ఏపీ నుంచి 42,935 టన్నుల అరటి ఎగుమతి

Exports Of 42935 Tonnes Of Bananas From AP - Sakshi

రాజ్యసభలో విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం సమాధానం 

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ నుంచి 2020–21లో 42,935 మెట్రిక్‌ టన్నుల అరటి పళ్లు ఎగుమతి అయినట్లు కేంద్రం తెలిపింది. స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ అయిన అగ్రికల్చరల్, ప్రాసెస్డ్‌ ఫుడ్‌ ప్రొడక్టస్‌ ఎక్స్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (అపెడా) వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల విధానం కింద ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కడప జిల్లాలను ఎగుమతులకు అనువైన అరటిసాగుకు సానుకూలమైన ప్రాంతాలుగా గుర్తించిందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలసి అరటి ఎగుమతుల కోసం అపెడా అనేక చర్యలు చేపడుతోందని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్యశాఖ సహాయమంత్రి అనుప్రియ పటేల్‌ సమాధానం ఇచ్చారు.

జాతీయ పరిశోధనా సంస్థలు, ఉద్యానవన విశ్వవిద్యాలయాల సహకారంతో అరటి సాగును ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సంస్థల ఏర్పాటును ప్రోత్సహిస్తూ అంతర్జాతీయ సర్టిఫికేషన్‌కు అవసరమైన సాగు విధానాలను అమలు చేస్తోందన్నారు. క్రయ–విక్రయదారులతో సమావేశాలు నిర్వహిస్తూ ఎంపికచేసిన క్లస్టర్లలో నూరుశాతం టిష్యూ కల్చర్‌ అరటిని సాగుచేసేందుకు ప్రోత్సహిస్తోందని తెలిపారు. అరటి ఎగుమతుల రవాణాకు వీలుగా ముంబైలో పోర్టుకు నేరుగా ప్రత్యేక రైలును ప్రవేశపెట్టినట్లు చెప్పారు.

దేశంలో 1,57,919 పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్‌ సదుపాయం
ఈ ఏడాది జూలై 9 నాటికి దేశంలో 1,57,919 పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్‌ సదుపాయం కల్పించినట్లు కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ సహాయమంత్రి కపిల్‌ మోరేశ్వర్‌ తెలిపారు. 2023 ఆగస్టుకల్లా అన్ని గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందించాలని లక్ష్యం పెట్టుకున్నట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. భారత్‌నెట్‌ ప్రాజెక్ట్‌ ఫేజ్‌–1 కింద కేవలం అండర్‌గ్రౌండ్‌ ఆప్టిక్‌ ఫైబర్‌ కేబుల్‌ కింద గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు కల్పించే పనులు చేపట్టడంతో రైట్‌ ఆఫ్‌ వే సమస్యలతో ప్రాజెక్ట్‌ అమలులో ఇబ్బందులు తలెత్తాయన్నారు. భారత్‌నెట్‌ ఫేజ్‌–2 కింద ఆంధ్రప్రదేశ్‌తో సహా 8 రాష్ట్రాల్లో 65 వేల పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్‌ సదుపాయం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సారథ్యంలో అమలు జరుగుతోందని, లక్ష్యం మేరకు పనులు జరగనందున ప్రాజెక్టు గడవుపై ప్రభావం పడుతోందని పేర్కొన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top