుల్లేకుండా చూస్తామని మీరు మాకు భరోసా ఇస్తారా’.. అని సభా ముఖంగా ప్రశ్నించడంతో ఎమ్మెల్యే, అధికారులు తెల్లముఖం వేశారు. రైతుల అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసేందుకు యత్నిస్తాం తప్ప మాకేం సంబంధమని వారు మాట దాటవేశారు.  

దయచేసి మా భూములు వదిలేయండి.. 
ఈ సభలోనే ఓ మహిళ మాట్లాడుతూ.. ‘మీరు చెప్పినవన్నీ జరుగుతాయా? ఒకవేళ ఇవన్నీ జరగకపోతే మీరు మాపై దయుంచి మాకు కూడా చట్టాలు వర్తించేలా జీఓ తీసుకురండి.. అప్పుడు రైతులకు న్యాయం జరగకపోతే మీపై చర్యలు తీసుకుంటాం.. అంతేగానీ, అధికారం ఉందని మీరు భూములు తీసుకెళ్లిపోతే తర్వాత మేం టెంట్లు వేసుకుని ధర్నాలు, నిరసనలు చేయలేం.. దయచేసి మా భూములు వదిలేయండి’.. అని తీవ్ర స్వరంతో చెప్పారు. 

భూములివ్వడానికి ఎవరూ సుముఖంగా లేరు.. 
ఇక మండల టీడీపీ అధ్యక్షుడు తలశిల ప్రసన్న మాట్లాడుతూ.. గతంలో పూలింగ్‌ సమయంలో రూ.2 లక్షలు ఉన్న ము­ంపు పొలాలకు ఇచ్చి న ప్యాకేజీ.. ఇప్పుడు రూ.3 కోట్ల నుంచి రూ.7 కోట్లు పలుకుతున్న మా మెరక పొలాలు ఒక­టేనా అని ప్రశ్నించారు. అప్పుటి పరిస్థితులు వేరు.. ఇప్పటి పరి­స్థితులు వేరన్నారు. అప్పటి అదే ప్యాకేజీనే ఇప్పుడు మాకి­స్తే ఎలా చెల్లుబాటు అవుతుందని ప్రశ్నించారు. మీరు హామీ ఉండి మా తరఫున పోరాటం చేస్తానంటే మీ హామీ మీద అయితే భూములిస్తామన్నారు. దీంతో ఎమ్మె­ల్యేకు ఏం చెప్పాలో అర్ధంకాలేదు. 

ఇంతలో మరో రైతు మైకు అందుకుని.. ‘అందరి తరఫున నేను మాట్లాడుతున్నా.. ఇప్పుడు మా భూములకు ధరలు ఉన్నా­యి. భూములివ్వడా­నికి రైతులెవరూ సుముఖంగాలేరు. ము­ందు 44 వేల ఎక­రాలు అన్నారు.. ఆ గ్రామాల్లో సభలు పూ­ర్త­య్యాక మళ్లీ అద­నపు గ్రామాల్లో సభలు నిర్వహిస్తున్నా­రు. అసలు ఎంత సమీక­రణ చేస్తారు.. లక్షల ఎకరాలు తీసు­కుని ఏం చేస్తారు’ అని ఆయన ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్, అధికారులను నిలదీశారు.  

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రైతుల ఫైర్‌.. 
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘గతంలో 33 వేల ఎకరాలు తీసుకుంటే దానికి రైతుల ప్లాట్లు ఇతర అవసరాలకు 60 శాతం భూమి పోగా మిగిలిన భూమిలో అభివృద్ధి చేస్తున్నారు.. అది చాలదు కనుక పెద్ద సంస్థలకు ఇచ్చేందుకు ల్యాండ్‌ బ్యాంక్‌ కోసం సమీకరణ చేస్తున్నాం’ అని చెప్పడంతో రైతులు మండిపడ్డారు. దీంతో.. భూములిచ్చేందుకు రైతులు ససేమిరా అంటుండడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు బరితెగించి భూసమీకరణకు అనుకూలంగా తీర్మానాలు చేసినట్లు తమకు అనుకూలమైన వారితో సంతకాలు పెట్టించుకుంటూ నివేదికలు సిద్ధంచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement