వాటర్‌ ప్లాంట్లపై కొరడా

Extensive inspections across AP On Unauthorized Water Plants - Sakshi

రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు

నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 25 ప్లాంట్లపై దాడులు

పెద్ద మొత్తంలో బాటిళ్లు, ప్యాకెట్లు సీజ్‌ చేసిన అధికారులు

సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో అనధికారికంగా నడుస్తున్న మినరల్‌ వాటర్, ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ ప్లాంట్లపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. ‘మాయాజలం’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై స్పందించిన ఫుడ్‌ సేఫ్టీ, విజిలెన్స్‌ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్లాంట్లలో తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. బుధవారం రాష్ట్రంలోని 25 వాటర్‌ ప్లాంట్లపై దాడులు జరిపారు. అనంతపురం జిల్లాలో 6 (సాయి సవేరా, హనీ, ఎస్‌వీఆర్, సాయి సిరి ఆక్వా, అమృతబిందు, ఎస్‌వీ ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌) వాటర్‌ ప్లాంట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 1 (ఉమా ఆక్వా), విజయనగరం జిల్లాలో 2 (ఆదిత్య మినరల్‌ వాటర్, శ్రీవారి ఆక్వా ఇండస్ట్రీస్‌), చిత్తూరు జిల్లాలో 2 (శ్రీకృష్ణా మినరల్స్, కింగ్‌ ఆక్వా), విశాఖపట్నం జిల్లాలో 1 (లక్ష్మీ ఆక్వా ఇండస్ట్రీ), కృష్ణా జిల్లాలో 2 (ఎస్‌ఎస్‌ అల్ట్రా టెక్, కె–వాటర్‌ ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ ప్లాంట్‌)లతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు, కర్నూలు జిల్లాలో 3, నెల్లూరు జిల్లాలో 3, కడప జిల్లాలో 3 వాటర్‌ ప్లాంట్లలో అధికారులు తనిఖీలు నిర్వహించారు.

ఐఎస్‌ఐ గుర్తింపు లేకుండా..
విజయవాడ కృష్ణలంకలోని కె–వాటర్‌ ప్లాంట్‌లో ఈ–కామ్‌ పేరిట తెలంగాణలోని కీసర చిరునామాతో రిజిస్ట్రేషన్‌ చేసిన సర్టిఫికేషన్‌ ఉన్న పోస్టర్లు అతికించి ఉన్నాయి. ఈ ప్లాంట్‌కు ఐఎస్‌ఐ గుర్తింపు ఉన్నట్టు పోస్టర్లపై ఉంది. జోనల్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ పూర్ణచంద్రరావు ఆన్‌లైన్‌లో పరిశీలించడంతో అది బోగస్‌ అని తేలింది. చాలా ప్లాంట్లు ఐఎస్‌ఐ గుర్తింపు లేకుండా నడుస్తున్నట్టు గుర్తించారు. వాటర్‌ ప్లాంట్లపై దాడులు కొనసాగిస్తామని జాయింట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ స్వరూప్‌ ‘సాక్షి’కి చెప్పారు.

అదే నీరు.. పేరే మారు!
అధికారుల లెక్కల ప్రకారం విజయవాడ నగరంతోపాటు కృష్ణా జిల్లాలో అనుమతులు లేకుండా 1,200కు పైగా వాటర్‌ ప్లాంట్లు నడుస్తున్నాయి. వాస్తవానికి రిజిస్టరైన పేరుతోనే ప్లాంట్‌లో వాటర్‌ బాటిళ్లకు సీళ్లు వేసి మార్కెట్లో విక్రయించాలి. నగరంలో పలు ప్లాంట్లు అందుకు భిన్నంగా వివిధ రంగులు, మూడు నాలుగు ఆకర్షణీయమైన పేర్లతో లేబుళ్లను ముద్రిస్తున్నాయి. 

ఆ ప్లాంటులో నీటినే బాటిళ్లలోకి నింపి వేర్వేరు బ్రాండ్లతో అమ్మకాలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం అన్ని అనుమతులతో పాటు వాటర్‌ బాటిళ్లపై తయారీదారు పేరు, తయారీ తేదీ, తయారీ స్థలం చిరునామా వంటివి స్పష్టంగా ముద్రించి ఉండాలి. అలాంటివేమీ లేకుండా వాటర్‌ బాటిళ్లను నింపి విక్రయిస్తే మిస్‌ బ్రాండెడ్‌ కింద కేసు నమోదు చేసి రూ.3 లక్షల వరకు జరిమానా విధిస్తామని జోనల్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ పూర్ణచంద్రరావు ‘సాక్షి’కి చెప్పారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top