ఓటర్లను ‘చంపేస్తున్న’ టీడీపీ | Sakshi
Sakshi News home page

ఓటర్లను ‘చంపేస్తున్న’ టీడీపీ

Published Sun, Jun 25 2023 3:55 AM

A false complaint is that living voters are dead - Sakshi

పిఠాపురం: తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా కాకినాడ జిల్లాలో తమ అనుచరులకు భర్తలు బతికుండగానే వితంతు  పింఛన్లు ఇప్పించారు ఇక్కడి టీడీపీ నేతలు కొందరు. ఇప్పుడు బతికున్న ఓటర్లను చనిపోయినట్లుగా చిత్రీకరిస్తున్నారు. టీడీపీ ఫిర్యా­దుతో అధికారులు విచారణ చేపట్టగా, దాదాపు అందరూ జీవించే ఉన్నట్టు వెల్లడైంది. టీడీపీ తీరుపై జిల్లా వాసులు తీవ్ర ఆగ్ర­హం వ్యక్తం చేస్తున్నారు.

తప్పుడు ఫిర్యా­దులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. జిల్లాలోని కొందరి పేర్లు, వారి ఓటరు నంబరు ఇతర వివరాలు ఇచ్చి, వారు చనిపోయారని, ఓట్లను తొలగించాలని టీడీపీ ఎలక్టోరల్‌ కోఆర్డినేటర్‌ కోనేరు సురేష్‌ పేరుతో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు అందింది. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ వేలాది నకిలీ ఓట్లు, చనిపోయిన వారి ఓట్లు ఉన్నట్టుగా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

టీడీపీ ఎలక్టోరల్‌ సెల్‌ సభ్యులు ఇంటింటికీ  వెళ్లి విచారణ చేసి వీటిని గుర్తించినట్లు అందులో తెలిపారు. దీనిపై ఎన్నికల కమిషన్‌ విచారణకు ఆదేశించింది. బూత్‌ లెవల్‌ అధికారులు నాలుగు రోజులుగా గ్రామాల్లో విచారణ చేపట్టారు. టీడీపీ నేతలు చనిపోయారని చెబుతున్న వారిలో 90 శాతానికి పైగా ఓటర్లు బతికే ఉన్నారని గుర్తించారు. విదేశాలకు వెళ్లి చదువుకుంటున్న విద్యార్థుల ఓట్లను డబుల్‌  ఎంట్రీలని, ఫేక్‌ ఓట్లని టీడీపీ ఫిర్యాదు చేయడం గమనార్హం. 

మచ్చుకు కొన్ని ఉదాహరణలు.. 
టీడీపీ ఫిర్యాదు తప్పుడుది అనడానికి మచ్చుకు కొన్ని ఉదాహరణలు ఇవి. పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొత్తపల్లి బూత్‌ నంబరు 206లో ఓటరు కార్డు నంబరు వైఓయూ 1794924 మామిడాల వెంకటరమణ, వైఓయూ 0130591 వి.బుల్లి అప్పారావు, వైఓయూ 1791920 చోడిశెట్టి మాణిక్యం, వైఓయూ 1791805 సానా సీతారాముడు చనిపోయినట్లుగా టీడీపీ ఫిర్యాదులో పేర్కొన్నారు.

వాస్తవానికి వారంతా జీవించే ఉన్నారు. అధికారులు వారి ఇంటికి వెళ్లగా... వారే సమాధానాలిచ్చారు. ఈ విచారణకు అధికారులు రోజుల తరబడి సమయాన్ని కేటాయిస్తున్నారు. దీనివల్ల అధికారుల విలువైన సమయంతోపాటు ప్రజా ధనమూ వృథా అవుతోంది.

విచారణ జరుపుతున్నాం 
చనిపోయిన వారివి, నకిలీ ఓట్లు ఉన్నట్లు టీడీపీ ఎలక్టోరల్‌ సెల్‌ నుంచి ఎన్నికల కమిషన్‌కు వచ్చిన ఫిర్యాదు మాకు పంపించారు. దానిపై గ్రామాల్లో విచారణ చేయిస్తున్నాం. నకిలీలు, చనిపోయిన వారు ఉంటే వాటిని తొలగిస్తాం. లేకపోతే యథావిధిగా  ఉంటాయి. ఎవరో ఫిర్యాదు ఇచ్చినంత మాత్రాన ఎవరి ఓటు హక్కు పోదు. పూర్తిగా విచారణ చేసే ఎన్నికల కమిషన్‌కు పంపుతాం.  – కె.సుబ్బారావు, ఎన్నికల ఓటరు జాబితా నమోదు అధికారి,  పిఠాపురం నియోజకవర్గం

నేను చనిపోవడం ఏమిటి? 
కొత్తపల్లి బూత్‌ నంబరు 206లో నాకు ఓటు ఉంది. 40 ఏళ్లుగా ఓటు వేస్తున్నా. నేను చనిపోయానని, ఓటు తొలగించాలంటూ ఎవరో ఫిర్యాదు చేశారని అధికారులు వచ్చి అడిగారు. అసలు నేను చనిపోవడమేమిటో నాకు అర్థం కాలేదు. ఇలాంటి ఫిర్యాదులు ఇచ్చే వారిపై చర్యలు తీసుకోవాలి.  – మామిడాల వెంకట రమణ 

క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలి
కొత్తపల్లి బూత్‌ నంబరు 206లో నాకు ఓటు ఉంది. 50 ఏళ్లుగా ఓటు వేస్తున్నా. ఇంతకు ముందు టీడీపీ వారెవరూ మా ఇంటికి వచ్చి విచారణ చేయలేదు. ఇప్పుడు అధికారులు వచ్చి మీరు ఉన్నారా.. అని అడుగుతున్నారు. నేను బతికే ఉన్నానని చెప్పుకోవాల్సి వచ్చింది. తప్పుడు ఫిర్యాదులు ఇచ్చిన వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలి.   – సానా సీతారాముడు

నేను ఆరోగ్యంగానే ఉన్నా
నాకు 86 సంవత్సరాలు. ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉన్నాను. కొత్తపల్లి బూత్‌ నంబరు 206లో 60 ఏళ్లుగా ఓటు వేస్తున్నా. అసలు నేను ఎక్కడ ఉంటానో ఎలా ఉంటానో కూడా తెలియకుండా ఎవరో ఫిర్యాదు చేయడం ఏమిటి? ఆరోగ్యంగా ఉన్న వారిని చంపేస్తారా? అలాంటి వారిపై వెంటనే చర్యలు 
తీసుకోవాలి.    – చోడిశెట్టి మాణిక్యం 

Advertisement
 
Advertisement