సీజన్ ముగిసినా 19 శాతం దాటని ఈ–కేవైసీ నమోదు
ఆర్బీకే సిబ్బందికి లక్ష్యాలు నిర్దేశించినా ముందుకు సాగని వైనం
కరువు సాయం, బీమా పరిహారం, పంటల విక్రయాలకు ఈ–కేవైసీ తప్పనిసరి
రైతులకు శాపంగా మారిన చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం
సాక్షి, అమరావతి: ఐదేళ్ల పాటు ప్రతిష్టాత్మకంగా, పారదర్శకంగా అమలైన ఈ–క్రాప్ నమోదును చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. ఈ–పంట నమోదులో ప్రభుత్వ నిర్లక్ష్యం అన్నదాతల పాలిట శాపంగా మారింది. చంద్రబాబు పుణ్యమా అని రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుంటే.. ప్రభుత్వం మాత్రం కీలకమైన ఈ–పంట నమోదులో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తోంది. సీజన్ ముగిసినప్పటికీ ఈ–పంట నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. స్వీయ నమోదు, ప్రైవేటు సర్వేయర్ల నియామకం, సచివాలయ సిబ్బందికి బాధ్యతలు.. ఇలా ఎన్ని ప్రయోగాలు చేసినా ఫలితాలు మాత్రం శూన్యమే.
మరో రెండు వారాల్లో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతున్న తరుణంలో రైతుల ఈ–పంట నమోదు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరోవైపు కరువు బారిన పడిన రైతులు పంట నష్టపరిహారం (ఇన్‌పుట్ సబ్సిడీ) పొందాలన్నా, పంటల బీమా పరిహారానికి అర్హత పొందాలన్నా ఈ–కేవైసీ కీలకం. సీజన్ ముగిసి పదిరోజులు కావొస్తున్నా ఈ–కైవేసీ నమోదు మాత్రం 19 శాతానికి పరిమితమైంది.
స్వీయ నమోదుకు స్పందన శూన్యం..
ఈ–పంట నమోదులో 2024 ఖరీఫ్ సీజన్‌లో రైతులకు మొదలైన కష్టాలు ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో తీవ్రరూపం దాల్చాయి. సీజన్ ప్రారంభమైన 20 రోజుల్లో ఈ–పంట నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుంది. కానీ రెండున్నరేళ్లుగా ఏ ఒక్క సీజన్‌లోనూ అలా జరగలేదు. అప్లోడ్ చేసిన పంట ఫొటోలను కృత్రిమ మేధతో విశ్లేషణ చేస్తామని, ఈ పంట నమోదుతో పాటు ఈ–కేవైసీ సమాంతరంగా చేస్తామని బాబు ప్రభుత్వం డబ్బాలు కొట్టింది. కానీ, క్షేత్రస్థాయిలో ఘోరంగా విఫలమైంది.
లక్ష్యానికి ఆమడ దూరంలో..
డిజిటల్ ఈ–క్రాప్ సర్వేలో ల్యాండ్ పార్శిళ్లతో పాటు రైతుల ఈ–కేవైసీ 100 శాతం పూర్తి చేయాలి. అప్పుడే కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధులు మంజూరవుతాయి. రాష్ట్రంలో 2.76కోట్ల ల్యాండ్ పార్శిళ్లు ఉండగా, దాదాపు రెండు నెలల పాటు నమోదు ప్రక్రియ నత్తనడకనే సాగింది. చివరికి ప్రైవేటు సర్వేయర్లను నియమించడం, ఆర్బీకే సిబ్బందికి లక్ష్యాలను నిర్దేశించడంతో దాదాపు 2.62 కోట్ల ల్యాండ్ పార్శిళ్లలో సాగు వివరాలను నమోదు చేయగలిగారు. కానీ కీలకమైన రైతుల ఈ–కేవైసీ నమోదు ఘోరంగా సాగుతోంది.
ఈ సీజన్‌లో 84.34 లక్షల మంది రైతుల ఈ–కేవైసీ నమోదు లక్ష్యంగా నిర్దేశించారు. ఈ బాధ్యతను సచివాలయ సిబ్బందికి అప్పగించారు. మొబైల్ యాప్‌లోనే ఈ–పంట/ఈ–కేవైసీ పూర్తి చేసే ఏర్పాటు చేశారు. ఇందుకోసం వారికి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. అయినా పని ఒత్తిడి సాకుతో వారు ఈ–కేవైసీ నమోదు జోలికి పోవడం లేదు.ఆర్బీకే సిబ్బందికి లక్ష్యాలను నిర్దేశించినప్పటికీ వ్యవసాయేతర పనుల కారణంగా వారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఫలితంగా ఈ–కైవేసీ నమోదు ముందుకు సాగడం లేదు.
ఓ వైపు ఈ నెల 26 నుంచి ధాన్యం కొనుగోళ్లు మొదలవుతున్నాయి. ఇతర పంట ఉత్పత్తులు మార్కెట్‌కు వస్తున్నాయి. మరోవైపు పంటల బీమా కోసం ప్రీమియం నమోదు చేసిన రైతుల వివరాలను బీమా కంపెనీలకు పంపాల్సిన సమయం ముంచుకొస్తోంది. కానీ రైతుల ఈ–కేవైసీ మాత్రం లక్ష్యానికి ఆమడ దూరంలో ఉంది. వారానికి నాలుగైదు సార్లు వ్యవసాయ శాఖ డైరెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేస్తున్నా ఫలితం మాత్రం కన్పించడం లేదు. దీంతో ఈ–కేవైసీ విషయంలో ఏ విధంగా ముందుకెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొంది.


